Financial Frauds: పాన్‌ కార్డు మోసాలకు ఇలా చెక్‌ పెట్టండి!

పాన్ కార్డు దాదాపుగా అందరి వద్ద ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు చేయాలంటే ఇది తప్పనిసారి. దీనికి సంబంధించిన మోసాలు.. వాటిని నివారించడానికి మార్గాలు ఇక్కడ తెలుసుకుందాం.

Published : 27 May 2024 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు ఖాతా, డీమ్యాట్‌ ఖాతా తెరవాలన్నా.. పన్ను రిటర్నులు దాఖలు చేయాలన్నా అవసరమయ్యే ముఖ్యమైన డాక్యుమెంట్‌ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌). అయితే, ఈ పాన్‌ కార్డు నంబర్‌ను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు అనేక మోసాలు చేస్తున్నారు. అనేక వెబ్‌సైట్స్‌కు పాన్‌ కార్డు సమాచారం అవసరం కాబట్టి, మోసగాళ్లు నంబర్‌ను పొందడం, నేరాలకు పాల్పడడం పెరుగుతోంది.

పాన్‌ కార్డు

ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పత్రాన్ని పొందొచ్చు. పాన్‌ కార్డు అనేది 10 అంకెల ప్రత్యేక గుర్తింపు ఆల్ఫాన్యూమరిక్‌ నంబర్‌. దీన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పన్ను చెల్లించే వ్యక్తులు, సంస్థలు పాన్‌ను తప్పక కలిగి ఉండాలి. భారత ప్రభుత్వం జారీ చేసిన ఈ ముఖ్యమైన పత్రాన్ని.. ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారుడిని గుర్తించడానికి, వారి డబ్బుకు సంబంధించిన ఇన్‌ఫ్లో/అవుట్‌ఫ్లోను ట్రాక్‌ చేయడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి, ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు, పన్ను వివరాలను పాన్‌ కార్డు నంబరు ఉపయోగించి ట్రాక్‌ చేయొచ్చు.

పాన్‌ నంబర్‌ చోరీ

చాలా మంది ఈ కార్డును తమ గుర్తింపు రుజువుగా కూడా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి చోట్ల ఎక్కువగా పాన్‌ కార్డు నంబర్‌లను మోసగాళ్లు చోరీ చేస్తున్నారు. భారత్‌లో అనేక ప్రముఖుల పాన్‌ నంబర్లను ఉపయోగించి, స్కామర్లు మోసాలకు పాల్పడిన సందర్భాలు ఇప్పటికే చాలానే నమోదయ్యాయి. మోసగాళ్లు, సైబర్‌ నేరస్థులు పాన్‌ కార్డు వివరాలను పొందడానికి స్కిమ్మింగ్‌, విషింగ్‌, ఫిషింగ్‌ వంటి విభిన్న పద్ధతులను ఉపయోగిస్తారు. దీంతో చాలా మంది మోసాలకు గురవుతున్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఆన్‌లైన్‌ గుర్తింపు పత్రాలు, డిజిటల్‌ లావాదేవీలతో బిల్లులు చెల్లించడం, టికెట్లు బుక్‌ చేసుకోవడం, రుణాల కోసం దరఖాస్తు చేయడం వంటి రోజువారీ కార్యకలపాలు సులభతరం అయ్యాయి. కానీ, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్స్‌ వినియోగంతో ఐడెంటీ చోరీ, సైబర్‌ క్రైమ్స్‌ పెరుగుతున్నాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ తమ పాన్‌ కార్డును ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉపయోగించడం, కీలకమైన సమాచారాన్ని రక్షించుకోవడం చాలా అవసరం.

పాన్‌ నంబర్‌ దుర్వినియోగం

హ్యాకర్లు, సైబర్‌ నేరగాళ్లు వారి ప్రయోజనం కోసం, ఇతరులు ఉపయోగించే వివరాల కోసం నిరంతరం వెతుకుతారు. పాన్‌ కార్డులు ఒక వ్యక్తికి సంబంధించిన పేరు, పుట్టిన తేదీ, ఫ్రోటోగ్రాఫ్‌, పాన్‌ నంబరు, సంతకం వంటి కీలకమైన సున్నితమైన సమాచారాన్ని కలిగి ఉంటాయి. ఈ వ్యక్తిగత సమాచారం మోసగాళ్లకు అందుబాటులో ఉంటే, అది వివిధ మార్గాల్లో దుర్వినియోగం కావచ్చు. వారు మీ పేరు మీద కొత్తగా బ్యాంకు ఖాతాను తెరవడానికి, ఆ ఖాతా నుంచి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడానికి పాన్‌ కార్డును ఉపయోగించవచ్చు. రుణాలు, క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేయడానికి మోసగాళ్లు పాన్‌ నంబర్‌ను ఉపయోగించవచ్చు. ఆ తర్వాత రుణం చెల్లించకుండా మిమ్మల్ని బాధ్యులుగా చేయొచ్చు.

ఎలా తనిఖీ చేయాలి?

పాన్‌ కార్డు మోసం అనేది ఏదైనా ఆర్థిక, సాధారణ నేర కార్యకలాపాల కోసం దానిని దుర్వినియోగం చేయడాన్ని సూచిస్తుంది. ఏదైనా మోసం నుంచి తప్పించుకోవడానికి మీ పాన్‌ కార్డుకు సంబంధించిన ప్రామాణికతను ధ్రువీకరించడం చాలా ముఖ్యం. NSDL, భారత ఆదాయపు పన్ను శాఖ వంటి అధికారిక వెబ్‌సైట్స్‌ను సందర్శించడం ద్వారా పాన్‌ కార్డు చెల్లుబాటును ధ్రువీకరించవచ్చు. మీ క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేయడం ద్వారా ఎవరైనా మీ పాన్‌ కార్డు నంబరును దుర్వినియోగం చేస్తున్నారో లేదా కూడా మీరు గుర్తించవచ్చు. మీ క్రెడిట్‌ స్కోరును పర్యవేక్షించడం వల్ల మీరు తీసుకోని (ఏవైనా) అనధికార రుణాలను చూడొచ్చు. మీ క్రెడిట్‌ స్కోరు/రిపోర్ట్‌లో ఏవైనా మార్పులను కనుగొంటే, మీ వివరాలను ఎవరైనా ఉపయోగించారని అర్థం.

పాన్‌ కార్డులో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరగకుండా చూసుకోవడానికి మీ బ్యాంకు ఖాతా, ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచండి. మీరు చేయని ఏదైనా లావాదేవీని తెలుసుకోవడానికి లేదా నివేదించడానికి మీ క్రెడిట్‌ స్కోరు, ఆదాయపు పన్ను ఫారం 26A తనిఖీ చేస్తూ ఉండండి. ఈ ఫారం మీ పాన్‌ నంబరును ఉపయోగించి నిర్వహించే అన్ని లావాదేవీలను కలిగి ఉంటుంది. ఏవైనా వ్యత్యాసాలు ఉంటే, వాటిని సులభంగా ధ్రువీకరించవచ్చు. సిబిల్‌ వెబ్‌సైట్‌ను ఉపయోగించి మీ క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. మీకు తెలియని క్రెడిట్‌ కార్డు లేదా మీ పేరుతో తెరిచిన రుణాలు లేవని నిర్ధరించుకోండి.

మోసాల రకాలు

పాన్‌ కార్డు నంబరుతో మోసగాళ్లు మీ వివరాలను ఉపయోగించుకునే కొన్ని మార్గాలు ఇలా ఉంటాయి..

  • మోసగాళ్లు హోటల్‌లో అద్దెకు గదులను తీసుకునేటప్పుడు నకిలీ/చోరీ చేసిన పాన్‌ కార్డు వివరాలను ఉపయోగిస్తారు. వాహనాలను కూడా అద్దెకు తీసుకోవచ్చు. హోటల్‌ గదిలో ఏదైనా తప్పు జరిగితే పోలీసులు ముందుగా ఐడీలను తనిఖీ చేస్తారు. దీనివల్ల అసలు పాన్‌ కార్డుదారుడు కేసులో ఇరుక్కుంటారు.
  • వినియోగదారులు నిర్దిష్ట మొత్తానికి మించి బంగారాన్ని కొనుగోలు చేస్తే, పాన్‌ కార్డు సమాచారాన్ని తప్పనిసరిగా అందించాలి. మోసగాళ్లు ఈ సమాచారాన్ని అందించడానికి చోరీ చేసిన పాన్‌ కార్డులను ఉపయోగించవచ్చు. ఏదైనా పాన్‌ కార్డు దుర్వినియోగం జరిగితే, ఐటీ విభాగం మిమ్మల్ని విచారణకు పిలవొచ్చు.
  • ఎవరైనా మోసగాడు మీ పాన్‌ కార్డు వివరాలను చోరీ చేసి, వివిధ ఆర్థిక సంస్థల వద్ద రుణాలు తీసుకోవచ్చు. అలాగే, క్రెడిట్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది వివిధ ఆర్థిక మోసాలకు దారితీస్తుంది. తర్వాత అప్పు అసలు పాన్‌ కార్డుదారుడిపై పడుతుంది.
  • పాన్‌ కార్డు చోరీ చేసి ఆ నంబర్‌తో కొత్తగా బ్యాంకు ఖాతాను తెరవొచ్చు. తద్వారా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, లావాదేవీలకు పాల్పడితే అసలు కార్డుదారుడికి ఇబ్బందులు రావచ్చు.

పాన్‌ చోరీ నివారణ..

అనేక లావాదేవీలకు మీ పాన్‌ కార్డు నంబరును అందించడం తప్పనిసరి. అయితే, కార్డు వివరాలను షేర్‌ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో మీ కీలకమైన పాన్‌ కార్డు సమాచారాన్ని సాధారణంగా షేర్‌ చేసుకోవడం కూడా స్కామ్‌లకు దారితీయొచ్చు. మీ పాన్‌ కార్డు వివరాలను ప్రతి చోటా నమోదు చేయొద్దు. ప్రభుత్వం గుర్తించని క్రెడిట్‌ కార్డు లేదా లోన్‌ కంపారిజన్‌ సైట్స్‌ వంటి తెలియని వెబ్‌సైట్స్‌లో వ్యక్తిగత సమాచారాన్ని అందించవద్దు. చాలా నకిలీ వెబ్‌సైట్లు ఆన్‌లైన్‌లో ఉన్నాయి కాబట్టి, ఏదైనా వెబ్‌సైట్‌లో వివరాలను తెలిపేటప్పుడు ఆ వెబ్‌సైట్‌కు సంబంధించిన ప్రామాణికతను ధ్రువీకరించాలి. మీరు మీ పాన్‌ కార్డు ఫోటో కాపీలను జిరాక్స్‌ సెంటర్‌ వద్ద తీసుకుంటే అప్రమత్తంగా ఉండి ప్రతి కాపీని మీ వద్ద భద్రపరచుకోండి.

మీ పాన్‌ కార్డును ఐడీ ప్రూఫ్‌గా ఇవ్వడాన్ని నివారించాలి. గుర్తింపు రుజువు పత్రం ఇవ్వాల్సి వస్తే పాన్‌ కాకుండా ఏదైనా ఇతర పత్రాలను.. అంటే, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు లాంటి వాటిని ఉపయోగించాలి. పాన్‌ కార్డు సమాచారాన్ని మీ మొబైల్‌ ఫోన్‌లో ఉంచొద్దు. ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో మీ పూర్తి పేరు, పుట్టిన తేదీని నమోదు చేయొద్దు. ఎందుకంటే, సైబర్ నేరగాళ్లు ఈ వివరాలను ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో మీ పాన్‌ కార్డు నంబరును కనుగొనడానికి ఉపయోగించవచ్చు. ఎల్లప్పుడూ ఒరిజినల్‌ పాన్‌ కార్డు, ఫోటోకాపీలు రెండింటినీ సురక్షితంగా భద్రపరచుకోవాలి. మీ పాన్‌ కార్డు వివరాలను అనధికార సైట్స్‌/వ్యక్తులతో షేర్‌ చేయొద్దు. అధీకృత సంస్థలు, వ్యక్తులతో పంచుకోవడం సురక్షితం.

కార్డు డీయాక్టివేట్‌/ ఫిర్యాదు

వ్యక్తులు తమ కార్డులను కోల్పోవడం లేదా ఏదైనా తప్పిదం వల్ల స్కామర్ల దుర్వినియోగంతో చాలా రకాల పాన్‌ కార్డు మోసాలు జరుగుతుంటాయి. కాబట్టి, మీ పేరుపై బహుళ కార్డులు ఉన్నట్లయితే, మీ స్థానిక ఆదాయపు పన్ను అసెసింగ్‌ అధికారిని సందర్శించడం ద్వారా కార్డును డీయాక్టివేట్‌ చేయించవచ్చు. ఇంకా 1930 నంబరుకు డయల్‌ చేయడం ద్వారా వెంటనే ఫిర్యాదును నమోదు చేయొచ్చు. నేషనల్‌ సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ను సంప్రదించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని