Online Frauds: ఇలాంటి ఆన్‌లైన్‌ మోసాలున్నాయని మీకు తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది బ్యాంకు ఖాతాదారులు ఆన్‌లైన్‌ సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకుంటున్నారు. కొన్నిసార్లు ఖాతాదారులు ఆన్‌లైన్‌ మోసాలకు గురవుతుంటారు. ఈ మోసాల గురించి, వీటిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Published : 20 May 2024 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌.. ఆర్థిక లావాదేవీలను సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత కాలంలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలన్ని డిజిటల్‌గానే జరుగుతున్నాయి. ఖాతాదారుడు బ్యాంకు ఖాతా ద్వారా నిధులను బదిలీ చేయాలనుకున్నప్పుడు లేదా ఏదైనా ఇతర పనులను నిర్వహించాలనుకున్నప్పుడు బ్యాంకును సందర్శించడం కంటే మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌/నెట్‌ బ్యాంకింగ్‌ను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ నిస్సందేహంగా ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేసింది. అదే సమయంలో దేశంలో బ్యాంకింగ్‌ మోసాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఆన్‌లైన్‌లో సైబర్‌ నేరగాళ్లు.. వ్యక్తులు/సంస్థలను మోసం చేయడానికి నిరంతరం కొత్త పంథాలు అవలంబిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్‌ స్కాంలు, డిజిటల్‌ చెల్లింపు మోసాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.

విషింగ్‌ స్కాం

ఇక్కడ సైబర్‌ నేరస్థులు.. బ్యాంకు ఖాతాదారులను మోసగించడానికి వాయిస్‌ కాల్‌ చేస్తారు. నేరగాళ్లు ఆన్‌లైన్‌ బ్యాంకు ఖాతా లాగిన్‌ వివరాలు, ఖాతాదారుడి పేరు, లావాదేవీ పాస్‌వర్డ్స్‌, డెబిట్‌ కార్డు పిన్‌ నంబర్లు, ఓటీపీ, సీవీవీ, ఖాతాదారుడు పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి ఫోన్‌ కాల్‌ను చేస్తారు. ఇటువంటి సందర్భాల్లో సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని అడుగుతూ మిమ్మల్ని మోసగిస్తారు. కాబట్టి, తెలియని వ్యక్తులు ఫోన్‌లో మీ వ్యక్తిగత/బ్యాంకింగ్‌ సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితిలోనూ చెప్పకూడదు. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్‌ సమాచారాన్ని అడిగే అనుమానిత ఫోన్‌ కాల్స్‌/మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉండాలి. చట్టబద్ధమైన ఆర్థిక సంస్థలు ఫోన్‌ కాల్‌/SMSల ద్వారా వ్యక్తిగత, ఖాతా సమాచారాన్ని అడగవని బ్యాంకు ఖాతాదారులు గుర్తించాలి.

ఫిషింగ్‌

ఇది.. మీ గోప్యమైన బ్యాంకింగ్‌ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించిన మోసపూరిత ఇ-మెయిల్‌. బ్యాంకు లేదా విశ్వసనీయ సంస్థ వెబ్‌సైట్‌ నుంచి వచ్చినట్లు ఇ మెయిల్‌ వస్తుంది. ఇలాంటి మెయిల్ లింక్స్‌పై క్లిక్‌ చేయకూడదు. క్లిక్‌ చేస్తే మీ పాస్‌వర్డ్‌, లాగిన్‌ వివరాలు, ఓటీపీ, ఇతర సమాచారాన్ని అడగవచ్చు. ముఖ్యంగా ఏ బ్యాంకు కూడా ఇ మెయిల్‌ పంపి గోప్యమైన మీ ప్రైవేట్‌ సమాచారాన్ని అభ్యర్థించదని బ్యాంకు ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి. ఇంకా బ్యాంకు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకుని.. సహోద్యోగి, యజమాని, సన్నిహితులు లేదా బంధువుల పేరుతో ఈ మెయిల్స్‌ వస్తాయి. వీటిని ‘స్పియర్‌ ఫిషింగ్‌’ అంటే, టార్గెటెడ్‌ ఇ-మెయిల్‌ స్కాం అని పిలుస్తారు. కావలసిన వారి వద్ద నుంచే వచ్చిన ఇ-మెయిల్‌ అనిపించి మెయిల్‌ లింక్‌లపై క్లిక్‌ చేస్తే.. మీ కంప్యూటర్‌, మొబైల్‌లో ఉన్న విలువైన సమాచారాన్ని మోసగాళ్లు సులభంగా యాక్సెస్‌ చేయొచ్చు. ఇలాంటి అనుమానాస్పద ఇ- మెయిల్స్‌పై క్లిక్‌ చేయకపోవడమే ఉత్తమం.

సిమ్‌ స్వాప్‌ (మొబైల్‌ నంబర్‌ స్కాం)

సిమ్‌ స్వాప్‌ విషయంలో మోసగాడు.. బాధితుడి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను ఉపయోగించి, అతడి మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ నుంచి కొత్త సిమ్‌ కార్డును పొందుతాడు. ఇక్కడ మోసగాడు ఓటీపీతో పాటు అవసరమైన వివరాలు పొంది.. బ్యాంకు ఖాతాదారుడి ఆర్థిక లావాదేవీలను నిర్వహించి ఖాతాలో ఉన్న నిల్వను తన ఖాతాకు మళ్లించుకుంటాడు. అందుచేత, బ్యాంకు ఖాతాదారులు ఫోన్‌ లేదా సిమ్‌ కార్డు పోయినా/పనిచేయకపోయినా వెంటనే మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కు రిపోర్ట్‌ చేయాలి.

స్మిషింగ్‌ (SMS స్కాం)

స్మిషింగ్‌ స్కాం చేయడానికి SMS లేదా టెక్ట్స్‌ మేసేజింగ్‌ను నేరగాళ్లు ఉపయోగిస్తారు. స్మిషింగ్‌ స్కామర్లు ఖాతాదారులను లక్ష్యంగా చేసుకోవడానికి టోల్‌ ఫ్రీ ఫోన్‌ నంబర్లు, మెసేజ్‌ లింక్‌లను ఉపయోగిస్తారు. ఏదైనా కొత్త స్కీం కోసం సైన్‌ అప్‌ చేయడానికి లింక్‌ ద్వారా మీ ఖాతా అప్‌డేట్‌ చేయాలని బ్యాంకు ఖాతాదారులకు మెసేజ్‌ రావచ్చు. మెసేజ్‌లో వచ్చిన అటువంటి స్మిషింగ్‌ లింక్‌లపై క్లిక్‌ చేస్తే మీ బ్యాంకు వివరాలు నేరగాళ్లు తెలుసుకునే అవకాశం ఉంది. స్మిషింగ్‌ నుంచి రక్షించుకోవడానికి బ్యాంకు ఖాతాదారులు ఏ లింక్‌నూ దాని మూలం తెలియకుండా క్లిక్‌ చేయకూడదు.

వెబ్‌సైట్‌ స్పూఫింగ్‌ (నకిలీ వెబ్‌సైట్స్‌)

ఆర్థిక మోసాలు చేయడానికి సంస్థ అసలు వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించడాన్ని వెబ్‌సైట్‌ స్పూఫింగ్‌ అంటారు. స్పూఫ్‌ సైట్స్‌ ప్రామాణికమైనవిగా కనిపించడానికి నిజమైన సంస్థ పేర్లు, ఇమేజ్‌లు, లోగోలు, వెబ్‌సైట్‌ కోడ్స్‌ను కూడా స్కామర్లు ఉపయోగిస్తారు. ఇలాంటి నకిలీ వెబ్‌సైట్స్‌లో ఖాతాదారులు ఎంటర్‌ చేసిన వివరాలు మోసగాళ్లకు సులభంగా తెలిసిపోతాయి. కాబట్టి, URLలో ‘HTTPS’ను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేయాలి.

మాల్‌వేర్‌ అటాక్‌

మాల్‌వేర్‌ దాడి అనేది మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు. బ్యాంకు ఖాతాదారుల కంప్యూటర్‌, మొబైల్‌ పరికరాల ఆపరేటింగ్‌ సిస్టంకు హాని కలిగించే వైరస్‌. ఈ వైరస్‌.. సైబర్‌ నేరస్థులు అభివృద్ధి చేసి బ్యాంకు ఖాతాదారులకు పంపే హానికరమైన సాఫ్ట్‌వేర్‌ అని చెప్పవచ్చు. ఇది ఆన్‌లైన్‌ ద్వారా ఖాతాదారుల సిస్టంలోకి చొరబడి నేరగాళ్లకు రహస్య బ్యాంకింగ్‌ సమాచారాన్ని అందేలా చేయవచ్చు. తద్వారా బ్యాంకు ఖాతా నుంచి నగదు నిల్వను చోరీ చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు. అందుచేత, ఖాతాదారులు తమ కంప్యూటర్‌, మొబైల్‌ పరికరాల్లో.. యాంటీవైరస్‌, యాంటీ-మాల్‌వేర్‌ ప్రోగ్రామ్స్‌ సహా ముఖ్యమైన సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుండాలి.

అసలు వ్యక్తికి తెలియకుండా ఖాతా

ఒక వ్యక్తికి తెలియకుండానే బ్యాంకు ఖాతా తెరవడాన్ని అప్లికేషన్‌ మోసం అంటారు. అప్లికేషన్‌ మోసం అనేది ఒక రకమైన ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ మోసం. ఇక్కడ సైబర్‌ నేరగాళ్లు వ్యక్తుల సమ్మతి లేకుండా వారి పేరు మీద బ్యాంకు ఖాతాలను తెరుస్తారు. ఈ ఖాతాలను తెరవడానికి నేరగాళ్లు చోరీ చేసిన ఐడీలు, ఇతర మోసపూరిత పత్రాలను ఉపయోగిస్తారు. ఈ బ్యాంకు ఖాతాలను మనీ లాండరింగ్‌ లేదా చోరీ చేసిన నిధులను బదిలీ చేయడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు.

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం అప్రమత్తంగా ఉండడమే. ఈ కింది పద్ధతులను అనుసరించి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ మోసాల నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు.

  • బ్యాంకు ఖాతాదారులు ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ, పిన్‌ లేదా ఏదైనా ఇతర రహస్య డేటాను ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దు.
  • బ్యాంకు ఖాతాదారులు తమ ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ఖాతాల కోసం బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్స్‌ను సృష్టించుకోవాలి. వారు పుట్టిన తేదీలు, పేరు, ఇంటి పేరు వంటి సులభంగా ఊహించగలిగే పాస్‌వర్డ్‌లను పెట్టకూడదు. పాస్‌వర్డ్‌లను క్రమం తప్పకుండా మారుస్తుండాలి. 
  • డెబిట్‌ కార్డులు/క్రెడిట్‌ కార్డులు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వాటిని వెంటనే బ్లాక్‌ చేయాలి.
  • పబ్లిక్‌ ప్లేస్‌లలో Wifi ఎప్పుడూ ఉపయోగించవద్దు.
  • ఫిషీ ఇ-మెయిల్స్‌ లేదా SMSలకు జవాబు ఇవ్వొద్దు.
  • అసురక్షిత వెబ్‌సైట్స్‌, నమ్మదగని లింక్స్‌ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.
  • మీ ల్యాప్‌టాప్‌/ పీసీని రిమోట్‌ కంట్రోల్‌లో యాక్సెస్‌ చేయడానికి ఎవరినీ ఎప్పుడూ అనుమతించొద్దు.
  • మీ ఐడీలు, అడ్రస్‌ వివరాల ప్రూఫ్స్‌ ఇతరుల చేతికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
  • ఖాతాదారులు బ్యాంకు స్టేట్‌మెంట్స్‌, లావాదేవీల వివరాలను క్రమం తప్పకుండా సమీక్షించాలి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని