Property: తెలుసుకుంటే.. ఆస్తి మీ వెంటే!

ఏ ఆస్తి అయినా కొనే ముందు మనం చూడాల్సిన మొట్ట మొదటి విషయం ఏంటంటే అమ్మే వారికి ఉన్న హక్కులు ఏంటని. ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 11 Jun 2024 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిజిస్ట్రేషన్.. ఈ పదం మీద ఉన్న నమ్మకం అంత ఇంతా కాదు. స్టాంపు కాగితాల మీద రాసిన దస్తావేజును రిజిష్టరు చేస్తే చాలు, ఇక ఆస్తి మీద సర్వ హక్కులూ వచ్చినట్టు భావిస్తారు. దీనికి ఉన్న విలువ అలాంటిది. ప్రభుత్వానికి కూడా కాసుల వర్షం కురిపించే శక్తి దీనిది. నిజంగానే దీనికి తిరుగు లేదా? ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదా?

ఆస్తి కొనడం, దాన్ని మన పేరు మీదకి మార్పించుకోవడం. చూడ్డానికి ఇది చాలా తేలికైన వ్యవహారంగానే అనిపిస్తుంది. చిక్కులు వచ్చినప్పుడు కానీ తెలీదు అందులోని లోటుపాట్లు. మీకు రిజిస్టర్ అయిన స్థలం మళ్లీ వేరొకరికి రిజిస్ట్రేషన్ జరగవచ్చు లేదా కబ్జా కావచ్చు. ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు దావా వేయవచ్చు. అప్పుడు వ్యవస్థను నిందించి లాభం లేదు. ఇలాంటి ఇబ్బందులు రాకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నామా అని ఆలోచించాలి. కొనాలని నిర్ణయం తీసుకోగానే స్థలం/ఫ్లాట్ ధర గురించి తప్ప అమ్మే వారి హక్కుల గురించి శ్రద్ధ పెట్టారు చాలా మంది. అధిక ధర పెట్టినంత మాత్రాన మంచి వస్తువు లభిస్తుందని కచ్చితంగా చెప్పలేం. తక్కువ ధరకు మాత్రం మంచి సరుకు రాదని చెప్పవచ్చు. స్థిరాస్తి విషయంలో కూడా అంతే. ఆ ప్రదేశంలో వాస్తవంగా ఉన్న దాని కంటే తక్కువ ధరకే ఇస్తామని ఎవరైనా అంటే కొంచెం అనుమానించాల్సిందే. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే.  

అమ్మే హక్కు ఉందా?

ఏ ఆస్తి అయినా కొనే ముందు మనం చూడాల్సిన మొట్ట మొదటి విషయం ఏంటంటే అమ్మే వారికి ఉన్న హక్కులు ఏంటని.. అసలు వారికి ఆ ఆస్తి ఎలా వచ్చింది అని. వారసత్వం అయితే.. వారసులు అందరూ సంతకాలు పెడుతున్నారా?మైనర్లుంటే కోర్టు అనుమతి తీసుకున్నారా?తండ్రి లేదా సంరక్షకుడు తన అధికార పరిధిలోనే వ్యవహరిస్తున్నారా? ఇతర హామీలు ఏమైనా ఇస్తారా? అసలు యజమాని నుంచి యాజమాన్య హక్కులు సరిగ్గానే సంక్రమించాయా? రిజిస్టరు దస్తావేజులు సరైనవేనా? అసలు పత్రాలు ఉన్నాయా, ఎక్కడైనా తనఖా పెట్టారా?ఆస్తి ఇంతకు ముందే అమ్మరా? ప్రభుత్వం/ప్రభుత్వ సంస్థల ఆసక్తి ఏమైనా ఉందా? దావా తగాదాలేమైనా ఉన్నాయా? ఇళ్ల స్థలాలకు, నిర్మాణాలకు సరైన అనుమతులు ఉన్నాయా?స్వాధీనంలో ఎవరు ఉన్నారు? ఇలాంటి అనేక విషయాలు వాకబు చేయాల్సిందే. సంబంధింత పత్రాలను ఎలాంటి మొహమాటం లేకుండా అడగండి. వాటిని అనుభవజ్ఞులైన న్యాయవాదులకు చూపించి సలహా పొందండి. ఆపైన పత్రాన్ని సరైన విధంగా రాయించుకోవాలి. 

సమస్యలేం ఉండవా?

అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. కాబట్టి, ఇక సమస్యలేం రావని కచ్చితంగా ఉండడానికి వీలు లేదు. కాకపోతే ప్రమాద అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరివన్నీ చేస్తే చట్టం మీకు అదనపు రక్షణ కల్పిస్తుంది. అంటే..మిమ్మల్ని సొమ్ము చెల్లించి, నిజాయతీగా ఆస్తి పొందిన వ్యక్తిగా పరిగణిస్తుంది. అప్పుడే మీకు కొన్ని ప్రత్యేక హక్కులు వస్తాయి.

అది ఎప్పుడంటే...?

  • మీరు ప్రతిఫలం ఇచ్చి ఆస్తి పొందిన వారు అయి ఉండాలి. 
  • ఆస్తిపై ఇతరులకున్న హక్కులు తెలిసి ఉండకూడదు. 

ఈ రెండింటిలో ఏది మీకు వర్తించకపోయినా మీరు సదుద్దేశంతో ఆస్తి కొన్న వారు కాదని అర్థం. తెలిసి ఉండటం అంటే నోటీసు కలిగి ఉండటం అని. చట్టం దీన్ని చాలా స్పష్టంగా, విపులంగా విశదీకరించింది. మనకున్న హక్కుల్ని విస్మరించి ఎవరైనా మన ఆస్తి అమ్మాలని కానీ ఇతరులకు బదిలీ చేయాలనీ ప్రయత్నిస్తే.. కొనేవాళ్లకు నేరుగా గానీ, పత్రికా ముఖంగా  గానీ తెలియజేస్తాం. ఒక ఆస్తిని మనం కొనాలనుకున్నా పత్రికా ముఖంగా ప్రకటన ఇస్తాం. ఇవన్నీ మనం సదుద్దేశాన్ని చూపించే చర్యలు. మన హక్కుల్ని చెప్పినా లెక్క చేయకుండా కొన్నాడనుకోండి, మనం చేపట్టే చర్యలకు అతడు బద్ధుడే. అమాయకపు నటన సాధ్యం కాదు. కోర్టు తుది ఉత్తర్వు (డిక్రీ)లకు లోబడే అన్ని లావాదేవీలు ఉంటాయని గమనించాలి.    

వాదిస్తే ఫలితం లేదు

ఎదురుగా ఉన్నదాన్ని తెలియదని బుకాయిస్తే చట్టం ఒప్పుకోదు. కొన్ని సందర్భాల్లో వాస్తవంగా తెలియకపోయినా తెలియదని వాదించడం సాధ్యం కాదు. అదెలా అంటే...

కావాలని వాకబు చేయకపోవడం
స్థిరాస్తికి సంబంధించిన వివరాలని సేకరించాలి. రిజిస్టరు దస్తావేజుల గురించి రెవిన్యూ రికార్డులు పరిశీలించాలి. అసలు దస్తావేజు ఏమైందో కనుక్కోవాలి. అది మీ బాధ్యత. తెలుసుకోకపోయినా మీకు తెలిసినట్టే చట్టం భావిస్తుంది. మీకు వచ్చిన రిజిస్టరు కవర్ మీరు తీసుకోకుండా తిరిగి పంపించినా, అందులోని విషయాలు మీకు తెలిసినట్టే. తప్పించుకుంటే తప్పే వ్యవహారం కాదు.

నిర్లక్ష్యం
మీకు అనుమానం రావాల్సిన సందర్భాల్లో విస్మరించడం. అంటే మీరు చూసిన దస్తావేజుల్లో కోర్టు సీలు ఉందనుకోండి.. అది ఎందుకు వచ్చిందో, ఆ దావా సంగతులేంటో, ఉత్తర్వులు ఏంటో దరిమిలా ఆ హక్కులు ఏంటో తెలుసుకోవాలి. నాకు తెలీదు అంటే కుదరదు. 

రిజిస్టరు దస్తావేజులు
రిజిస్టరు అయి, ఇండెక్సు పుస్తకాల్లో పొందుపర్చిన అంశాల గురించి ప్రతి వ్యక్తి తెలుసుకున్నట్టే చట్టం భావిస్తుంది. అందుకే రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చే మొక్కుబడి పుస్తకాల మీద ఆధార పడొద్దు. ఇండెక్స్ పుస్తకాల్ని పరిశీలించండి. 

స్వాధీనం 
స్వాధీనంలో ఉన్న వ్యక్తి హక్కుల్ని తెలుసుకోవాలి. అలాంటి వ్యక్తులకు యాజమాన్య హక్కుల పురోభావన ఉంటుంది. అందుకే, ఎవరు స్వాధీనంలో ఉన్నా వారి హక్కుల గురించి విచారణ చేయాల్సి ఉంటుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని