Pension Scheme: ఎన్‌పీఎస్‌ Vs ఏపీవై.. ఏది ఎంచుకోవాలి?

ఎన్‌పీఎస్‌, ఏపీవై.. ఈ రెండు పథకాలూ పదవీవిరమణ జీవితం కోసం ఆర్థిక భద్రతను అందించేవే. మదుపుదారులు వారి వారి ప్రాధాన్యతలను అనుసరించి పథకాన్ని ఎంచుకోవాలి.

Updated : 28 Nov 2022 14:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిటైర్మెంట్‌ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు మదుపు చేయడం తప్పనిసరి. పెన్షన్‌ కోసం భారత ప్రభుత్వం రెండు పథకాలను అందిస్తోంది. ఒకటి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). మరొకటి అటల్ పెన్షన్ యోజన (APY). ఈ రెండు పథకాలు పదవీ విరమణ జీవితం కోసం ఆర్థిక భద్రతను అందించేవే అయినా రెండు ఒకదానికొకటి భిన్నం. మదుపుదారులు వారి వారి ప్రాధాన్యతలను అనుసరించి పథకాన్ని ఎంచుకోవాలి.

ఎన్‌పీఎస్‌ Vs ఏపీవై..

వేతన జీవులకు రిటైర్మెంట్‌ తర్వాత భరోసాను అందించడం కోసం ప్రభుత్వం ఎన్‌పీఎస్‌ (NPS)ను ప్రారంభించింది. అయితే, ఉద్యోగులే కాకుండా ఇతర పౌరులు కూడా ఈ పథకంలో చేరొచ్చు. అలాగే, అసంఘటిత రంగంలో కార్మికులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గతంలో అటల్‌ పెన్షన్‌ యోజనను ప్రవేశపెట్టింది.

వయసు..

NPS: 8 నుంచి 70 ఏళ్ల వయసు వారు ఎన్‌పీఎస్‌లో చేరేందుకు అవకాశం ఉంది. 75 ఏళ్ల వయసు వరకూ ఖాతాను కొనసాగించవచ్చు.

APY: 18 నుంచి 40 ఏళ్ల వయసు గల వారు ఈ ఖాతాలో చేరవచ్చు.

ఎవరు అర్హులు?

NPS: భారతీయులు గానీ, ఎన్నారైలు గానీ ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరవొచ్చు.

APY: భారతీయ నివాసితులు ఎవరైనా ఈ ఖాతాను తెరిచే వీలున్నప్పటికీ.. 2022 అక్టోబర్‌ 1వ తేదీ తర్వాత ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకంలో చేరేందుకు అనర్హులని ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించింది.

ఖాతా రకం..

NPS: టైర్‌-1, టైర్‌-2 అని రెండు రకాల ఖాతాలు ఉంటాయి. చందాదారులు ముందుగా టైర్‌-1 ఖాతాలో పెట్టుబడులు ప్రారంభించాలి. తమ అభీష్టానుసారం టైర్‌-2 ఖాతాలో పెట్టుబడులు పెట్టవచ్చు.

APY: ఇందులో ఒకే ఖాతా ఉంటుంది.

పెట్టుబడులు..

NPS: ఎంత పెట్టుబడులు పెట్టాలనేది పెట్టుబడిదారులు ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.1000 డిపాజిట్‌ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. 

APY: అటల్‌ పెన్షన్‌ యోజనలో ప్రభుత్వ సూచనల మేరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడుల మొత్తం ఎంపిక చేసుకునే వీలులేదు. 18 సంవత్సరాల వయసులో చేరిన వారు 42 ఏళ్ల పాటు కాంట్రీబ్యూట్‌ చేయాల్సి ఉంటుంది. రూ.42 నుంచి రూ.210 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 40 ఏళ్ల వయసులో చేరిన వారు 20 ఏళ్ల పాటు కాంట్రీబ్యూట్‌ చేయాలి. రూ.291 నుంచి గరిష్ఠంగా రూ.1454 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ప్రభుత్వ సహకారం..

NPS: ఇందులో మదుపుదారులే పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వ సహకారం ఉండదు.

APY: ఇందులో ప్రభుత్వం కొంత సహకారం అందిస్తుంది.

పెన్షన్‌ ఎంత?

NPS: ఎంత పెన్షన్‌ వస్తుందనేది పెట్టుబడి, రాబడిపై ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా చెప్పలేం.  

APY: రిటైర్మెంట్‌ తర్వాత కచ్చితమైన పెన్షన్‌ వస్తుంది. చందాదారులకు 60 ఏళ్లు నిండిన తర్వాత వారు చెల్లించిన చందాను అనుసరించి రూ.1000 నుంచి రూ.5వేల వరకు హామీ ఇచ్చిన ప్రకారం పింఛను మొత్తాన్ని పొందుతారు. 

పన్ను ప్రయోజనాలు..

NPS: ఈ పథకం ద్వారా పెట్టుబడిదారులు రూ. 2 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు.

APY: ఈ పథకంలో ఇకపై పన్నుచెల్లింపుదారులు చేరేందుకు అనర్హులు.

ముందస్తు విత్‌డ్రాలు..

NPS: టైర్‌-2 ఖాతాలో నిధులను ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ, టైర్‌ -1 ఖాతాలో విత్‌డ్రాలకు నియమ నిబంధనలు వర్తిస్తాయి. పదవీ విరమణ నాటికి ఉన్న మొత్తంలో కనీసం 40% యాన్యుటీల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ స్వచ్ఛంద విరమణ చేస్తే కనీసం 80% మొత్తాన్ని యాన్యుటీలకు కేటాయించాలి. ఒకవేళ పదవీవిరమణ కంటే ముందే చందాదారుడు మరణిస్తే, పూర్తి మొత్తాన్ని నామినీ/చట్టబద్ధమైన వారసులకు అందజేస్తారు.

APY: ఈ పథకంలో ముందస్తు విత్‌డ్రాలను అనుమతించరు. అయితే, పెట్టుబడిదారుడు అనుకోకుండా మరణించినా లేదా వైద్య అత్యవసర పరిస్థితిల్లో ముందస్తు విత్‌డ్రాలను అనుమతిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని