Loan: వ్యక్తిగత రుణం, పీపీఎఫ్‌ రుణం.. ఏది మేలు?

పీపీఎఫ్‌ ఖాతా ఉన్నవారు, పీపీఎఫ్‌ ఖాతాపై రుణం తీసుకోవాలా? వ్యక్తిగత రుణం తీసుకుంటే మంచిదా తెలుసుకుందాం. 

Published : 28 Dec 2022 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తులు ఆర్థిక అవసరాల్లో రుణం తీసుకోవడం సహజమే. అయితే, అవకాశాలను అనుసరించి ఎక్కడ రుణం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ఈ ఏడాది మే నుంచి ఆర్‌బీఐ పలుమార్లు రెపో రేటు పెంచుతూ వచ్చింది. దీంతో లెండింగ్‌ రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. బ్యాంకులు కూడా సురక్షిత రుణాలు, అసురక్షిత రుణాలు.. ముఖ్యంగా వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పీపీఎఫ్‌ ఖాతా ఉన్నవారు దానిపై రుణం తీసుకోవాలా? లేక వ్యక్తిగత రుణం తీసుకుంటే మంచిదా?

రుణ అర్హత..

వ్యక్తిగత రుణం: నెలవారీ స్థిర ఆదాయం, మంచి క్రెడిట్‌ స్కోరు నిర్వహించేవారు, ఎలాంటి హామీ లేకుండా  సులభంగానే వ్యక్తిగత రుణాలను పొందవచ్చు.  

పీపీఎఫ్‌: ఖాతా తెరిచిన వారికి 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు రుణం అందుబాటులో ఉంటుంది. మొదటి రెండు ఆర్థిక సంవత్సరాలు రుణం పొందే వీలులేదు. అలాగే, 6వ ఆర్థిక సంవత్సరం తర్వాత రుణం లభించదు. ఉదాహరణకు మీరు 2019-2020 ఆర్థిక సంవత్సరంలో ఖాతా తెరిచినట్లయితే, 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రుణం పొందేందుకు అర్హులవుతారు. ఆరో సంవత్సరం, అంటే 2025-26 వరకు మాత్రమే రుణం అందుబాటులో ఉంటుంది. రుణ ప్రాసెస్‌, మంజూరుకు కొంత సమయం పట్టవచ్చు. 

లోన్‌ మొత్తం..

వ్యక్తిగత రుణం: ఈ రుణంపై ఎలాంటి పరిమితులూ ఉండవు. వ్యక్తి ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యం, బ్యాంకు నియమాలను అనుసరించి రుణం మంజూరు చేస్తారు.

పీపీఎఫ్‌: ఈ ఖాతా నిబంధనల ప్రకారం రుణ మొత్తంపై గరిష్ఠ పరిమితి ఉంటుంది. రుణం తీసుకువాలకున్నప్పుడు.. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం క్లోజింగ్‌ బ్యాలెన్స్‌పై 25% మొత్తం మించకుండా రుణం తీసుకోవచ్చు. 

రుణ కాలవ్యవధి..

వ్యక్తిగత రుణం: తిరిగి చెల్లించేందుకు గరిష్ఠంగా 5-7 సంవత్సరాల వరకు సమయం ఇస్తారు.

పీపీఎఫ్‌ రుణం: తిరిగి చెల్లింపులకు 36 నెలల సమయం ఇస్తారు. రుణం మంజూరు చేసిన నెలలో మొదటి రోజు నుంచి కాలవ్యవధిని లెక్కిస్తారు. 

వడ్డీరేటు..

వ్యక్తిగత రుణం: ఎటువంటి హామీ లేకుండా ఇస్తారు కాబట్టి వ్యక్తిగత రుణాలు అసురక్షితమైనవి. వీటితో బ్యాంకులకు రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిపై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. వార్షికంగా 10-24% మధ్య ఉండవచ్చు

పీపీఎఫ్‌: రుణ మొత్తంపై 1% వడ్డీ వసూలు చేస్తారు. అయితే, రుణం తిరిగి చెల్లించేంత వరకు పీపీఎఫ్‌ ఖాతాపై వడ్డీని పొందలేరు. కాబట్టి, ప్రస్తుతం పీపీఎఫ్‌ ఖాతాకు లభిస్తున్న వడ్డీకి 1% కలుపుకొని వడ్డీ ఎంత వర్తింస్తుందో లెక్కించవచ్చు.

రీపేమెంట్‌..

వ్యక్తిగత రుణం: ఈఎంఐల రూపంలో ముందుగా ఎంచుకున్న కాలపరిమితిలోపు చెల్లించాల్సి ఉంటుంది. ముందస్తు చెల్లింపులపై ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది. 

పీపీఎఫ్‌ రుణం: ఏకమొత్తంగా ఒకేసారి చెల్లింపులు చేయవచ్చు. లేదా చెల్లింపుల కాలవ్యవధిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ వాయిదాల్లో ఖాతాదారుడు తన ఇష్ట ప్రకారం చెల్లించవచ్చు. 

పీపీఎఫ్‌, వ్యక్తిగత రుణం.. ఏది మంచిది?

ఎక్కువ మొత్తంలో రుణం కావాలనుకుంటే..
పీపీఎఫ్‌లో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌ ఉంటుంది. ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టే వీలుంది. ఒకవేళ మీరు రెండేళ్లు పాటు ఏడాదికి రూ.1.50 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టి, మూడో సంవత్సరం రుణం తీసుకోవాలంటే.. రెండేళ్లలో గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. కాబట్టి, ఈ మొత్తంపై 25% వరకు, అంటే రూ.75 వేల వరకు మాత్రమే రుణం పొందే వీలుంది. ఒకవేళ 4వ సంవత్సరంలో రుణం తీసుకోవాలంటే రూ.4.50 లక్షలపై రూ.1,12,500 మాత్రమే రుణం పొందగలరు. అంటే, ఎక్కువ మొత్తంలో రుణం కావాలనుకుంటే పీపీఎఫ్‌లో సాధ్యం కాకపోవచ్చు. అటువంటి వారు వ్యక్తిగత రుణం ఎంచుకోవచ్చు. 

వడ్డీ పరంగా..
వడ్డీ పరంగా చూసుకుంటే వ్యక్తిగత రుణంపై 10-24% వరకు కూడా వడ్డ వర్తించే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. పీపీఎఫ్‌ ప్రస్తుత వడ్డీరేటు 7.10%..1% అదనంగా కలుపుకొంటే 8.10% వడ్డీ వర్తిస్తుంది. ఇది వ్యక్తిగత రుణంతో పోలిస్తే తక్కువే.

చివరిగా..

స్వల్పకాల అవసరాల కోసం చిన్న చిన్న మొత్తాల్లో రుణం తీసుకుని తిరిగి చెల్లించేవారు పీపీఎఫ్‌ రుణాన్ని ఎంచుకోవచ్చు. అధిక మొత్తంలో రుణం కావాలనుకుంటే వ్యక్తిగత రుణాన్ని పరిశీలించవచ్చు. అయితే, వీలైనంత వరకు అధిక వడ్డీ గల రుణాలను ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే ఎంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని