Financial Planning: ఆర్థిక ప్రణాళికలో తప్పక గుర్తుంచుకోవాల్సినవి

ఆర్థిక ప్రణాళిక అనేది ఎవరి జీవితంలోనైనా చాలా ముఖ్యమైనది. ఇది ఆర్థికపరమైన విషయాలలో ఆదాయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడంలో మీకు ఎనలేని సహాయం చేస్తుంది. ఆర్థిక ప్రణాళికలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 21 May 2024 18:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో వివిధ దశలను విజయవంతంగా పూర్తి చేయడానికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సమర్థమైన ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. ఇది మీ అవసరాలను, ఆదాయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడంలో మీకు ఎనలేని సహాయం చేస్తుంది. సరైన సమయంలో మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నవారు జీవితంలో ఎక్కువ భాగం సంతోషంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్‌లో సంతోషకరమైన పదవీ విరమణ జీవితం గడిపేలా సహకరిస్తుంది. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, వ్యూహాలు అమలుచేయాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆర్థిక లక్ష్యాలు రాసుకోండి

స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం మంచి ఆర్థిక ప్రణాళికకు మూల స్తంభం. పిల్లల ఉన్నత (విదేశీ) విద్య కోసం, పిల్లల వివాహం, మెరుగైన పదవీ విరమణ, అత్యవసర నిధి కోసం తగిన లక్ష్యాలను కలిగి ఉండడం ఎంతో ప్రేరణను కలిగిస్తుంది. ఇలాంటి లక్ష్యాలు రాసుకోవడం వల్ల వాటిని ఆచరణలో పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే లక్ష్యాలు స్మార్ట్‌గా ఉండడమే కాకుండా సాధించగలవి, సమయానుకూలమైనవిగా ఉండాలి.

బడ్జెట్‌

బడ్జెట్‌ అనేది మీ ఆదాయం, ఖర్చులను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది మీ డబ్బు ఎక్కడికి వెళుతుందో ట్రాక్‌ చేయడానికి, అధిక వ్యయం అయ్యే పరిస్థితులను గుర్తించడానికి, తదనుగుణంగా సర్దుబాట్లు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. బడ్జెట్‌లో అన్ని ఆదాయ వనరులు, స్థిర ఖర్చులు (అద్దె, యుటిలిటీలు, పాఠశాల ఫీజులు వంటివి), అస్థిర/వేరియబుల్‌ ఖర్చులు (కిరాణా, వినోదం, ప్రయాణాలు, దుస్తులు వంటివి), మొదలైన ఇతర ఖర్చులను కనుగొని అవసరాన్ని బట్టి మీ ఆదాయాన్ని కేటాయించండి. అత్యవసర పరిస్థితులు, పొదుపు, పెట్టుబడి ప్రయోజనాల కోసం నిధులను కేటాయించాలని నిర్ధరించుకోండి. విజయవంతమైన బడ్జెట్‌ అంటే రాసుకోవడమే కాదు..  దానికి కట్టుబడి ఉండాలి. మీ బడ్జెట్‌ను క్రమం తప్పకుండా సమీక్షించడం, సర్దుబాటు చేయడం కూడా ఆర్థిక లక్ష్యాలలో కీలకం.

BNPL స్కీమ్‌

ఇప్పుడే కొనుగోలు చేయండి..తర్వాత చెల్లించండి.. దీన్నే బై నౌ పే లేటర్‌ (BNPL) అని పిలుస్తారు. కొనుగోలు చేసిన వస్తువు/సేవకు వెంటనే చెల్లించాల్సిన అవసరం లేకుండా కొనుగోలు చేసే చెల్లింపు ఎంపిక. తిరిగి చెల్లించడానికి 90 రోజుల వరకు వడ్డీ లేని కాలవ్యవధి ఉంటుంది. ఇలాంటి (BNPL) పథకాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇలాంటి రుణాలు ఎవరికైనా శక్తికి మించి ఖర్చు చేయడాన్ని ప్రోత్సహిస్తాయి. రుణ ఉచ్చులో ఇరుక్కోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి, పెద్ద కొనుగోళ్లు చేసినప్పుడు ముందు పొదుపు చేసి తర్వాత ఖర్చు చేయడం మేలు.

పెట్టుబడులకు వద్దు ఆలస్యం

మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. మీ డబ్బు పెరగడానికి అంత ఎక్కువ సమయం ఉంటుంది. గరిష్ఠ ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. ఉదాహరణకు పదవీ విరమణకు మెరుగైన నిధిని ఆశించేవారు ముందుగా పెట్టుబడులు ప్రారంభించడం వల్ల సరిపడా పదవీ విరమణ నిధి పొందుతారు. స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్లు (ఈక్విటీ, డెట్‌) బాండ్లు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌, అంతర్జాతీయ ఫండ్లు వంటి వివిధ ఆస్తులపై పెట్టుబడులు పెట్టేటప్పుడు మార్కెట్‌ పోకడలు, నష్టాల గురించి నిరంతరం అవగాహన చేసుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా క్రమం తప్పకుండా సమీక్షించడం చాలా అవసరం.

బీమా

బీమా అనేది ఊహించని పరిస్థితుల నుంచి రక్షణ కల్పించి, ఎవరికైనా పూర్తి ఆర్థిక రక్షణ అందిస్తుంది. ఊహించని పరిస్థితుల్లో మీ కుటుంబాన్ని ఆర్థిక ప్రతికూలతల నుంచి రక్షించడానికి జీవిత బీమా (టర్మ్‌ బీమా), ఆరోగ్య బీమాను తీసుకోండి. తనపై ఆధారపడ్డ కుటుంబం ఉన్నప్పుడు పాలసీదారుడు వార్షిక ఆదాయానికి 10-15 రెట్లు టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలి. పెరుగుతున్న వైద్య ఖర్చులు చాలా కుటుంబాలను ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తున్నాయి. కుటుంబ సభ్యులందరూ కవర్‌ అయ్యేలా రైడర్స్‌తో కూడిన సమగ్ర ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్యాలు కవర్ అవుతాయి.

రుణాలు

ఏదో ఒక సమయంలో రుణం తీసుకోవడం సాధారణమైన విషయం అయినప్పటికీ.. ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి రుణం ప్రధాన అడ్డంకిగా ఉంటుంది. రుణాలు తీర్చేటప్పుడు ముందుగా క్రెడిట్‌ కార్డు బకాయిలు, వ్యక్తిగత రుణాలు వంటి అధిక-వడ్డీ రుణాలను క్లియర్‌ చేయడంపై దృష్టి పెట్టండి. అనవసరమైన ఖర్చులు, ఆడంబరాల కోసం కొత్త అప్పులు తీసుకోవడం సరైంది కాదు. రుణాలకు తగినంత నిధులను కేటాయించే బడ్జెట్‌ను రూపొందించుకుని దానికి కట్టుబడి ఉండండి.

పదవీ విరమణ నిధి

ప్రతి ఒక్కరూ పదవీ విరమణ తర్వాత గడిపే జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పదవీ విరమణకు త్వరగా పెట్టుబడిని ప్రారంభించిన వారు మెచ్యూరిటీ సమయానికి ఆర్థికంగా పటిష్ఠంగా ఉంటారు. పదవీ విరమణకు ఎంత నిధి కావాలో ఇక్కడ ఒక లెక్క ఉంది. ఉదాహరణకు మీ వార్షిక ఖర్చులు రూ.8 లక్షలయితే.. దానికి 30 రెట్లు, అంటే రూ.2.40 కోట్ల పదవీ విరమణ నిధిని సమకూర్చడం లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇంకా భారత ప్రభుత్వం పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఎన్‌పీఎస్‌ లాంటి పథకాలను అందిస్తోంది.

చివరిగా: మీరు ఆర్థిక ప్రణాళికను అమలు చేసేటప్పుడు నిర్దిష్ట ఆర్థిక వ్యూహాలపై సలహాలు అవసరమైతే తప్పక ఆర్థిక సలహాదారుడి సహాయం తీసుకోండి. దీనివల్ల ఆర్థిక ప్రణాళికలో ముందుకు ఎలా వెళ్లాలో మేలైన సలహాలు, సూచనలు పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని