PAN Card: పాన్‌ కార్డులో తప్పులా? ఇలా సరి చేసుకోండి..

పాన్‌ కార్డు హోల్డర్లు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులను సమర్పించి తప్పులను సరిదిద్దుకునే వెసులుబాటు ఉంది.

Published : 25 Jan 2023 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం ప్రతి చిన్న ఆర్థిక లావాదేవీకి పాన్‌ కార్డు (PAN Card)అవసరం. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ఐటీ రిటర్నులు ఫైల్‌ చేయాలన్నా, ఇతర ఆర్థిక లావాదేవీలు.. ఇలా అన్నింటికీ పాన్‌కార్డు (PAN Card) ఉండాల్సిందే. గుర్తింపు కార్డుగా కూడా పాన్‌ కార్డు (PAN Card) ఉపయోగపడుతుంది. అందువల్ల ఆర్థిక లేవాదేవీల్లో ఇబ్బందులు లేకుండా పని సాఫీగా సాగాలంటే పాన్‌ కార్డు (PAN Card)లో తప్పులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి. పాన్‌ కార్డు (PAN Card) సంబంధిత సమస్యలను సులభంగా పరిష్కరించుకునేలా భారత ప్రభుత్వం పాన్‌ గ్రీవెన్స్‌ సర్వీస్‌ను సులభతరం చేసింది. పాన్‌ కార్డు హోల్డర్లు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా ఫిర్యాదులను సమర్పించవచ్చు. 

సాధారణంగా వచ్చే తప్పులు..

 • తప్పు పేరు: పాన్‌ కార్డు (PAN Card) నమోదు చేసేటప్పుడు జరిగే సాధారణ తప్పులలో ఒకటి.. పేరు తప్పుగా రిజిస్టర్‌ కావడం. పాన్‌ కార్డు భారతదేశం అంతటా గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తుంటారు. అందువల్ల పేరు తప్పుగా నమోదైతే వెంటనే సరిచేసుకోవాలి.
 • కార్డుపై ఫొటో: మీ పాన్‌ కార్డుపై మీ ఫోటోకి బదులు వేరొకరి ఫొటో పడినా, ఫొటో సరిగా లేకపోయినా సంబంధిత అధికారికి నివేదించాలి. 
 • డెలివరీ కాకపోవడం: వివిధ కారణాల వల్ల ఒక్కోసారి పాన్‌ కార్డు (PAN Card) దరఖాస్తుదారుకు అందకపోవచ్చు. అలాంటప్పుడు పాన్‌ కార్డు తిరిగి అధికారులకు చేరుతుంది. లేదా పాన్‌కార్డు తప్పు చిరునామాకు చేరవచ్చు. ఇలా ఏ కారణం చేతనైనా మీ పాన్‌ కార్డు అందకపోతే అధికారులకు ఫిర్యాదు చేయాలి. 
 • ఇతర తప్పులు: పుట్టిన తేదీ, తండ్రి పేరు తప్పుగా రాయడం, సంప్రదింపు చిరునామాలో తప్పులు ఉంటే అధికారులకు తెలియజేయాలి.

ఎలా ఫిర్యాదు చేయాలి?

ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ ద్వారా..

 • ముందుగా ఆదాయపు పన్ను అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. 
 • "పన్ను చెల్లింపుదారుల సేవలు" విభాగంపై క్లిక్ చేయాలి. 
 • ఇక్కడ 'పాన్‌ గ్రీవెన్స్‌' సెక్షన్‌కు వెళ్లాలి.
 • పేజీ ఓపెన్‌ అయిన తర్వాత మీ కంప్లైట్‌తో పాటు సంబంధిత సమాచారం (పేరు, పాన్‌ నంబరు, వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్‌ ఐడి) వంటివి ఇచ్చి దరఖాస్తును సబ్మిట్‌ చేయాలి. 

TIN Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా..

 • ముందుగా TIN Protean eGov టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ పోర్టల్‌ను సందర్శించాలి. 
 • వెబ్‌సైట్‌లో కస్టమర్‌ కేర్‌ సెక్షన్‌కు వెళ్లాలి. 
 • కంప్లైంట్స్‌/క్వెరీస్‌లో ఉన్న దరఖాస్తు ఫారం క్లిక్‌ చేసి పూర్తిచేయాలి. 
 • ఫారం పూర్తి చేసిన తర్వాత.. చివరిలో ఉన్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేసి ఫారం సబ్మిట్‌ చేయాలి. 

ఆఫ్‌లైన్‌ ద్వారా..

ఆదాయపు పన్ను శాఖ హెల్ప్ డెస్క్ - 18001801961 లేదా  TIN Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్ కాల్ సెంటర్ - +91 2027218080కు కాల్‌ చేసి పాన్‌ సంబంధిత ఫిర్యాదును నమోదు చేయవచ్చు. లేదా ఈ-మెయిల్ ఐడీ - ask@incometaxindia.gov.in కు కూడా ఫిర్యాదు పంపవచ్చు. 

స్టేటస్‌ ఎలా తెలుసుకోవాలి? 

పాన్‌ సంబంధిత ఫిర్యాదును నమోదు చేసిన తర్వాత ఫిర్యాదు నంబరు ఇస్తారు. మీ ఫిర్యాదు స్థితిని తెలుసుకునేందుకు కంప్లైంట్ నమోదు చేసిన పోర్టల్‌లో.. మీ ఫిర్యాదు నంబరు, పాన్‌ నంబరు ఎంటర్‌ చేస్తే ఫిర్యాదు స్థితి తెలుస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని