Loans: పండగ రుణాలు తొందరగా తీర్చేద్దాం

Eenadu icon
By Business News Team Published : 24 Oct 2025 01:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

పండగల వేళ ఎన్నో ఆఫర్లు.. వీటిని అందుకునేందుకు చాలామంది ఫోను, టీవీ, వాషింగ్‌ మెషీన్, ఫ్రిజ్‌లాంటి ఉపకరణాలతో పాటు, ద్విచక్ర వాహనాలు తదితరాల కొనుగోలు కోసం అప్పులు తీసుకున్నారు. క్రెడిట్‌ కార్డులపై ఈఎంఐలు, వ్యక్తిగత రుణాలూ సాధారణమే. ఇప్పటికిప్పుడు ఆర్థికంగా ఇబ్బంది లేనప్పటికీ, వీటిని సమయానికి తీర్చకుంటే ఆర్థిక ఒత్తిడి, అధిక వడ్డీ రేట్లు, క్రెడిట్‌ స్కోరు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఆర్థిక స్థితి అంచనా 

మీ అప్పులను తీర్చాలనే ఆలోచనకు ముందు మీ ఆర్థిక స్థితిని సమీక్షించడం ముఖ్యం. మీకు ఎన్ని రుణాలున్నాయి? వాటి వడ్డీ రేట్లు ఎంత? వాయిదా మొత్తం? ఈ వివరాలను ఒక దగ్గర రాసుకోండి. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు రుణాలు సాధారణంగా అధిక వడ్డీ రేట్లతో (వార్షిక వడ్డీ రేటు 30-40శాతం)ఉంటాయి. అందువల్ల ఈ రుణాలను వీలైనంత తొందరగా తీర్చడంపై దృష్టి పెట్టండి. ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడం వల్ల ఏ రుణాన్ని ముందు తీర్చాలో నిర్ణయించుకోవడం సులభం అవుతుంది.

బడ్జెట్‌ వేసుకోండి

రుణాలను తీర్చేందుకు బడ్జెట్‌ ఒక శక్తిమంతమైన సాధనం. మీ నెలవారీ ఆదాయం, ఖర్చులను జాగ్రత్తగా లెక్కించండి. అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా ఆదా చేసిన డబ్బును రుణాన్ని చెల్లించేందుకు ఉపయోగించండి. ఉదాహరణకు వినోదం, బయట ఆహారం, షాపింగ్‌ ఖర్చులను కొంతకాలం నియంత్రించుకోవచ్చు. 50-30-20 నియమాన్ని అనుసరించండి. ఆదాయంలో 50శాతం అవసరాలకు, 30 శాతం కోరికలకు, 30 శాతం రుణాల చెల్లింపులు లేదా పొదుపు, పెట్టుబడులకు మళ్లించండి. 

అధిక వడ్డీ రుణాలను

అన్ని రుణాల్లో అధిక వడ్డీ రేటు ఉన్న వాటిని ముందుగా తీర్చడం మంచిది. ఉదాహరణకు క్రెడిట్‌ కార్డు రుణం వడ్డీ రేటు 36 శాతం ఉంటే, దాన్ని ముందుగా చెల్లించే ప్రయత్నం చేయాలి. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ ఖర్చు తగ్గుతుంది. మీ డబ్బు ఆదా అవుతుంది. కొందరు అధిక వడ్డీ రుణాలను కాకుండా, తక్కువ మొత్తం ఉన్న వాటిని ముందుగా తీర్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇదీ మంచిదే. ఇలా తీర్చినప్పుడు ఆ రుణానికి చెల్లిస్తున్న ఈఎంఐ మిగులుతుంది. దీన్ని మరో రుణానికి అదనపు చెల్లింపు చేయొచ్చు. దీనివల్ల అప్పుల సంఖ్య తగ్గుతుంది.

అదనంగా చెల్లిస్తే

మీ ఆదాయంలో బోనస్, ఆర్థిక ప్రోత్సహకాలు, అదనపు డబ్బు వచ్చినప్పుడు, దాన్ని అప్పు తీర్చేందుకు వాడాలి. చాలా రుణాలు ముందస్తు చెల్లింపులను అనుమతిస్తాయి. కొన్ని అదనపు రుసుములు విధించవచ్చు. కాబట్టి, ముందస్తు చెల్లింపు నియమాలను తెలుసుకోండి. అదనపు చెల్లింపులు రుణ వ్యవధిని తగ్గిస్తాయి. ఫలితంగా వడ్డీ ఖర్చు ఆదా అవుతుంది.

రుణాలన్నీ ఒకే చోట

మీకు నాలుగైదు రుణాలున్నాయనుకోండి. వీటన్నింటికీ బదులు ఒకే పెద్ద రుణం తీసుకునే విషయాన్ని ఆలోచించండి. దీనివల్ల తక్కువ వడ్డీ రేటు రుణానికి మారేందుకు వీలవుతుంది. అన్ని రుణాలూ ఒకే చోటకు రావడం వల్ల నెలవారీ వాయిదా భారమూ తగ్గుతుంది. బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు రుణాలను ఏకీకృతం చేసే అవకాశాన్ని అందిస్తుంటాయి. ఒకసారి మీ రుణ సంస్థలను అడిగి చూడండి.

క్రమశిక్షణతో

రుణాలు తీర్చడం అనేది ఒక ఆర్థిక లక్ష్యంగా మారాలి. దీనికి క్రమశిక్షణ అవసరం. పాత రుణాలు తీరేంత వరకూ కొత్త అప్పులు చేయొద్దు. క్రెడిట్‌ కార్డు వినియోగాన్నీ పరిమితం చేయండి. ప్రతి నెలా మీ బడ్జెట్‌ను ఒకసారి సమీక్షించండి. రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించడంలో నిర్లక్ష్యం చేయొద్దు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు