Portfolio Review: పోర్ట్‌ఫోలియో స‌మీక్షిస్తున్నారా? ఇవి తెలుసుకోండి..

ఆర్థిక లక్ష్యాలు, పొదుపు, పెట్టుబడుల పరంగా తీర్మానాలు చేసేటప్పుడు ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం మంచిది.

Published : 01 Jan 2023 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్టుబ‌డులను త‌రచూ మార్చడం వ‌ల్ల చివ‌రికి న‌ష్టాలు మిగిలే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అలా అని పెట్టుబ‌డుల‌ను స‌మీక్ష చేయ‌కుండా వదిలివేయడం కూడా సరికాదు. ఏడాదికి ఒకసారైనా పెట్టుబ‌డుల‌ను సమీక్షించడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. ఇందుకు సంవత్సరాంతం అనువైన సమయం. నూతన సంవత్సరంలో చాలా మంది కొత్త కొత్త తీర్మానాలు చేస్తుంటారు. ఆర్థిక లక్ష్యాలు, పొదుపు, పెట్టుబడుల పరంగా తీర్మానాలు చేసేటప్పుడు ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను సమీక్షించడం మంచిది.

ఆర్థిక ల‌క్ష్యాలు..

మనం పెట్టుబడులను ప్రారంభించేటప్పుడు ముందుగా లక్ష్యాలను నిర్దేశించుకుంటాం. వాటి ప్రకారమే పెట్టుబడులు చేస్తుంటాం. అయితే మీ ఆర్థిక ల‌క్ష్యాలు నెర‌వేరే విధంగా వాటి ప‌నితీరు ఉందో లేదో గ‌మ‌నించాలి. కొన్నిసార్లు స్నేహితులు, బంధువులు, ఇతరుల సలహాలతో పెట్టుబ‌డులు పెడుతుంటాం. అవి ఒక్కోసారి పేలవ ప్రదర్శన కనబర్చవచ్చు. గ‌తంలో మంచి లాభాల‌ను తెచ్చిన ఫండ్లు, న‌ష్టాల్లో ఉండొచ్చు. సమీక్ష ద్వారా మీ ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పెట్టుబ‌డుల‌ను సరిదిద్దుకోవచ్చు.

లాభం లేకపోతే?

పోర్ట్‌ఫోలియోలో ఏ పెట్టుబడి వల్ల లాభం లేదో దాన్ని తొల‌గించవచ్చు. మార్కెట్లు స్వల్పకాలంలో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంటాయి. అందువల్ల మార్కెట్లతో అనుసంధానమైన పెట్టుబడుల విషయంలో స్వల్పకాలంలో నిర్ణయం తీసుకోలేం. కాబట్టి, కొంత వేచి చూడొచ్చు. గత 2-3 సంవ‌త్సరాల్లో పనితీరు సరిగ్గాలేని ఫండ్లను తొల‌గించి ఇత‌ర వాటిలో పెట్టుబ‌డులు పెట్టడం మంచిది. 

తిరిగి నిర్మించుకోండి..

సమీక్ష సమయంలో మీ పోర్ట్‌ఫోలియో సరిగ్గా లేదనిపిస్తే తిరిగి నిర్మించుకోవచ్చు. అలాగే కొత్త లక్ష్యాలు, సంబంధింత పెట్టుబడులను పోర్ట్‌ఫోలియోకు చేర్చవచ్చు. ఖరీదైన వస్తువుల కొనుగోలు, వివాహం, విద్య, టూర్‌లు ఇలా వారి వారి లక్ష్యాలకు తగినట్లు పెట్టుబడులను ఎంచుకుని పోర్ట్‌ఫోలియో పునర్మించుకోవచ్చు. 

పన్ను ప్రణాళిక..

పన్నులు మూలధన రాబడిని తగ్గిస్తాయి. కాబట్టి పోర్ట్‌ఫోలియో సమీక్షించేటప్పుడు.. మీ ప్రస్తుత పెట్టుబడులపై ఎంత వరకు పన్ను ఆదా చేసుకోగలుగుతున్నారో చూడండి. కొత్త పెట్టుబడులు చేస్తుంటే, లక్ష్యాలతో పాటు పన్ను ఆదా చేయగలిగే పెట్టుబడులను ఎంచుకోవడం ద్వారా అధిక ప్రయోజనం పొందొచ్చు.

బీమా రక్షణ..

బీమా కూడా ఒకరకంగా పెట్టుబడే. ప్రతి ఒక్కరి ఆర్థిక ప్రణాళికలో జీవిత, ఆరోగ్య బీమా రెండూ ఉండాలి. ఇవి రెండు మీ ప్రస్తుత అవసరాలకు తగినట్లు ఉన్నాయో లేదో చూడండి. ఒకవేళ లేకపోతే తగిన మార్పులు చేసుకోవచ్చు.

త‌ప్పుల నుంచి నేర్చుకోండి..

పోర్ట్‌ఫోలియో సవరించుకునేటప్పుడు ఒకసారి చేసిన తప్పులు, పొరపాట్లు మ‌ళ్లీ మళ్లీ జరగకుండా జాగ్రత్తపడాలి. కొందరు పెట్టుబడులు ప్రారంభిస్తారు. కానీ, వాటిని కొనసాగించడంలో విఫలమవుతుంటారు. ఉదాహరణకు సిప్‌ పెట్టుబడులను తీసుకుంటే.. మార్కెట్లు దిగువున ఉన్నప్పుడు, లేదా వేరే ఇతర కారణాలతో సిప్‌ చేయడం మానేస్తారు. ఇది సరికాదు. నిర్ణయాలు తీసుకునేట‌ప్పుడు ఆచితూచి అడుగేయాలి. ఆరోగ్యకరమైన పోర్ట్‌ఫోలియో త‌యారు చేసుకుని, క్రమశిక్షణతో పెట్టుబడులు చేయడం ద్వారా పెద్ద పెద్ద ల‌క్ష్యాల‌ను కూడా సులభంగా చేరుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని