Mutual Funds: సరైన మ్యూచువల్‌ ఫండ్‌ ఎంపిక కోసం 6 టిప్స్‌!

Mutual Funds: మన లక్ష్యాలకు అనుగుణంగా మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలి. అలాగే పన్నులు, ఎక్స్‌పెన్స్‌ రేషియో సహా మరికొన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

Updated : 06 Mar 2023 12:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతిఒక్కరూ తమ పెట్టుబడులు వేగంగా వృద్ధి చెంది మంచి రాబడి రావాలని ఆశిస్తారు. ఈ క్రమంలో మంచి మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds)లో మదుపు చేయాలని భావిస్తారు. మరి మన లక్ష్యానికి అనుగుణంగా ప్రతిఫలం ఇచ్చే మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds)ను ఎంపిక చేసుకోవడం ఎలా? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? చూద్దాం..

వాస్తవానికి మంచి మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds) అంటూ ఏమీ ఉండదు. ఈరోజు మంచి ప్రతిఫలం ఇచ్చే ఫండ్‌ సంవత్సరం తర్వాత నిరాశపర్చొచ్చు. ఒకప్పుడు నష్టాల్ని మిగిల్చినది ఇప్పుడు లాభాల పంట పండిస్తుండొచ్చు. పైగా ఒకరి లక్ష్యానికి సరిపోయిన ఫండ్‌.. మరొకరికి కావాల్సిన రాబడిని ఇవ్వకపోవచ్చు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ అంటూ ఏమీ ఉండవు. ఈ నేపథ్యంలో ఎంఎఫ్‌లో మదుపు చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు అసలు మీ లక్ష్యం ఏంటనేది స్పష్టత ఉండాలి.

మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది?

పిల్లల చదువులు, వారి పెళ్లి, రిటైర్‌మెంట్‌.. ఇలా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని తొలుత నిర్ణయించుకోవాలి. తర్వాత దానికి ఎంత మొత్తం అవసరమవుతుందో అంచనా వేసుకోవాలి. అంత మొత్తంలో రాబడి రావాలంటే ఎలాంటి ఫండ్‌ను ఎంచుకోవాలో శోధించాలి. అలాగే ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తారో కూడా నిర్ణయించుకోవాలి. అలాగే నష్టభయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఉదాహరణకు కేవలం సంత్సరం నుంచి రెండేళ్ల వరకు మాత్రమే ఇన్వెస్ట్‌ చేయగలమనుకుంటే.. డెట్‌ ఫండ్లు అనువుగా ఉంటాయని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం స్మాల్‌, మిడ్‌ క్యాప్ ఫండ్లను ఎంచుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కనీసం ఏడేళ్ల పాటు నిరాటంకంగా మదుపు చేయగలమనుకుంటే మాత్రమే స్మాల్‌, మిడ్‌ క్యాప్ ఫండ్లను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అదే మూడు నుంచి ఐదేళ్ల వరకు మదుపు చేయగలమనుకుంటే హైబ్రిడ్‌ ఫండ్లను ఆశ్రయించవచ్చు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఎంఎఫ్‌లలో మదుపు చేయాలనుకుంటే మాత్రమే ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్ల (Mutual Funds)ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా లక్ష్యానికి అనుగుణంగా ఏ మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds) కేటగిరీ సరిపోతుందో నిర్ణయించుకోవాలి. తిరిగి ఆ కేటగిరీలో ఏ ఫండ్‌ను ఎంపిక చేసుకోవాలో చూడాల్సి ఉంటుంది. దానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఫండ్‌ గత చరిత్ర..

మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds)ను ఎంపిక చేసుకునే సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లో ఇదొకటి. అయితే, ముందు చెప్పినట్లుగా ఫండ్‌ చరిత్ర భవిష్యత్‌ పనితీరును నిర్ణయించకపోవచ్చు. కానీ, ఒక అవగాహనకు రావడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. డౌన్‌సైడ్‌ ప్రొటెక్షన్‌ ఎంత వరకు ఉందో తెలుసుకోవచ్చు.

స్థిరత్వం..

ప్రస్తుతం ఒక ఫండ్‌ మంచి ప్రతిఫలాన్ని ఇస్తున్నప్పటికీ.. గతంలో అది తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొని ఉండొచ్చు. ఇలా ఫండ్‌ పనితీరులో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అస్థిరత ఎక్కువగా ఉన్న ఫండ్లను ఎంపిక చేసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.

ఫండ్‌ మేనేజర్‌ పనితీరు..

ఒకవేళ ఫండ్‌ మేనేజర్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నారనుకుందాం. అలాంటప్పుడు ఆ మేనేజర్‌ గత పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. పెద్దగా లాభదాయక రాబడినివ్వని మేనేజర్లకు దూరంగా ఉండడమే మేలు.

నిర్వహణలోని ఆస్తుల మొత్తం..

ఒక మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌ నిర్వహణలోని ఆస్తుల మొత్తాన్ని (AUM) కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇది స్కీమ్‌ను ఎంతమంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారో సూచిస్తుంది. ఈక్విటీ ఫండ్లలో ముఖ్యంగా స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో ఏయూఎం ఎక్కువగా ఉంటే ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలి, వేటి నుంచి నిష్క్రమించాలో నిర్ణయించుకోవడం ఫండ్‌ సంస్థలకు క్లిష్టంగా మారుతుంది. అదే లిక్విడ్‌, షార్ట్‌టర్మ్ డెట్‌ ఫండ్లలో అయితే ఏయూఎం ఎక్కువగా ఉంటే రీడెమ్షన్స్‌ రిస్క్‌ ఉండదు.

ఎక్స్‌పెన్స్‌ రేషియో..

మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణ సంస్థ (ASM)లు ఫండ్‌ నిర్వహణ, ప్రమోషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ వంటి వాటికి తీసుకునే ఫీజునే ఎక్స్‌పెన్స్‌ రేషియోగా వ్యవహరిస్తారు. ఒక ఫండ్‌ను రన్‌ చేసేందుకు అయ్యే ఖర్చు మొత్తం దీంట్లోనే మిళితమై ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్స్‌పెన్స్‌ రేషియో తక్కువగా ఉండే ఎంఎఫ్‌ స్కీమ్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

పన్నులు..

మనం చేసే ప్రతి పెట్టుబడిపై వచ్చే లాభం ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయి. అలాగే మ్యూచువల్‌ ఫండ్లపై వచ్చే లాభాలపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్లయితే, ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేశామో.. దాని ఆధారంగా దీర్ఘకాల మూల ధన లాభాల పన్ను, స్వల్పకాల మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. డెట్‌ ఫండ్లలో క్యాపిటల్‌ గెయిన్స్‌పై ఇండెక్సేషన్‌ ప్రయోజనం ఉంటుంది.

వీటన్నింటి ఆధారంగా పక్కాగా ఒక మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంపిక చేసుకొని మదుపు చేయడం ప్రారంభిస్తే సరిపోదు. దాని పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. అవసరమైతే.. ఫండ్‌ నుంచి నిష్క్రమించి మరో దానికి మారాలి. అలాగే మీ ఇన్వెస్ట్‌మెంట్‌ పోర్ట్‌ఫోలియోకు అనుగుణంగానూ మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులను బ్యాలెన్స్‌ చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు