Fixed deposit: ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయొచ్చా? ఫ్లోటింగ్‌ ఎఫ్‌డీ మేలేనా?

Fixed deposit: రెపోరేటుకు అనుగుణంగా బ్యాంకులు డిపాజిట్ రేట్లను సవరిస్తుంటాయి. గత ఐదు సమీక్షలుగా ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. ఈ తరుణంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో మదుపు చేయడం ప్రయోజనకరమేనా? చూద్దాం..!

Updated : 18 Dec 2023 14:54 IST

Fixed deposit | ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం ఆ మధ్య ఆర్‌బీఐ వడ్డీరేట్లను వరుసగా పెంచుతూ వచ్చింది. అందుకు అనుగుణంగా బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed deposit) రేట్లను సైతం పెంచాయి. కానీ, గత ఐదు సమీక్షల్లో మాత్రం కేంద్ర బ్యాంకు యథాతథ స్థితిని కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పట్లో మళ్లీ వడ్డీరేట్లను (Interest Rates) పెంచే సూచనలు కూడా కనిపించడం లేదు. మరి ఈ తరుణంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు చేయడం మంచిదేనా? చేస్తే రెగ్యులర్‌ ఎఫ్‌డీలో చేయాలా? లేక ఫ్లోటింగ్‌ ఎఫ్‌డీని ఎంచుకోవాలా? చూద్దాం..!

ఫ్లోటింగ్‌ రేట్‌ ఎఫ్‌డీ అంటే?

ఫ్లోటింగ్‌ రేట్‌ ఎఫ్‌డీల్లో (Floating rate FD) రాబడి.. మారుతున్న వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటుంది. అంటే రెపోరేటు మారినప్పుడల్లా ఎఫ్‌డీ రేటును కూడా అందుకు అనుగుణంగా సవరిస్తారు. ప్రతి త్రైమాసికం చివరి రోజు ఉన్న రేటుకు అనుగుణంగా లెక్కగట్టి రాబడిని ఖాతాలో జమచేస్తారు. అదే రెగ్యులర్‌ ఎఫ్‌డీలో అయితే మదుపు చేసే సమయంలో ఏ రేటునైతే నిర్ణయిస్తారో.. కాలపరిమితి ముగిసే వరకు దాన్నే కొనసాగిస్తారు.

ఫ్లోటింగ్‌ ఎఫ్‌డీ ఎంచుకోవచ్చా?

వడ్డీరేట్లను ఆర్‌బీఐ క్రమంగా పెంచే అవకాశం ఉన్న సమయంలో ఫ్లోటింగ్‌ రేట్‌ ఎఫ్‌డీని (Floating rate FD) ఎంచుకుంటే ప్రతిఫలం అధికంగా ఉంటుంది. కానీ, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. గత ఐదు సమీక్షల్లో రెపోరేటు 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంది. మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలున్నాయి. పైగా ద్రవ్యోల్బణం కొంత మేర అదుపులోకి వచ్చిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో రేట్ల కోత ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఎఫ్‌డీ వడ్డీరేట్లు సైతం తగ్గుతాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్లోటింగ్‌ ఎఫ్‌డీలో మదుపు చేయకపోవడమే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ దీంట్లోనే మదుపు చేయాలనుకుంటే మాత్రం రెండు, మూడేళ్ల కాలపరిమితి ఎంచుకోవాలని చెబుతున్నారు. బ్యాంకులు మాత్రం ఫ్లోటింగ్ ఎఫ్‌డీని ఎంపిక చేసుకోవాలని సూచించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరించి సరైన నిర్ణయం తీసుకోవాలి.

వచ్చే ఆరు నెలలు..

ద్రవ్యోల్బణం దిగొస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి రేట్ల కోత ఉండొచ్చు..! ఫలితంగా మరో ఆరు నెలల పాటు ఆర్‌బీఐ రెపోరేటును యథాతథంగా కొనసాగించే సూచనలు ఉన్నాయి. ఆ తర్వాత కొంత దిగి రావొచ్చు. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో (Fixed deposit) మదుపు చేయాలనుకునే వారికి వచ్చే ఆరు నెలల సమయం చాలా కీలకం. 

ఎఫ్‌డీ ల్యాడరింగ్‌ వ్యూహం..

మరోవైపు దీర్ఘకాలం ఎఫ్‌డీలో మదుపు చేయాలనుకునేవారు ఎఫ్‌డీ ల్యాడరింగ్‌ (FD laddering) అనే వ్యూహాన్ని అమలు చేస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా మధ్యలో డబ్బు అవసరమైనప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అనుకొన్న మొత్తాన్ని కొన్ని భాగాలుగా విభజించి వివిధ కాలపరిమితుల్లో వాటిని మదుపు చేయాలి. ఉదాహరణకు.. రూ.ఐదు లక్షలు ఎఫ్‌డీ చేయాలనుకుంటే ఆ మొత్తాన్ని రూ.లక్ష చొప్పున ఐదు భాగాలు చేసుకోవాలి. ఒక్కో భాగాన్ని సంవత్సరం, రెండేళ్లు, మూడేళ్లు.. ఇలా ఐదేళ్ల కాలపరిమితితో ఇన్వెస్ట్‌ చేయాలి. ఫలితంగా ప్రతి ఏడాది ఒక్కో ఎఫ్‌డీ కాలపరిమితి ముగిసి డబ్బు చేతికందుతుంది. అవసరాలకు దాన్ని వాడుకోవచ్చు. లేదనుకుంటే మళ్లీ ఎఫ్‌డీ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని