TDS on salary: కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!

Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్‌ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది.

Published : 15 Apr 2024 12:28 IST

Income tax | ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. మునుపటి ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి రిటర్నులు ఫైల్‌ చేయడమే కాదు.. ప్రస్తుత ఏడాదిలో పన్ను భారం పడకుండా చూసుకోవడమూ పన్ను చెల్లింపుదారుల ముందున్న బాధ్యత. ఒకప్పుడు ఏప్రిల్‌ నెల వచ్చిదంటే ఆదాయపు పన్ను (Income tax) మినహాయింపుల గురించి మాత్రమే ట్యాక్స్‌పేయర్లు ఆలోచించేవారు. రెండు రకాల పన్ను విధానాలు ఉన్న నేపథ్యంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి అందులో ఏది ఎంచుకోవాలనేది ఇప్పుడు ముఖ్యమే. ఎందుకంటే ఈ విషయాన్ని పనిచేస్తున్న యాజమాన్యానికి తెలియజేయాల్సి ఉంటుంది. మీరు ఎంచుకునే పన్ను విధానం బట్టే వేతనంలో మూలం వద్ద కోత (TDS) విధిస్తారు. పన్ను విధానం ఎంచుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా ఉంటుంది. ఏ పన్ను విధానమో ఉద్యోగి వెల్లడించనప్పుడు కొత్త పన్ను విధానమే అమలవుతుంది. దాన్ని బట్టే టీడీఎస్‌ (TDS) వర్తిస్తుంది. ఒకవేళ ఉద్యోగులు మినహాయింపులు చూపించాలనుకున్నప్పడు యజమానికి ఆ విషయం వెల్లడించాల్సి ఉంటుంది. అందుకోసం పన్ను ఆదా పథకాలను ఎంచుకోవాలి. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఆ పెట్టుబడులను ప్రారంభిస్తే.. మూలం వద్ద పన్ను కోతలను తగ్గించుకోవచ్చు. అదే కొత్త పన్ను విధానం ఎంచుకుంటే ఎలాంటి పన్ను మినహాయింపులూ వర్తించవు. కాబట్టి దానికి పెద్దగా ప్రణాళికలు అవసరం లేదు.

కొత్త పన్ను విధానం

  • కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ప్రాథమికంగా ఎలాంటి పన్నూ ఉండదు.
  • వేతనం ద్వారా పొందే ఆదాయంలో రూ.50 వేల వరకు ప్రామాణిక తగ్గింపు ఉంటుంది.
  • ఒకవేళ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.7 లక్షల్లోపు ఉంటే ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

పాత పన్ను విధానం

  • ఈ పన్ను విధానంలో ప్రాథమికంగా రూ.2.5 లక్షల వరకు ఎలాంటి పన్నూ వర్తించదు.
  • వేతనం ద్వారా వచ్చే ఆదాయంపై రూ.50వేలు ప్రామాణిక తగ్గింపు వర్తిస్తుంది.
  • సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయిపులు పొందొచ్చు. సెక్షన్‌ 80డీ (ఆరోగ్య బీమా), సెక్షన్‌ 80సీసీడీ (NPS) లాంటి మినహాయింపులు కూడా ఉంటాయి.
  • పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.5 లక్షలు మించకుంటే ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఏది ఎంచుకోవాలి?

కొత్త, పాత పన్ను విధానం ఎంచుకునేటప్పుడు.. వేతన జీవులు తమ ఆదాయాన్ని ముందుగానే లెక్కలు వేసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుందో ముందే లెక్కలు వేసుకోవాలి. అందులో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణించాలి. అప్పుడు ట్యాక్స్‌ శ్లాబుల ఆధారంగా ఏ విధానంలో ఎంత పన్ను వర్తిస్తుందో లెక్కించాలి. దాని ఆధారంగా పన్ను విధానంపై నిర్ణయం తీసుకోండి. ఒకవేళ ఆదాయపు పన్ను గురించి అవగాహన లేనివారు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే ట్యాక్స్‌ కాలిక్యులేటర్లను వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఎంచుకోకపోయినా రిటర్నుల ఫైలింగ్‌ సమయంలో మీకు నచ్చిన పన్ను విధానం ఎంచుకోవచ్చు. నిర్దేశిత గడువులోగా రిటర్నులు దాఖలు చేసిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని