Instant Loan: ఇన్‌స్టంట్‌ రుణమా..? ఈ విషయాలు తెలుసుకున్నాకే..!

Instant Loan: డిజిటల్ యుగంలో రుణాలు తక్షణమే మంజూరవుతున్నాయి. ఒకవేళ మీరూ ఇన్‌స్టంట్‌ లోన్‌ తీసుకోవాలని చూస్తున్నారా? ఈ విషయాలు గమనించాల్సిందే.

Updated : 24 Feb 2024 10:52 IST

Instant Loan | ఇంటర్నెట్‌డెస్క్‌: రుణం తీసుకోవాలంటే ఒకప్పుడు బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చేది. డిజిటల్‌ యుగంలో ఆ బాధ తప్పింది. రుణం తీసుకోవడం సులువైపోయింది. అనుకున్నదే తడవుగా ఇప్పుడు లోన్‌ లభిస్తోంది. సింగిల్‌ క్లిక్‌తో ఎటువంటి డాక్యుమెంట్లూ తీసుకోకుండానే పని పూర్తయిపోతోంది. సులువుగా ఇన్‌స్టంట్‌ రుణాలు లభిస్తుండడంతో ఈ తరహా లోన్లకు ఆదరణ పెరుగుతోంది. ఒకవేళ మీరూ ఈ తరహా రుణాలు తీసుకోవాలనుకుంటే.. అంతకంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి.

ఎంచుకోండి ఇలా..

ఇన్‌స్టంట్‌ లోన్‌ కోసం ఆన్‌లైన్‌లో వెతికితే ఎక్కువ సంఖ్యలో రుణ సంస్థలు దర్శనమిస్తాయి. అందులో రుణాలకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తున్న సంస్థను ఎంపిక చేసుకోండి. కస్టమర్‌ రివ్యూ, రేటింగ్‌లు చూస్తే రుణదాత గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి. పారదర్శక విధానాలు, సురక్షితమైన ఆన్‌లైన్‌ లావాదేవీలు, న్యాయమైన రుణ పద్ధతులు ఉంటే అది మంచి రుణ ప్లాట్‌ఫామ్‌గా గుర్తించొచ్చు. టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ చదవడం ముఖ్యం.

వడ్డీ రేట్లు

ఎలాంటి రుణానికైనా వడ్డీ రేట్లు చాలా కీలకం. తక్షణ రుణాలు పొందడం సులువైనప్పటికీ.. సాధారణ రుణాలతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో వడ్డీ ఉంటుంది. వీటితో పాటు లేట్‌ పేమెంట్‌ ఫీజు, ప్రీ పేమెంట్‌ ఫీజు, ప్రాసెసింగ్‌ రుసుముల విధిస్తారు. ఈ రుసుంలు ఎంత మొత్తంలో ఉండబోతున్నాయనేది ముందుగానే తెలుసుకోవాలి. 

పొడిగింపు ఉందా?

ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురు కావొచ్చు. రుణం తిరిగి చెల్లించే సమయంలోనూ అలాంటి పరిస్థితులు ఎదురుకావొచ్చు. అలాంటప్పుడు ఆ రుణాన్ని పొడిగించుకునేందుకు ఆ సంస్థలో వెసులుబాటు ఉందో లేదో ఆరా తీయాలి. రుణ గ్రహీత సరైన కారణం చెబితే రుణదాతలు తిరిగి చెల్లించే సమయాన్ని పొడిగించొచ్చు. దీంతో ఆలస్య చెల్లింపులు, రుణ ఎగవేత ముద్ర నుంచి తప్పించుకోవచ్చు.

కస్టమర్‌ సపోర్ట్‌

ఆర్థిక లావాదేవీల విషయంలో కస్టమర్‌ సపోర్ట్‌ కీలకం. రుణం తీసుకునేటప్పుడు, తీసుకున్నాక కొన్నిసార్లు ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవడానికి మెరుగైన కస్టమర్‌ సపోర్ట్‌ కలిగిన  రుణదాతల్ని ఎంచుకోండి. చాట్‌, ఫోన్‌కాల్స్‌, ఇ-మెయిల్స్‌.. వంటి బహుళ సాధనాల ద్వారా తక్షణమే పరిష్కరించే సామర్థ్యం ఉన్న ప్లాట్‌ఫామ్‌ అయితే మరీ మంచిది.

రుణం అవసరం ఎంత?

అత్యవసర పరిస్థితుల్లో మనకు రుణం అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఎంత మొత్తంలో రుణాన్ని తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకోండి. సులువుగా లోన్‌ ఇస్తున్నారని అవసరానికి మించి తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టంగా మారొచ్చు. దీని కోసం నెలవారీ ఆదాయం, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాలను ఓసారి సమీక్షించుకోండి. ఆ తర్వాతే రుణం విషయంలో ముందడుగు వేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని