Home Rent: ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఇల్లు అద్దెకు తీసుకోవడం ప్రయోజనమేనా?

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు డిజిటల్‌ సాంకేతికత చాలా పెరిగింది. ఇంటిని ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా అద్దెకు తీసుకోవడం ప్రస్తుతకాలంలో పెరిగింది.

Published : 25 Nov 2023 15:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజల సంఖ్య పెరుగుదల కారణంగా అద్దె ఇళ్లకు డిమాండ్‌ పెరిగింది. అద్దె ఇళ్లను ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఇప్పుడు వెతుక్కోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అనేక వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. పెద్ద పట్టణాలలో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఇళ్లను అద్దెకు తీసుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇంటిని అద్దెకు తీసుకోవడానికి వివిధ ప్రసార సాధనాల ప్రకటనలు, సోషల్‌ మీడియా, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల మాటలు నమ్మడం కష్టమే కావచ్చు. సాంకేతికత ద్వారా అద్దె ప్రక్రియను మరింత సమర్థంగా, సురక్షితమైనదిగా చేయడానికి ఇప్పుడు అవకాశం ఉంది. డిజిటలైజేషన్‌.. స్థిరాస్తి మార్కెట్‌తో సహా వివిధ రంగాలకు సాంకేతికతను జోడించింది. ఇంటిని అద్దెకు తీసుకోవడానికి.. అద్దెదారుడు అందించిన సమాచారాన్ని ఇంటి యజమాని జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ ఈ విషయంలో ఎంతో స్నేహాపూర్వకంగా ఉన్నాయి. ఈ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ మోసాల తీవ్రతను తగ్గిస్తాయి. ఇల్లు కావలసిన అద్దెదారులు గుర్తింపు పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. అనేక ప్లాట్‌ఫామ్స్‌ తదుపరి ధ్రువీకరణ కోసం భౌతిక సైట్‌ సందర్శనలను నిర్వహిస్తాయి.

పారదర్శకత

డిజిటల్‌ రెంటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ వద్ద సంప్రదాయ బ్రోకర్లు అందించలేని పారదర్శకత ఉంటుంది. ఈ ప్లాట్‌ఫామ్స్‌ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలను వివరణాత్మకంగా అందిస్తాయి. వీటిలో హై క్వాలిటీ ఫోటోలతో పాటు ఆస్తికి సంబంధించిన విషయాలన్నీ వివరంగా పూర్తిగా ఉంటాయి. మరోవైపు సంప్రదాయ బ్రోకర్లు సమగ్ర జాబితాలను కలిగి ఉండరు. దీనివల్ల అద్దెదారులకు అవసరమయ్యే ఇంటిని కనుగొనడంలో కష్టం అవుతుంది. అంతేకాకుండా మానవ ప్రమేయం కారణంగా అద్దె విషయంలో పక్షపాతంగా ఉండడమే కాకుండా సొంత ప్రయోజనాలను అధికంగా ఆశిస్తారు. ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఇటువంటి సమస్యలు ఉండవు. కొన్ని వెబ్‌సైట్లు సేవలను చౌకగా అందిస్తుండంగా.. కొన్ని ఫ్రీగా కూడా ఇస్తున్నాయి.

ఆన్‌లైన్‌ అద్దె ఒప్పందాలకు సరైన ఆధారాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ‘డేటా’ యాక్సెస్‌ ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఆన్‌లైన్‌ అద్దె ఒప్పందంలో ఉల్లంఘనలకు అవకాశం ఉండదు. స్థిరాస్తి వంటి అధిక విలువ కలిగిన ఆస్తులకు సంబంధించిన లావాదేవీలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని సూచన ఉన్నప్పటికీ, ఆన్‌లైన్‌ ఇంటి అద్దె ప్లాట్‌ఫామ్స్‌ భద్రత, సౌలభ్యం, పారదర్శకతలో గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాయి.

సమయం ఆదా

ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల ఇంటికి సంబంధించిన మొత్తం భాగాన్ని వీడియో ద్వారా ఆన్‌లైన్‌లో చూడొచ్చు. ఇలాంటి అనేక ఇళ్ల వీడియోలు చూసి అద్దెదారులు షార్ట్‌లిస్ట్‌ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న ఇంటిని కన్‌ఫర్మ్‌ చేసుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా బయట తిరిగే పని చాలా వరకు తగ్గిపోతుంది. ఈ విషయంలో ఎక్కువ మానవ ప్రమేయం లేకుండా పని పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానం వేగవంతమైనది. సమర్థమైనది. అవాంతరాలు లేనిది కూడా.

సులభం

ఆన్‌లైన్‌ అద్దె ఒప్పందాలు సహజంగానే సులభంగా ఉంటాయి. ఇంటిని అద్దెకు తీసుకునే మొత్తం ప్రక్రియలో భారాన్ని తగ్గిస్తాయి. ఎందుకంటే, ప్రాపర్టీలను అద్దెకిచ్చే సంప్రదాయ ప్రక్రియ నెమ్మదిగా, శ్రమగా ఉంటుంది. అంతేకాకుండా అద్దె ఒప్పందాన్ని ఆఫ్‌లైన్‌లో రూపొందించడం సవాలుతో కూడుకున్న ప్రక్రియ కావొచ్చు. చిన్న పొరపాటు వల్ల కూడా మొత్తం ఇంటి అగ్రిమెంట్‌ పత్రాన్ని మళ్లీ టైప్‌ చేయాల్సి రావచ్చు. అయినప్పటికీ, ఆన్‌లైన్‌ అద్దె ఒప్పందాలతో సమానంగా ఉండదు. ఆఫ్‌లైన్‌ అద్దె ఒప్పందాలలో డాక్యుమెంట్స్‌ను టైప్‌ చేసి ప్రింట్‌ చేయడం, సంతకం చేయడం, స్కాన్‌ చేయడం వంటివి ఉంటాయి. అదే ఆన్‌లైన్‌ అద్దె ఒప్పంద సర్వీస్‌లో ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు ఒప్పందం కాపీతో ఇ-మెయిల్‌ అందుకుంటారు. అవసరమైతే హార్డ్‌ కాపీని కూడా తీసుకోవచ్చు. మామూలుగా అయితే సంప్రదాయ అద్దె ఒప్పందంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చట్టపరమైన పత్రాలను సరిగ్గా భద్రపరచుకోవాలి. ఒక్కోసారి పోగొట్టుకోవచ్చు కూడా. అయితే ఆన్‌లైన్‌ రికార్డులతో ఆ ఇబ్బంది ఉండదు. ఇ-మెయిల్‌లో ఉన్న దాన్ని ఎప్పుడైనా యాక్సెస్‌ చేయొచ్చు. 

పునరుద్ధరణ

రెసిడెన్షియల్‌ రెంటల్‌ అగ్రిమెంట్‌లు సాధారణంగా 11 నెలల పాటు కొనసాగుతాయి. రెండు పార్టీల పరస్పర సమ్మతి ప్రకారం.. ఈ సమయం తర్వాత తప్పనిసరిగా అగ్రిమెంట్‌ పునరుద్ధరణ జరగాలి. ఆన్‌లైన్‌ సర్వీస్‌ అయితే అద్దెదారుడికి, యజమానికి రాబోయే గడువు ముగింపు వ్యవధిని ముందుగానే తెలియజేస్తుంది. వారి లీజును పొడిగించే ఆప్షన్‌ వారికి అందిస్తుంది. ధ్రువీకరణ అయిన లీజు ఆన్‌లైన్‌లో ఉన్నందున మళ్లీ ఎక్కువ పని అవసరం లేదు. యజమాని చేయవలసిందల్లా అద్దెదారులకు మార్చిన అద్దె వివరాలు తెలిపి, తాజా కాపీని ఇ-మెయిల్‌కు పంపాలి. డిజిటల్‌ మోడ్‌లో ముఖ్యమైన ప్రయోజనమేంటంటే అక్షరాలు, సంతకాలను పొరపాటుగా దాటవేయలేరు. ఏదైనా వ్యత్యాసం ఉంటే ప్లాట్‌ఫామ్‌ వారి తప్పును హెచ్చరిస్తుంది.

ఒప్పందం తర్వాత

ఇల్లు ఖరారు అయిన తర్వాత అద్దెదారుడు, యజమాని మధ్య ఏవైనా విభేదాలు తలెత్తితే ఆఫ్‌లైన్‌ ఛానెల్‌లో సరైన సపోర్ట్‌ ఉండదు. కానీ, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో అయితే తమ సమస్యలను నివేదించవచ్చు. అద్దె ఒప్పందం విషయంలో కూడా ఇరుపక్షాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటారు. అదే బ్రోకర్లు అయితే ఇంటి యజమానులతో బలమైన సంబంధాలను కలిగి ఉంటారు. ఒప్పందంలో నిబంధనలు కూడా ఇంటి యజమానికే అనుకూలంగా ఉండేటట్లుగా చూస్తారు. ఆన్‌లైన్‌ ప్రక్రియలు చాలా నిష్పాక్షికంగా ఉంటాయి. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ అద్దెదారులు, యజమానులు ఇద్దరి హక్కులను సమర్థించే చట్టబద్ధమైన ఒప్పందాలను సులభతరం చేస్తాయి. తద్వారా ఇరువురి ప్రయోజనాలు నెరవేరతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు