Senior Citizens: పదవీ విరమణ అనంతరం పెన్షన్ పొందడానికి 3 మార్గాలు

పదవీ విరమణ అనంతరం ప్రతి ఒక్కరూ తమ అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు అవసరం పడతాయి. వాటికి ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలో ఇక్కడ చూడండి..

Published : 27 Feb 2024 18:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పదవీ విరమణ అనంతరం సాఫీగా జీవించడానికి ఆర్థిక పరిస్థితి సహకరించడం ఎవరికైనా చాలా అవసరం. కొంత మందికి పెన్షన్‌ ఉండొచ్చు. మరికొంతమందికి పెన్షన్‌ ఉన్నా కూడా అది పూర్తిగా సరిపోని పరిస్థితి. ముఖ్యంగా ఈ వయసు వారికి అనారోగ్య ఖర్చులు ఇబ్బంది పెడుతుంటాయి. అధిక ఖర్చుల కారణంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. పదవీ విరమణ చేసిన అనంతరం ప్రతి నెలా డబ్బును స్వీకరించడానికి కొన్ని ముఖ్యమైన పథకాలను ఇక్కడ చూడండి.

సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీం (SCSS)

ఈ స్కీం ప్రధానంగా సీనియర్‌ సిటిజన్లకు ఉద్దేశించింది. 60 ఏళ్లు పైబడిన వారికి ఇది సరైన పెట్టుబడి ఎంపిక. ఈ పథకంలో వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి కాలవ్యవవధి 5 ఏళ్లు, అదనంగా పెట్టుబడి ఖాతాను 3 సంవత్సరాలు పొడిగించుకోవడానికి అనుమతి ఉంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 8.20%. కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. పెట్టుబడి మొత్తాన్ని మధ్యలో ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉంది. రూ.30 లక్షల డిపాజిట్‌కు త్రైమాసిక ప్రాతిపదికన రూ.61,600 వడ్డీను అందుకుంటారు. వడ్డీ చెల్లింపు ఏప్రిల్‌, జులై, అక్టోబర్‌, జనవరి మొదటి తేదీలో పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ఇది ప్రభుత్వం హామీ ఉండే పథకం కాబట్టి, పదవీ విరమణ చేసిన వారికి ఇది చాలా మంచి ఎంపిక.

పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీం (POMIS)

ఈ ఖాతాను పోస్టాఫీసులో తెరవొచ్చు. ఇది ఐదు సంవత్సరాల పెట్టుబడి వ్యవధిని కలిగి ఉంటుంది. గరిష్ఠ పెట్టుబడి పరిమితి ఒక ఖాతాలో రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు. దీని ప్రస్తుత వడ్డీ రేటు 7.40%. రూ.9 లక్షల డిపాజిట్‌కు గానూ ప్రతి నెలా రూ.5,550 వడ్డీ లభిస్తుంది. ఇది 5 ఏళ్ల పెట్టుబడి వ్యవధిని కలిగి ఉన్నప్పటికీ, అదనంగా ఇంకో 5 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగించవచ్చు. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం, కాబట్టి మెచ్యూరిటీ వరకు మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నెలా ఆదాయం కావలసిన సీనియర్‌ సిటిజన్లకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ)

చాలా బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు వివిధ కాలవ్యవధి గల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై సాధారణ వడ్డీ రేట్ల కంటే 0.50% అదనపు వడ్డీని అందిస్తాయి. ఈ వడ్డీని డిపాజిట్‌దార్లకు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా చెల్లిస్తారు. ప్రముఖ బ్యాంకులు ఈ డిపాజిట్లకు గానూ సీనియర్‌ సిటిజన్లకు 7-7.50% వడ్డీని అందిస్తున్నాయి. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు 1-1.50% దాకా అదనపు వడ్డీని అందిస్తాయి. ఈ డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కూడా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని