Retirement Corpus: పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?

చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి..

Updated : 12 Apr 2024 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరికైనా వారి జీవన ప్రయాణంలో పదవీ విరమణ అనంతర జీవితం చాలా ముఖ్యమైనది. అన్ని ప్రణాళికల కంటే పదవీ విరమణ ప్రణాళికే కీలకమైనదని ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులు చెబుతున్న మాట. అయితే, పదవీ విరమణ అనంతరం మిగతా జీవిత కాలానికి రూ.1 కోటి సరిపోతుందా? లేదా? అనేది ఇక్కడ చాలా మందికి ఒక సందేహం. రూ.1 కోటి గణనీయమైన మొత్తంగా అనిపించినప్పటికీ.. వ్యక్తుల జీవనశైలి, ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను లెక్కించడం వంటి అనేక కీలకమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పదవీ విరమణకు సంబంధించి ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ చూడండి.

జీవనశైలి, ఖర్చులు

హాయిగా రిటైర్‌ కావడానికి ఎంత డబ్బు సరిపోతుందని మీరడిగితే.. సరిపోయే సమాధానం అందరి వద్దా ఉండదు. దీనికి ప్రతి వ్యక్తికి వారి జీవనశైలి ప్రకారం లెక్కించాలి. వివిధ వ్యక్తులకు పదవీ విరమణ నిధికి సంబంధించిన కీలకమైన అంశాలలో ముఖ్యమైనది ఏంటంటే వారు ఊహించని జీవనశైలి, ఖర్చులు. ఈ రోజు ఉన్న జీవనశైలి 60 ఏళ్ల వయసులో ఉండకపోవచ్చు. భిన్నంగా ఉండొచ్చు. మీరు మధ్యస్థ వయసులో ఉన్న ఖర్చుల ప్రకారం రూ.1 కోటి అంటే గొప్పగా అనిపించినప్పటికీ, పదవీ విరమణ తర్వాత సంవత్సరాలలో అవసరాలు భిన్నంగా ఉండొచ్చు. కొందరు పొదుపు జీవనశైలిని ఇష్టపడవచ్చు. మరికొందరు ప్రయాణాలు, సౌకర్యవంతమైన విశ్రాంతి, మెరుగైన ఆరోగ్య సంరక్షణ.. ఇంకా ఇతర కార్యకలాపాల పరంగా అధిక అంచనాలను కలిగి ఉండొచ్చు. కాబట్టి, వీటన్నింటికీ అవసరమైన నిధులను అంచనా వేయడానికి పదవీ విరమణ తర్వాత వారి ఖర్చులను అంచనా వేయడం చాలా ముఖ్యం. మీ పదవీ విరమణ నిధిని ప్లాన్‌ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ జీవనశైలిలో మార్పులను పరిగణించండి.

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తుంది. ద్రవ్యోల్బణం కారణంగా కాలక్రమేణా డబ్బుకు సంబంధించిన కొనుగోలు శక్తి తగ్గుతుంది. దీనివల్ల డబ్బు తక్కువ విలువైనదిగా మారుతుంది. ఈ రోజు రూ.1 కోటి విలువైనదిగా అనిపించవచ్చు. కానీ, అధిక ద్రవ్యోల్బణం, సామాజిక భద్రత లేకపోవడం వల్ల భారత్‌లో మనుగడ సాగించడానికి ఇంకా పెద్ద మొత్తమే అవసరం పడొచ్చు. వస్తువులు, సేవల ధరలు పెరిగే కొద్దీ, పదవీ విరమణ ప్రణాళికలో మీ పొదుపు విలువ తగ్గిపోతుంది. పదవీ విరమణ ప్రణాళికను ఎంపిక చేసుకునేటప్పుడు ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కాలక్రమేణా పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశ ఆరోగ్య సంరక్షణ విభాగాలు ఎప్పటికప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్న కారణంగా.. ఖర్చులు కూడా బాగా పెరుగుతున్నాయి. వైద్య చికిత్సలు, బీమాతో పాటు వీటికి సంబంధించిన ఇతర ఖర్చులు పదవీ విరమణ ప్రణాళికలో కీలక భాగంగా ఉండాలి. పదవీ విరమణ వయసులో ఎటువంటి హెచ్చరిక లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ బీమా ఖరీదవుతుంది. కాబట్టి, వైద్య ఖర్చులు, ఆరోగ్య బీమా కోసం ముందుగానే ప్లాన్‌ చేసుకోండి. మీకు వైద్య బీమా లేకుంటే, పదవీ విరమణ నిధిలో ఊహించని తరుగుదలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఆయుర్ధాయం

ఆరోగ్య సంరక్షణతో పెరిగిన ఆయుర్ధాయం.. పురోగతికి సంబంధించిన సానుకూల ఫలితం. దీనివల్ల పదవీ విరమణ అనంతరం మరింత ఎక్కువ కాలం నిధి అవసరం. ఆయుర్ధాయం ఎంత ఎక్కువ ఉంటే, మరింత ఎక్కువ నిధి అవసరం పడుతుంది. పదవీ విరమణ తర్వాత చివరి దశలో జీవన వ్యయాలు ఎక్కువే ఉంటాయి. ఉదాహరణకు 60 ఏళ్ల వయసులో రూ.50 వేల నెలవారీ ఖర్చుతో ప్రారంభిస్తే.. 80 ఏళ్లు చేరుకునే సమయానికి (సగటు వార్షిక ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉంటే) నెలవారీ ఖర్చు రూ.1.32 లక్షలకు చేరుకుంటుంది. 

రూ.1 కోటి..ఎంత కాలం?

ఇది ఒక వ్యక్తి వ్యయంపై ఆధారపడి ఉంటుంది. పదవీ విరమణ చేసిన వ్యక్తులు సంప్రదాయ పథకాల్లో పెట్టుబడి పెడతారు కాబట్టి, సగటు వార్షిక రాబడి 7% అనుకుందాం. ప్రతి నెలా రూ.50 వేలు ఖర్చు చేస్తే, 30 ఏళ్ల 4 నెలల వరకు సరిపోతుంది. అదే రూ.75 వేలు ప్రతి నెలా ఖర్చు చేస్తే 20 ఏళ్ల 7 నెలల వరకు సరిపోతుంది. ప్రతి నెలా రూ.1 లక్ష వరకు ఖర్చు చేస్తే, రూ.1 కోటి నిధి 12 ఏళ్ల 3 నెలల వరకు మాత్రమే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని