Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!

Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి.  కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. 

Updated : 21 Mar 2024 10:44 IST

Health Insurance Claims | ఇంటర్నెట్‌డెస్క్‌: అత్యవసర సమయంలో అనారోగ్యానికి గురైనపుడు ఆరోగ్య బీమా పాలసీ (Health Insurance) అండగా నిలుస్తుంది. ఆర్థిక ఇబ్బందుల్లోకి జారుకోకుండా ఆదుకుంటుంది. కొన్నిసార్లు బీమా సంస్థలు పలు కారణాలు చూపుతూ క్లెయింలను తిరస్కరిస్తుంటాయి.  ఇలాంటి సందర్భంలో ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావొచ్చు. అందుకే ఆరోగ్య బీమా తీసుకున్న ప్రతిఒక్కరూ క్లెయిం తిరస్కరణకు గల కారణాలేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

క్లెయిం ప్రాసెస్‌లో తప్పులు..

ఆరోగ్య బీమా క్లెయిం దాఖలు చేయడంలో ఏదైనా పొరపాటు జరిగితే బీమా సంస్థ తిరస్కరించొచ్చు. అవసరమైన ఫారాల్లో పూర్తి సమాచారం అందించకున్నా, ఆలస్యంగా సమర్పించినా క్లెయిం పొందలేరు. అందుకే క్లెయిం సబ్మిట్‌ చేయాల్సిన గడువును గుర్తుంచుకోండి.

వ్యాధుల సమాచారం 

బీమా విషయంలో మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయమూ ఎంతో కీలకం. పాలసీ తీసుకునేటప్పుడు దరఖాస్తు పత్రంలో ఇప్పటికే ఉన్న వ్యాధుల గురించి తెలియజేయాలి. ఈ విషయంలో చాలా నిజాయతీగా ఉండాలి. చిన్న పొరపాటు చేసినా, బీమా సంస్థ దాన్నే సాకుగా చూపి క్లెయింను తిరస్కరించే వీలుంటుంది. ఎందుకంటే చాలా సంస్థలు ముందస్తు వ్యాధులకు క్లెయిం కవరేజీని అందించవు. పాలసీ నిబంధనల్లో ఇదే కీలకంగా మారుతుంది. అందుకే పాలసీ కొనుగోలు చేసేటప్పుడు ఈ షరతుల్ని తెలుసుకోండి.

కాల వ్యవధి చూసుకోండి

ప్రతి ఆరోగ్య బీమా పాలసీకి చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. సాధారణంగా ఆ గడువు ఏడాది మాత్రమే ఉంటుంది. పాలసీ ద్వారా అందే కవరేజ్‌ని పొందాలంటే కచ్చితంగా గడువు తీరకముందే దాన్ని పునరుద్ధరించుకోవాలి. గడువు ముగిసినట్లయితే పాలసీ పనికిరాదు. అంటే క్లెయిం పొందడానికి అర్హత ఉండదన్నమాట.

వెయిటింగ్‌ పీరియడ్‌

బీమా సంస్థలు కొన్ని వ్యాధులకు వెయిటింగ్‌ పీరియడ్ నిర్ణయిస్తాయి. వెయిటింగ్‌ పీరియడ్‌ ముందే చికిత్స కోసం క్లెయిం చేసుకుంటే దాన్ని బీమా సంస్థ ఆమోదించకపోవచ్చు. ఉదాహరణకు మెటర్నటీ సంబంధిత కవరేజ్‌ పొందాలంటే సంస్థ నిర్దేశించిన సమయం వరకు ఆగాల్సిందే. బీమా సంస్థలను బట్టి, ఈ వెయిటింగ్‌ పీరియడ్‌లో వ్యత్యాసం ఉంటుంది.  పాలసీ తీసుకునేటప్పుడే ఈ నిబంధన గురించి స్పష్టంగా తెలుసుకోవాలి.

వ్యాధుల జాబితా

కొన్ని వ్యాధుల చికిత్సకు పరిహారం లభించదని బీమా సంస్థ ముందుగానే తెలియజేస్తుంది. ఈ జాబితాలో ఉన్న వ్యాధుల చికిత్స కోసం వెళ్లినప్పుడు బీమా సంస్థ పరిహారం ఇవ్వదు. ఈ విషయాన్ని పాలసీ కొనుగోలు సమయంలోనే స్పష్టంగా పేర్కొంటాయి. అందుకే పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని