Loan: రుణం తీసుకుంటున్నారా?

Eenadu icon
By Business News Team Published : 17 Oct 2025 04:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

పండగల వేళ గృహ, వాహన రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? రుణానికి దరఖాస్తు చేయడం నుంచి, అది మీ చేతికి అందే వరకూ అనేక దశలు ఉంటాయి

మీరు దరఖాస్తు చేయగానే బ్యాంకు, ఆర్థిక సంస్థ దాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తుంది. ఒకప్పుడు ఇందుకోసం రోజుల తరబడి పట్టేది. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధ పరిజ్ఞానంతో ఇప్పుడు ఇది కొన్ని క్షణాల వ్యవధిలోనే ముగుస్తోంది. ఆ తర్వాత మీకు రుణం ఎంత మేరకు ఇవ్వాలనే విషయంలో ఒక ప్రాథమిక అంచనా చెబుతుంది. అంతమాత్రాన రుణం వచ్చినట్లే అని అనుకోవద్దు. ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది. మీ దరఖాస్తును స్వీకరించి, ఎంత మేరకు రుణం ఇవ్వొచ్చనే విషయాన్ని మాత్రమే బ్యాంకు/ఆర్థిక సంస్థ నిర్ణయిస్తుంది. ఈ విషయాన్నే మీకు తెలియజేస్తుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన సమాచారం, సమర్పించిన పత్రాల ఆధారంగా రుణ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది.

వ్యక్తిగత రుణాలు, ఆస్తి తాకట్టు వాటి విషయంలో మంజూరైన రుణం ఒకేసారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. దీన్ని పూర్తి చెల్లింపు అంటారు. గృహ, విద్యా రుణం తీసుకున్నప్పుడు ముందుగా ఎంత వరకూ ఇస్తారనేది తెలియజేస్తుంది. ఆ తర్వాత బిల్డర్, విద్యా సంస్థ నుంచి అందిన సమాచారం ఆధారంగా తీసుకొని, విడతల వారీగా రుణాన్ని అందిస్తుంది. ఇంటి నిర్మాణం కోసం అప్పు తీసుకున్నప్పుడూ.. నిర్మాణ దశలను బట్టి, రుణం విడుదల చేస్తుంది. అదే సిద్ధంగా ఉన్న ఇల్లు కొంటున్నప్పుడు.. విక్రయదారుడితో కుదుర్చుకున్న ఒప్పందం మొత్తాన్ని బట్టి, వారికే ఆ మొత్తం చెల్లిస్తుంది.

రుణానికి దరఖాస్తు చేసినప్పుడు కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలించిన తర్వాత రుణం మొత్తం నిర్ణయిస్తాయి. ఈ మొత్తం కొన్నిసార్లు తగ్గేందుకు ఆస్కారం ఉంది. ఉదాహరణకు గృహరుణాన్ని పంపిణీ చేసేటప్పుడు ముందుగా మీరు తీసుకుంటున్న ఇంటికి సంబంధించిన అన్ని పత్రాలనూ నిశితంగా పరిశీలిస్తాయి. ఏ ప్రాంతంలో ఇల్లు తీసుకుంటున్నారు, ఇంటి వైశాల్యం, నిర్మాణ నాణ్యత, స్థలానికి న్యాయపరమైన చిక్కులేమైనా ఉన్నాయా, అనుమతులు.. ఇలాంటివన్నీ చూస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటేనే రుణాన్ని మంజూరు చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇంటి విలువను గణిస్తుంది. ఈ విలువ మీకు ఇచ్చిన రుణ మంజూరు కన్నా తక్కువగా ఉంటే.. అప్పుడు మీ రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇంటి విలువ- రుణ నిష్పత్తి ఆధారంగా ఎంత మొత్తం వస్తుందనేది నిర్ణయిస్తుంది. దీంతోపాటు, రుణాన్ని ఎంత వ్యవధిలో చెల్లిస్తారన్నదీ పరిశీలిస్తుంది. ఈ అంశాల ఆధారంగానే తుది రుణ మొత్తం విడుదల అవుతుంది.

గృహ, వాహన రుణాలు తీసుకునేటప్పుడు రుణగ్రహీత తన చేతి నుంచి కొంత మొత్తాన్ని ముందస్తు చెల్లింపు చేయాల్సి ఉంటుంది. గృహవిలువలో 80-90 శాతం వరకూ సాధారణంగా రుణం అందుతుంది. మిగతాది రుణగ్రహీత భరించాలి. వాహన రుణాలకూ ఇలాంటి నిబంధనే ఉంటుంది. ముందుగా డౌన్‌పేమెంట్‌/మార్జిన్‌ మనీని చెల్లించిన రుజువులు సమర్పిస్తేనే బ్యాంకు రుణం మొత్తాన్ని విడుదల చేస్తుంది.

రుణాన్ని విడుదల చేసిన వెంటనే ఆ మొత్తంపై బ్యాంకులు వడ్డీని గణిస్తాయి. వెంటనే ఈఎంఐలనూ వసూలు చేస్తాయి. గృహ, విద్యా రుణాల ప్రారంభానికి ముందు కొన్నాళపాటు మారటోరియం విధించే అవకాశం ఉంటుంది. బ్యాంకును సంప్రదించి, పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
రుణం తీసుకోవాలనుకున్నప్పుడు పూర్తి వివరాలను, ఎలాంటి తప్పుల్లేకుండా అందించాలి. అప్పుడే బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా అవసరమైన రుణాన్ని అందిస్తాయి.
రుణం తీసుకోవాలనుకున్నప్పుడు కనీసం 3-6 నెలల ముందే క్రెడిట్‌ స్కోరు ఎంత ఉందో చూసుకోవాలి. నివేదికలో తప్పులుంటే.. వెంటనే సంబంధిత బ్యాంకులను సంప్రదించి, సరిచేయించుకోవాలి. మంచి క్రెడిట్‌ స్కోరుంటేనే, వడ్డీలో రాయితీ లభిస్తుందని మర్చిపోవద్దు.

విద్యా రుణం తీసుకున్నప్పుడు బ్యాంకులు ఆయా విద్యా సంస్థలు ఫీజులను వసూలు చేసే వ్యవధి ఆధారంగా రుణాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు నేరుగా విద్యా సంస్థల ఖాతాలోనే జమ చేస్తాయి. కొన్ని బ్యాంకులు విద్యా రుణగ్రహీత ఖాతాలోనే సొమ్ము జమ చేస్తాయి. ట్యూషన్‌ ఫీజులు కాకుండా, ఇతర ఖర్చులకు ఇచ్చిన రుణాన్ని రుణగ్రహీత ఖాతాకే జమ చేస్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని