Mutual Funds: మ్యూచువల్‌ ఫండ్లు మదుపు మార్గంలో వైవిధ్యంగా

కష్టపడి సంపాదించిన సొమ్మును స్టాక్‌ మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్నారా? నేరుగా షేర్లు కొనడం అందరికీ సాధ్యం  కాకపోవచ్చు.

Published : 31 May 2024 00:52 IST

కష్టపడి సంపాదించిన సొమ్మును స్టాక్‌ మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్నారా? నేరుగా షేర్లు కొనడం అందరికీ సాధ్యం  కాకపోవచ్చు. అప్పుడు ప్రత్యామ్నాయ మార్గం మ్యూచువల్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో కొత్తగా ఫండ్లలో మదుపు చేస్తున్న వారి సంఖ్య నెలకు కొన్ని లక్షల్లోనే ఉంటోందని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఫండ్‌ మార్గంలో ప్రయాణించాలనుకునే వారు, ఇప్పటికే పెట్టుబడులు పెడుతున్న మదుపరులూ వైవిధ్యంపై కాస్త దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

అన్ని రకాల పెట్టుబడుల పనితీరూ ఒకేలా ఉండదు. అందుకే వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మార్కెట్‌ పనితీరుపై ఆధారపడి పనిచేసే మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడు. చాలామంది మదుపరులు ఫండ్లలో మదుపు చేస్తుంటారు కానీ, ఎంత వైవిధ్యంగా తమ పెట్టుబడులు ఉన్నాయన్నది చూసుకోరు. కొంతమంది అనేక పథకాల్లో మదుపు చేసి, అతిగా వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు. ఇలా చేయడం వల్ల పెట్టుబడులను నిర్వహించడం కష్టతరం అవుతుంది. ఈ రెండు పద్ధతులూ పొరపాటే. 

నష్టభయం ఆధారంగా...

పెట్టుబడిదారులు ఎప్పుడూ తమ నష్టభయం భరించే శక్తి ఆధారంగానే పెట్టుబడి పథకాలను ఎంచుకోవాలి. చిన్న వయసులో ఉన్న వారు ఈక్విటీ ఆధారిత పథకాలకు అధిక మొత్తం కేటాయించవచ్చు. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న వారు డెట్‌ పథకాలను ఎక్కువగా పరిశీలించాలి. మీ పోర్ట్‌ఫోలియోలో 80 శాతం ఈక్విటీలకూ, 20 శాతం డెట్‌ పథకాలకూ కేటాయింపులు చేశారనుకుందాం. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడుల్లోనూ వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేలా పథకాలను ఎంపిక చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ నష్టభయం అధికంగా ఉన్న పథకాల నుంచి కాస్త సురక్షిత పథకాలకు పెట్టుబడులను మళ్లించాలి.

ఒకే తరహావి ఉండకుండా..

ఎంచుకున్న మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడుల తీరునూ నిశితంగా గమనించండి. వాటి షేర్ల ఎంపిక ప్రక్రియ ఒకేలా ఉంటే ఆ సారూప్య పథకాల్లో ఏదో ఒకదానినే ఎంచుకోవాలి. బహుళ పథకాలను ఎంచుకున్నా, అవి పెట్టుబడి పెట్టే షేర్లు ఒకే విధంగా ఉంటే.. పెద్దగా వైవిధ్యం ఉండదు. మార్కెట్‌ పరిస్థితులు బాగా లేనప్పుడు అన్నీ మనకు నష్టాన్నే మిగులుస్తాయి. కాబట్టి, షేర్ల ఎంపికలోనూ వైవిధ్యం ఉండేలా చూసుకొని, ఆ తరహా ఫండ్లలోనే మదుపు చేయాలి. అప్పుడు తక్కువ నష్టభయంతో అధిక రాబడికి అవకాశాలు పెరుగుతాయి. 

వేర్వేరు సంస్థల్లో

ఒక ఫండ్‌తో పోలిస్తే.. మరో ఫండ్‌ పెట్టుబడుల తీరు భిన్నంగా ఉంటుంది. అదే విధంగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల పనితీరూ వేర్వేరుగానే ఉంటుంది. ఒకే ఫండ్‌ సంస్థ, ఒకే ఫండ్‌ మేనేజర్‌ నిర్వహణలోని పథకాలకే ప్రాధాన్యం ఇస్తే.. మంచి రాబడిని అందుకునే అవకాశాన్ని కోల్పోయినట్లే. కాబట్టి, మీ పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న ఫండ్లను వివిధ సంస్థల నుంచి ఎంపిక చేసుకోవాలి. మార్కెట్‌ అస్థిరంగా ఉన్నప్పుడు అధిక నష్టం రాకుండా ఈ విధానం తోడ్పడుతుంది.

వేర్వేరు కాలాలకు..

లక్ష్యానికి తగ్గ పథకాలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో దీర్ఘకాలం, మధ్య, స్వల్ప కాలాలకు అనువైనవి ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలానికి ఈక్విటీలు, మధ్య కాలానికి హైబ్రిడ్, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్, స్వల్పకాలానికి డెట్‌ ఫండ్లు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి, మీరు అనుకున్న వ్యవధికి సరిపోయే వాటిలో మదుపు చేయాలి. మీరు వేర్వేరు వ్యవధిలో రెండు పథకాల్లో మదుపు చేసినప్పుడు, ఇది నష్టభయాన్ని తట్టుకుంటూ, మంచి రాబడిని ఆర్జించేందుకు వీలవుతుంది.  

సూచీల ప్రామాణికంగా

ప్రామాణిక సూచీల ఆధారంగా పనిచేసే ఫండ్లను ఎంచుకున్నప్పుడు వైవిధ్యానికి చోటు అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. నిఫ్టీ 50, నిఫ్టీ 100 తదితర ప్రామాణిక సూచీల ఆధారంగా మదుపు చేసే ఫండ్లనూ పరిశీలించవచ్చు. వీటివల్ల మీ పోర్ట్‌ఫోలియోలో నష్టభయం అంతగా ఉండదు. మార్కెట్ల పనితీరు మెరుగ్గా ఉన్నప్పుడు ఆ మేరకు లాభాలను ఆర్జించే అవకాశాలూ ఉంటాయి. కొన్ని ఫండ్లు ప్రామాణిక సూచీలకన్నా అధిక రాబడులను ఆర్జించడమూ కనిపిస్తుంది.  
దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెడుతున్నప్పుడు, ఫండ్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అవసరాన్ని బట్టి, మార్పులు చేర్పులు ఉండాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన రాబడి అందుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని