Corpus: మీ పదవీ విరమణ, పిల్లల విద్యకు ఎలా ప్లాన్‌ చేయాలి?

ప్రస్తుతం ఎవరి జీవితంలోనైనా పిల్లల విద్య, పదవీ విరమణకు తగినంత నిధిని సమకూర్చుకోవడం చాలా ముఖ్యం. దీనికి తగిన ప్రణాళిక ఎంత అవసరమో ఇక్కడ చూడండి.

Published : 19 May 2023 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పిల్లల చదువులు, పదవీ విరమణ నిధి అనేది మన జీవితంలో అతిపెద్ద లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. ఈ రెండింటికి ఏకకాలంలోనే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రెండు లక్ష్యాలు జీవితంలోని వివిధ దశల్లో షెడ్యూల్‌ చేసుకోవాలి. అలాగే, మీ పెట్టుబడి విధానం కూడా అదే విధంగా సిద్ధం చేసుకోవాలి. ఎలా ప్లాన్‌ చేసుకోవాలనేది ఇక్కడ చూద్దాం.. 

రెండూ ఉన్నతమైన లక్ష్యాలే..

ఈ రోజుల్లో పిల్లల చదువు అంటే ఆషామాషీ విషయం కాదు. ఉన్నత విద్య అంటే ఖర్చులు మామూలుగా ఉండవు. దీనికి ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. అలాగే, పదవీ విరమణ నిధి ఎంత ముఖ్యమో వృద్ధాప్యంలో మీకు, మీపై ఆధారపడిన వారికి ఆ సమయంలోనే తెలుస్తుంది. ఆర్థిక ప్రణాళిక అమలులో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే, మొత్తం ఆర్థిక లక్ష్యాన్నే ప్రమాదంలో పడేస్తుంది. ప్రత్యేకించి మీరు పిల్లల చదువు, పదవీ విరమణ వంటి పెద్ద ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే దీర్ఘకాలం పాటు ఎటువంటి తప్పులు చేయకూడదు.

లక్ష్యాలకు ప్రాధాన్యం

ఈ రెండు ఆర్థిక లక్ష్యాలను సమర్థంగా నిర్వహించడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకోవాలి. సాధారణంగా పిల్లల చదువుకు, పదవీ విరమణకు మధ్య 10, 15 సంవత్సరాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు మీరు దాదాపు 40-50 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మీ పిల్లలకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అవసరం కావచ్చు. సాధారణంగా వ్యక్తులు 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేస్తారు. ఈ లక్ష్యాల కోసం ఎప్పుడు మదుపు ప్రారంభించారనే దానిపై ఆధారపడి, మీ ప్రయత్నానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి.

సంప్రదాయ పెట్టుబడులు

సహజంగా పెట్టుబడులంటే.. బ్యాంకు ఎఫ్‌డీలు, పీపీఎఫ్‌, ఈపీఎఫ్‌/వీపీఎఫ్‌ లాంటి సంప్రదాయ పెట్టుబడులను ఆశ్రయిస్తారు. కానీ, విద్య, పదవీ విరమణ నిధి దీర్ఘకాలానికి సంబంధించినవి. సంప్రదాయ పెట్టుబడుల్లో రిస్క్‌ లేకపోయినా సరైన రాబడి ఉండకపోవచ్చు. విద్య, పదవీ విరమణకు అధిక నిధులు కూడా అవసరం. అందుచేత వీటికి తగ్గట్టుగా విభిన్నంగా ఆలోచించడం మంచిది. రిస్క్‌ ఉన్నా కూడా దీర్ఘకాలానికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ సరైనవి అని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈక్విటీల వైపు మొగ్గు చూపడం కూడా సరైన ఆలోచన.

పెట్టుబడులు భిన్నంగా ఉండాలి

రెండు లక్ష్యాలు జీవితంలోని వివిధ దశలలో వచ్చే అవకాశం ఉన్నందున మీ పెట్టుబడి విధానం కూడా అదే విధంగా ఉండాలి. పదవీ విరమణ కోసం ఎన్పీఎస్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో పెన్షన్ కూడా పొందొచ్చు. 'ఆటో ఆలోకేషన్' ఎంచుకున్నట్లైతే వయసు ఆధారంగా డేట్, ఈక్విటీలో పెట్టుబడులు చేయొచ్చు. మరోవైపు పిల్లల విద్య, పదవీ విరమణ కన్నా ముందే వస్తుంది. అధికంగా రిస్క్‌ ఉండే సాధనాలలో పెట్టుబడి పెట్టకూడదు. ఒకవేళ రిస్క్‌ తీసుకుని విద్య కోసం ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే, లక్ష్య సమయానికి 3 సంవత్సరాల ముందే ఫండ్స్‌ నుంచి డబ్బును ఉపసంహరించుకుని బ్యాంకు ఎఫ్‌డీల్లో వేయడం మంచి పని. 15 ఏళ్ల సమయం ఉన్నట్లయితే పీపీఎఫ్ ఎంచుకోవచ్చు. ఆడపిల్లల కోసం అయితే సుకన్య సమృద్ధి యోజన మంచి పథకం.

విద్యానిధి సమకూరకపోతే..

ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, విద్య కోసం అనుకున్న నిధి సమకూరకపోతే ఏం చేయాలన్నది కూడా యోచన చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మీరు విద్యా రుణం తీసుకోవడం లేదా కొన్ని పెట్టుబడులను లిక్విడేట్‌ చేయడం వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే, మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. ఉదా: హాలిడే ట్రిప్స్‌, కారు కొనుగోలు మొదలైన స్వల్పకాలిక లక్ష్యాలను త్యాగం చేయడం ద్వారా విద్యా రుణాన్ని నెమ్మదిగా తిరిగి చెల్లించవచ్చు.

చివరిగా: విద్యా, పదవీ విరమణ రెండు విషయాల్లోనూ మీ ఆర్థిక ప్రణాళికను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మీ జీవనశైలిలో మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మీ పెట్టుబడులను సర్దుబాటు చేయాలి. పెట్టుబడులను సాధ్యమైనంత ముందుగానే ప్రారంభించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని