Insurance: ఆన్‌లైన్‌ vs ఆఫ్‌లైన్‌ బీమా.. ఏది మెరుగైనది?

ప్రస్తుతం అన్ని రకాల బీమా పాలసీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో లభిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాయి? ఎలా మెరుగైనవి అనేది ఇక్కడ తెలుసుకోండి.

Published : 02 Apr 2024 17:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా.. ఏదైనా బీమా సౌకర్యాన్ని ప్రస్తుతం ఆన్‌లైన్‌లో/ఆఫ్‌లైన్‌లో పొందొచ్చు. ఆన్‌లైన్‌ మోడ్‌ కంటే ఆఫ్‌లైన్‌ మోడ్‌ దశాబ్దాల నుంచి కొనసాగుతూ ఉంది. కొవిడ్‌, లాక్‌డౌన్‌ల పరిణామాలతో ఆన్‌లైన్‌ మోడ్‌ బాగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. వివిధ రకాల బీమా పాలసీలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చౌకైన పాలసీలతో పాటు, మెరుగైన ఫెక్సిబిలిటీని పొందడమే కాకుండా పాలసీలను సరిపోల్చడానికి, మీకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవడానికి ఆన్‌లైన్‌లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. పాలసీ కొనుగోలు చేసేటప్పుడు ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోవడానికి వీటి మధ్య వైవిధ్యాలను తెలుసుకోవాలి. 

కొనుగోలు ప్రక్రియ

బీమా సంస్థకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌కు లాగిన్‌ అవ్వాలి. వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయాలి. ఎలాంటి భౌతిక పత్రాలనూ సమర్పించాల్సిన అవసరం లేదు. కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. ఈ వివరాలను బట్టి ప్రీమియం ఎంత అనేది బీమా సంస్థ నిర్ణయిస్తుంది. అయితే, ఇక్కడ నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాత ప్రీమియం ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. తదనంతరం పాలసీ డాక్యుమెంట్‌ను బీమా సంస్థ వినియోగదారుడి ఇ-మెయిల్‌కు వెంటనే పంపుతుంది. ఆఫ్‌లైన్‌లో బీమా పాలసీని కొనుగోలు చేస్తే వినియోగదారులు బీమా ప్లాన్స్‌ను మాన్యువల్‌గా సరిపోల్చాలి. దరఖాస్తును పూర్తి చేసి, ఆ దరఖాస్తులో అడిగిన వివరాల డాక్యుమెంట్స్‌ను కూడా జతచేసి సమర్పించాలి. అవసరమైన పత్రాలలో వైద్య రికార్డులు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డ్‌, చిరునామా రుజువు మొదలైనవి ఉంటాయి. మీ దరఖాస్తు బీమా సంస్థ ఆమోదించిన తర్వాత పాలసీకి సంబంధించిన రశీదు ఇస్తారు. కీలకమైన బీమా పట్టాను బీమా సంస్థ పోస్ట్‌లో కొన్ని రోజుల్లో పంపిస్తుంది.

పారదర్శకత

ఆన్‌లైన్‌లో పాలసీ కొనుగోలు చేసేటప్పుడు బీమా సంస్థకు సంబంధించిన ప్రస్తుత పాలసీదారులు పోస్ట్‌ చేసిన సమీక్షలను, రేటింగ్స్‌ను తనిఖీ చేయొచ్చు. బీమా సంస్థ విశ్వసనీయత గురించి తెలుసుకోవడానికి ఈ సమీక్షలు, రేటింగ్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇదే ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు ఏజెంట్‌ అందించిన సమాచారంపై పూర్తిగా ఆధారపడాలి. ఏజెంట్ల అభిప్రాయం పక్షపాతంగా ఉండే అవకాశం ఉంటుంది.

క్లెయిం ప్రక్రియ

ఆరోగ్య బీమా ద్వారా ఆసుపత్రిలో చేరేముందు.. ఆన్‌లైన్‌ క్లెయిం ప్రక్రియలో ఇ-మెయిల్‌ ద్వారా బీమా సంస్థకు తెలియజేయాలి. ఆపై బీమా సంస్థ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లో అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ ఆసుపత్రుల జాబితా నుంచి ఆసుపత్రిని ఎంచుకోవాలి. ఆ తర్వాత క్లెయిం వివరాలను పూరించి, డాక్యుమెంటేషన్‌ సమర్పించాలి. ఈ దశలు పూర్తి చేసిన తర్వాత పాలసీ నిబంధనల ప్రకారం బీమా సంస్థ నేరుగా ఆసుపత్రికి బిల్లు చెల్లిస్తుంది. ఆఫ్‌లైన్‌లో అయితే.. చికిత్స అవసరం పడినప్పుడు నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చేరిన వెంటనే బీమా సంస్థ థర్డ్‌ పార్టీ అడ్మినిస్ట్రేటర్‌కు కాల్‌ చేసి తెలపాలి. వారు అక్కడి నుంచి ప్రక్రియను నిర్వహిస్తారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో పాలసీ డాక్యుమెంట్‌లోని నిబంధనల ప్రకారం చికిత్స నగదు రహితంగా ఉంటుంది. ఇతర ఆసుపత్రుల్లో చేరితే ముందుగా నగదు చెల్లించి బీమా సంస్థ ద్వారా రీయింబర్స్‌మెంట్‌ పొందొచ్చు. ఇందుకుగాను స్వయంగా బీమా సంస్థకు చెందిన కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. లేదా బీమా కంపెనీతో సంప్రదించి వారికి అవసరమైన పత్రాలను పోస్ట్ ద్వారా పంపే వీలుంటుంది. మీ బ్యాంకు ఖాతాలో వారు నగదు జమ చేస్తారు.

పాలసీ పునరుద్ధరణ

ఆన్‌లైన్‌లో పాలసీ పునరుద్ధరణ చేసుకోవడం చాలా సులభం. బీమా సంస్థ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ను సందర్శించి రెన్యువల్‌ (పునరుద్ధరణ) విభాగానికి వెళ్లాలి. మీ మునుపటి పాలసీ నంబర్‌, రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ను తెలపాలి. పునరుద్ధరణ ప్రీమియాన్ని చెక్‌ చేసి, ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దీంతో మీ పాలసీ వెంటనే రెన్యువల్‌ అయిపోతుంది. ఆఫ్‌లైన్‌లో అయితే, మీ బీమా సంస్థ సమీప శాఖ కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ప్రీమియం చెల్లించాలి. లేదా ఏజెంట్‌ వద్దకు వెళ్లి ఈ పునరుద్ధరణను పూర్తి చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో ఈ ప్రక్రియకు కొంత సమయం కేటాయించాలి.

చివరిగా

భారత్‌ వంటి దేశంలో అందరూ అక్షరాస్యులు కారు. కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయడం లేదా ఇంటర్నెట్‌ ఉపయోగించడం అలవాటు లేని వ్యక్తులకు ఆఫ్‌లైనే సరైనది. కొంతమంది ఏజెంట్లు మెరుగైన శిక్షణ పొంది ఉంటారు. వినియోగదారులకు అనుకూలమైన చాలా విషయాలు ఏజెంట్లకు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. మెరుగైన సేవలు అందించే ఏజెంట్‌ లభించినప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా మంచి సలహాలు పొంది సరైన బీమాను కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని