Changes from april 1st: ఎన్‌పీఎస్‌ లాగిన్‌, క్రెడిట్‌ కార్డ్ రూల్స్‌.. ఏప్రిల్‌ 1 నుంచి రాబోతున్న మార్పులివీ..

Changes from april 1st: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో చూసేయండి..

Published : 31 Mar 2024 14:00 IST

Changes from april 1st: ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఆర్థిక సంవత్సరంతో పాటు కొత్త ఏడాదిలో కొన్ని ఆర్థిక సంబంధమైన మార్పులు కూడా చోటుచేసుకోబోతున్నాయి. ఎన్‌పీఎస్‌ లాగిన్‌, క్రెడిట్ కార్డు రివార్డుల విషయంలో మార్పులు రాబోతున్నాయి. ఆ వివరాలు చూసేయండి..

NPS లాగిన్‌ రూల్‌

ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌పీఎస్‌ ఖాతా లాగిన్‌కు సంబంధించి పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతను మరింత మెరుగు పరుస్తూ 2 ఫ్యాక్టర్‌ ఆధార్‌ బేస్డ్‌ అథంటికేషన్‌ వ్యవస్థను తీసుకొచ్చింది. పాస్‌వర్డ్‌ ఆధారిత యూజర్లందరూ ఏప్రిల్‌ 1 నుంచి ఈ విధానాన్నే అనుసరించాల్సి ఉంటుంది. మార్చి 15న ఈ మేరకు ఓ సర్క్యులర్‌ జారీ చేసింది.

ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు ఛార్జీలు

డెబిట్‌ కార్డులపై నిర్వహణ ఛార్జీలను ఎస్‌బీఐ సవరించింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. క్లాసిక్‌ డెబిట్‌ కార్డులు, సిల్వర్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై వార్షిక నిర్వహణ రుసుములను రూ.125 నుంచి రూ.200కు పెంచింది. యువ, గోల్డ్‌, కాంబో డెబిట్‌ కార్డు, మై కార్డ్‌ల నిర్వహణ ఛార్జీలను రూ.175 నుంచి రూ.250కి చేర్చింది. ప్లాటినం డెబిట్‌ కార్డుల విభాగంలోని ఎస్‌బీఐ ప్లాటినం డెబిట్‌ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. ప్లాటినం బిజినెస్‌ కార్డు ఛార్జీలు రూ.350 నుంచి రూ.425కు పెరిగాయి. ఈ ఛార్జీలపై జీఎస్టీ అదనం.

క్రెడిట్‌ కార్డు రూల్స్‌

  • ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్ల విధానాల్లో మార్పు చేసింది. ఇప్పటివరకు అద్దె చెల్లింపులపై రివార్డ్‌ పాయింట్లను అందిస్తున్న బ్యాంక్‌.. ఏప్రిల్‌ 1 నుంచి ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఎస్‌బీఐ అందిస్తున్న AURUM, SBI కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్‌ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం ఉండనుంది.
  • కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. 1 నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. రాబోయే త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌, మేక్‌ మై ట్రిప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్లాటినం క్రెడిట్‌ కార్డ్‌ సహా వివిధ రకాల కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
  • యెస్‌ బ్యాంక్‌ కూడా లాంజ్‌ యాక్సెస్‌లో నిబంధనల్ని సవరించింది. ఏ త్రైమాసికంలో లాంజ్‌ సదుపాయం పొందాలన్నా అంతకు మునుపటి త్రైమాసికంలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది.
  • యాక్సిస్‌ బ్యాంక్‌ అందిస్తున్న మాగ్నస్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రివార్డ్‌ పాయింట్లు, లాంజ్‌ యాక్సెస్‌తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. బీమా, గోల్డ్‌/ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్‌ పాయింట్లూ ఇవ్వబోమని స్పష్టంచేసింది. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే 3 నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో దేశీయ, అంతర్జాతీయ లాంజ్‌ల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్‌ సందర్శనల సంఖ్యను కూడా ఏడాదికి 8 నుంచి 4కు తగ్గించనుంది. ఏప్రిల్‌ 20 నుంచి కొత్త మార్పులు అమల్లోకి వస్తాయి.

బీమా

బీమా పాలసీలను డిజిటలైజేషన్‌ చేయడాన్ని IRDAI తప్పనిసరి చేసింది. అంటే ఇకపై నుంచి అన్ని బీమా సంస్థలూ ఎలక్ట్రానిక్ పద్దతిలో పాలసీలను అందించాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, సాధారణ బీమా సహా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

బ్యాంక్‌ సెలవులు

ఏప్రిల్‌లో పండగల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు పెద్ద సంఖ్యలోనే సెలవులు రానున్నాయి. ఏప్రిల్‌ 1న వార్షిక ఖాతాల క్లోజింగ్‌ కారణంగా ఆ రోజు బ్యాంకు శాఖలు తెరుచుకోవు. ఏప్రిల్‌ 5న జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా తెలంగాణలో బ్యాంకు శాఖలకు సెలవు. ఏపీలో తెరుచుకుంటాయి. 9న ఉగాది, 11న రంజాన్‌, 17న శ్రీరామ నవమి సందర్భంగా ఆయా రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. 2, 4 శనివారాలు, ఆదివారాలు కూడా బ్యాంకులు ఎలానూ తెరుచుకోవు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు