Credit Score: క్రెడిట్‌ స్కోరు ఈ విషయాలు తెలుసా?

Credit Score: ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను ఎలా తీరుస్తున్నారు అనేది తెలియజేసేది క్రెడిట్‌ స్కోరు. వాయిదాలు సకాలంలో చెల్లించకపోయినా, కార్డు బిల్లు తీర్చకపోయినా.. క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం ఉంటుంది

Updated : 16 Feb 2024 08:36 IST

Credit Score | ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను ఎలా తీరుస్తున్నారు అనేది తెలియజేసేది క్రెడిట్‌ స్కోరు. వాయిదాలు సకాలంలో చెల్లించకపోయినా, కార్డు బిల్లు తీర్చకపోయినా.. క్రెడిట్‌ స్కోరుపై (Credit Score) ప్రతికూల ప్రభావం ఉంటుంది. చాలామందికి ఈ స్కోరు, రుణ చరిత్ర గురించి కొన్ని సందేహాలుంటాయి. వీటి గురించి పూర్తిగా తెలుసుకొని ఉంటే తప్ప.. కొత్తగా రుణాలను తీసుకోవడం సులువు కాదు.

ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ ముఖ్యం. ప్రధానంగా తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా తీర్చాలి. ఇది రుణగ్రహీతల ప్రాథమిక బాధ్యత. రుణదాతలు ప్రతి రుణగ్రహీతకు సంబంధించిన సమాచారాన్ని క్రెడిట్‌ బ్యూరోల దగ్గర నమోదు చేస్తుంటాయి. వారి ప్రతి అంశాన్నీ రుణ చరిత్రలో పేర్కొంటారు. కొత్తగా రుణం కావాలని దరఖాస్తు చేసినప్పుడు, ఆ వ్యక్తి గురించి పూర్తి సమాచారం ఒక్క చోటే లభించేలా ఈ నివేదికలు ఉంటాయి. రుణం ఇవ్వాలా? వద్దా? అనేది ఇక్కడే సగం నిర్ణయం అవుతుంది.

తనిఖీ చేసుకోవాలి

రుణాలు తీసుకున్న వారు ఎప్పటికప్పుడు తమ క్రెడిట్‌ స్కోరును (Credit Score) తెలుసుకోవాలి. దీనివల్ల మీ స్కోరు, రుణ చరిత్రపై ఎలాంటి ప్రభావం ఉండదు. సిబిల్‌ వంటి పేరుపొందిన క్రెడిట్‌ బ్యూరోల నుంచి ఏడాదికోసారి ఉచితంగానే పూర్తి నివేదికను పొందవచ్చు. ఇప్పుడు చాలా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లు ఈ నివేదికలను అందిస్తున్నాయి. మీరు సొంతంగా క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, రుణదాత మీ స్కోరును తనిఖీ చేస్తే కొంచెం ఇబ్బందే. మీరు రుణం కోసం దరఖాస్తు చేసినట్లు నమోదవుతుంది. కొత్తగా రుణం తీసుబోయే ముందు మీరే సొంతంగా నివేదికను పరిశీలించాలి.

ఆదాయంతో సంబంధం..: మీకు ఎంత ఆదాయం వస్తుందన్న సంగతిని క్రెడిట్‌ బ్యూరోలు పట్టించుకోవు. కేవలం మీరు తీసుకున్న రుణాలు, వాటి చెల్లింపుల తీరు ఆధారంగానే క్రెడిట్‌ స్కోరును (Credit Score) లెక్కిస్తాయి. సకాలంలో చెల్లింపులు ఉంటే.. స్కోరు బాగుంటుంది.

ఎవరికి వారే..: క్రెడిట్‌ స్కోరును ఒక వ్యక్తి పాన్‌ ఆధారంగా గణిస్తారు. కాబట్టి, వ్యక్తిగతంగా మాత్రమే స్కోరు ఉంటుంది. కుటుంబ సభ్యుల రుణాలతో సంబంధం ఉండదు. కాకపోతే.. వేరొకరి రుణానికి హామీ ఉన్నా, సహ దరఖాస్తుదారుగా ఉన్నా మీరూ రుణం తీసుకున్నట్లే. ఆ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యతను మీరు పంచుకున్నట్లే. వాస్తవంగా రుణం తీసుకున్న వ్యక్తి వాయిదాల చెల్లింపులను సరిగ్గా చేయకపోతే.. ఆ బాధ్యత మీపై పడుతుంది. మీరూ బాకీలను చెల్లించడంలో విఫలమైతే క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

అప్పు తీసుకోకపోతే..: అప్పు చేయకుంటే ఏ ఇబ్బందులూ రావు కదా అని అనుకోవచ్చు. నిజమే. మీకు అప్పు తీసుకోవాల్సిన అవసరం రాకపోవడం మంచి విషయమే. కానీ, జీవితంలో వివిధ లక్ష్యాల సాధనలో రుణాల అవసరం తప్పకపోవచ్చు. ఇల్లు, వాహనం కొనుగోలు, పిల్లల కోసం విద్యా రుణంలాంటివి ఇందులో ఉంటాయి. మంచి క్రెడిట్‌ స్కోరు 750 మించి ఉంటే.. వడ్డీ రేట్లలో రాయితీలూ పొందే అవకాశం ఉంటుంది. స్కోరు లేకుంటే అధిక రేట్లను చెల్లించాల్సి రావచ్చు.

మారుతూనే ఉంటుంది..: ఒక నెల ఆలస్యంగా చెల్లించిన క్రెడిట్‌ కార్డు బిల్లు స్కోరులో 100 పాయింట్లను తగ్గించగలదు. కోల్పోయిన ఈ పాయింట్లను పొందేందుకు కొన్ని నెలలు పట్టొచ్చు. ఈ కాలంలో మీరు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే.. తిరస్కరణ ఎదురు కావచ్చు. లేదా అధిక వడ్డీ రేటు చెల్లించాల్సి వస్తుంది. సకాలంలో చెల్లించడం చాలా కీలకమైన అంశం.

రుణాలు లేకుంటే..: చాలామంది రుణం తీసుకోకపోతే ఎలాంటి క్రెడిట్‌ స్కోరూ ఉండదు. కాబట్టి, రుణ నివేదికను గమనించాల్సిన అవసరం లేదు అనుకుంటారు. ఎంతోమంది అనధికార రుణ మోసాల బారిన పడిన సంగతి చూస్తూనే ఉంటాం. మన ధ్రువీకరణలతో ఎవరైనా అప్పు చేశారా? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనీసం ఏడాదికోసారైనా మీ క్రెడిట్‌ నివేదికను పరిశీలించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని