Gold bond: గోల్డ్‌ బాండ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవీ..

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల సిరీస్‌ IV సబ్‌స్క్రిప్షన్‌ నేటినుంచి ప్రారంభమయి, మార్చి 10తో ముగుస్తుంది.

Published : 06 Mar 2023 17:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ 2022-23 (సిరీస్‌ IV) సబ్‌స్క్రిప్షన్‌ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీతో సబ్‌స్క్రిప్షన్‌ ముగుస్తుంది. సెటిల్‌మెంట్‌ తేదీ మార్చి 14. ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం.. గత 7 సంవత్సరాల్లో SGB ధర దాదాపు 109% పెరిగింది. నవంబర్‌ 2015లో సబ్‌స్క్రైబర్‌లకు అందించిన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ ధర రూ.2,684. ఇప్పుడు గ్రాము బంగారం ధర ప్రకారం తాజా SGB ఇష్యూ ధర రూ.5,611. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని డిజిటల్‌ మోడ్‌లో చెల్లింపులు చేస్తే గ్రాముపై రూ.50 వరకు తగ్గింపు పొందొచ్చు. ఈ ఆన్‌లైన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ధర గ్రాము బంగారంపై రూ.5,561గా ఉంటుంది.

దరఖాస్తు ఎలా? షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా SGB కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను నివాసితులు, ట్రస్ట్‌లు, హెచ్‌యూఎఫ్‌లు, స్వచ్ఛంద సంస్థలు సబ్‌స్క్రైబ్‌ చేయవచ్చు. దీన్ని మైనర్‌ పిల్లల తరఫున ఒక వ్యక్తి లేదా ఇతర వ్యక్తులతో జాయింట్‌గా కూడా సభ్యత్వాన్ని పొందొచ్చు.

SGBపై వడ్డీ: దీనిపై వడ్డీ ఇష్యూ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. బాండ్‌ నామమాత్రపు విలువపై సంవత్సరానికి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. బాండ్ల కాలవ్యవధి 8 ఏళ్లు.

పన్ను ప్రయోజనం: బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే మూలధన లాభాలపై SGB పన్ను మినహాయింపునందిస్తుంది. బాండ్‌ బదిలీపై ఒక వ్యక్తికి వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాల కోసం ఇండెక్సేషన్‌ ప్రయోజనం కూడా అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని