Restaurant: రెస్టరంట్‌లో డబ్బు ఆదా చేయడానికి చిట్కాలు

ఎప్పుడైనా కుటుంబంతో కలిసి రెస్టరంట్‌కు వెళ్లాలనుకునేవారు బిల్లుపై తగ్గింపు పొందాలనుకుంటారు. అలాంటి వారికోసమే కొన్ని చిట్కాలు.

Published : 04 Apr 2024 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పటితో పోలిస్తే రెస్టరంట్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వారంలో ఒకట్రెండు సార్లు కుటుంబంతో కలిసి బయట తినేవారూ ఉంటున్నారు. అదే సమయంలో రెస్టరంట్ల వ్యాపారమూ పెరిగింది. అయితే, ఇంటి భోజనంతో పోలిస్తే.. బయట ఖర్చు ఎక్కువ అవుతుంది. అది ఆర్థిక భారం కాకూడదు. అందుచేత తరచూ బయట తినేవారు, అప్పడప్పుడూ రెస్టరంట్లలో వెళ్లేవారు కొన్ని చిట్కాలు పాటిస్తే ఆ ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంది.

రద్దీ లేని సమయాలు

సాధారణంగా వారం మధ్యలో రెస్టరంట్లలో రద్దీ తక్కువ ఉంటుంది. వ్యాపారులు ఆయా రోజుల్లో ఆహార పదార్థాలు, పానీయాల ధరలపై రాయితీ ఇస్తారు. సాయంత్రం 7 గంటలకు ముందు కూడా కొన్ని పేరున్న హోటల్స్‌ కూడా హ్యాపీ అవర్స్‌ కింద పరిగణించి ధరల్లో రాయితీని ప్రకటిస్తాయి. వినియోగదారులు ఈ విధమైన రద్దీలేని రోజులను, సమయాలను ఉపయోగించుకుని బిల్లులో రాయితీని పొందొచ్చు. డిన్నర్‌తో పోలిస్తే లంచ్‌ మెనూలు తక్కువ ధరలను కలిగి ఉంటాయి. అందుచేత డబ్బు ఆదా చేసుకోవడానికి వీలున్నంతవరకు మధ్యాహ్న భోజనాన్ని ఎంచుకోండి. ముఖ్యంగా ఫ్రెండ్‌షిప్‌ డే, వాలెంటైన్స్‌ డే రోజున రెస్టరంట్స్‌కు వెళ్లకపోవడమే మంచిది. ఆయా రోజుల్లో ఆహార, పానీయ ఛార్జీలు ఎక్కువ ఉండడమే కాకుండా, విపరీతమైన రద్దీ కారణంగా ఎక్కువ సమయం నిరీక్షించవలసి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక రోజుల్లో ఆహారం నాణ్యత సరిగ్గా ఉండకపోవచ్చు.

ముందే ప్లాన్‌

రెస్టరంట్‌కు వెళ్లే ముందే.. మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై ముందుగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. దీనివల్ల మీ ఆహార ఖర్చు ఎంత అవుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. దీనివల్ల అనవసర ఖర్చును నిరోధించడమే కాకుండా తినే ఆహారంపై అదుపు కూడా ఉంటుంది. అందువల్ల వంటకాలు, పానీయలను జాగ్రత్తగా ఎంచుకోవడం ద్వారా ముందుగా అనుకున్న బడ్జెట్‌కు కట్టుబడి ఉండొచ్చు. అంతేకాకుండా కొన్ని రెస్టరంట్స్‌లో కొన్ని వంటకాలు ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అలాంటి వాటి కోసం యాప్స్‌, వెబ్‌సైట్స్‌ లేదా స్నేహితుల వద్ద సమాచారాన్ని పొందడం మంచిది. దీనివల్ల నచ్చిన, రుచి కలిగిన ప్రత్యేక వంటకాలను సరైన ధరలో ఆరగించే అవకాశం ఉంటుంది.

క్రెడిట్‌ కార్డులు

కొన్ని క్రెడిట్‌ కార్డులు భాగస్వామ్య రెస్టరంట్లలో ప్రత్యేకమైన డైనింగ్‌ డీల్స్‌, డిస్కౌంట్స్‌ లేదా ప్రత్యేక ప్రమోషన్స్‌ యాక్సెస్‌ను అందిస్తాయి. ఆయా రెస్టరంట్స్‌ మీ క్రెడిట్‌ కార్డు సంస్థతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. ఈ ఆఫర్లలో తరచుగా కొనుగోలుపై.. వన్‌ గెట్‌ - వన్‌ ఫ్రీ డీల్స్‌, కాంప్లిమెంటరీ డిష్‌లు లేదా తగ్గింపు సెట్‌ మెనూలు ఉంటాయి. వీటిద్వారా తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని పొందడానికి మీకు అనుమతి ఉంటుంది. రివార్డ్స్‌ను అందించే క్రెడిట్‌ కార్డులను ఉపయోగించడం ద్వారా కూడా వినియోగదారులు డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఆర్డర్‌ ఉమ్మడిగా

ఒక కుటుంబం మొత్తం లేదా స్నేహితులు కలిసి రెస్టరంట్‌కు వెళ్లినప్పుడు.. వ్యక్తిగతంగా ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేయడానికి బదులుగా ఉమ్మడిగా అందరూ కలిసి ఒకే జంబో ఫ్యామిలీ ప్యాక్‌ను ఆర్డర్‌ చేయడం మేలు. దీనివల్ల ఆహార ధర మీ భాగానికి తక్కువ పడడమే కాకుండా, ఆహార వృథా లేకుండా ఉంటుంది. ఒకే పదార్థాన్ని కాకుండా 2,3 రకాల వంటకాలను ఈ పద్ధతిలో ఆర్డర్‌ చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ రకాలు ఆరగించినట్లు ఉంటుంది. ధరలపై కూడా తగ్గింపులు ఉంటాయి.

ఆఫర్లు

వినియోగదారులు.. కొన్ని రెస్టారంట్స్‌, సూపర్‌ మార్కెట్లకు వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది సేల్స్‌ ప్రమోషన్‌ చేసే వ్యక్తులు.. కొన్ని ఫామ్స్‌ ఇచ్చి పూరించమని అడుగుతారు. రెస్టరంట్ల నుంచి వచ్చిన ప్రతినిధులు అయితే, వినియోగదారుల పెళ్లి రోజు, కుటుంబ సభ్యుల పుట్టిన రోజు వివరాలను తీసుకుంటారు. తర్వాత, ఆ ప్రత్యేక రోజుల్లో ఆయా కుటుంబాలను రెస్టరంట్లకు ఆహ్వానించి రాయితీ ధరలకు ఆహార, పానీయాలను అందిస్తారు. ఇటువంటి ఆఫర్లు ఉన్నప్పుడు ఆయా కుటుంబాల వారు తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల, మీ ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్‌ చేసుకున్నట్లు ఉండడమే కాకుండా, రాయితీ ధరల్లో విందును ఆరగించొచ్చు. కొన్ని రెస్టరంట్లు ప్రత్యేకమైన వినియోగదారుల కోసం ధరలపై తగ్గింపులను అందిస్తాయి. కాబట్టి, మీరు రెగ్యులర్‌ కస్టమర్‌ అయితే లేదా ఒక ఏదైనా నిర్దేశిత రోజులో రెస్టరంట్‌లో ప్రత్యేక డీల్‌ నడుస్తున్నట్లయితే మీ బిల్లుపై ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా, రెస్టరంట్స్‌ లేదా ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ (Zomato, Swiggy) అందించే కూపన్స్‌, వోచర్స్‌, లాయల్టీ ప్రోగ్రామ్‌ల ప్రయోజనాన్ని పొందండి. ఇవి మీ ఆహార ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి. ఫైన్‌ డైనింగ్‌ రెస్టారెంట్స్‌ కోసం డైనింగ్‌ డీల్స్‌, డిస్కౌంట్‌ వోచర్లను అందించే అనేక వెబ్‌సైట్స్‌ ఉన్నాయి. ఇది పూర్తిగా రెస్టరంట్లతో వారు కలిగి ఉన్న భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. చాలా రెస్టరంట్లు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి, వివిధ డిస్కౌంట్లను ఇవ్వడం ద్వారా వినియోగదారులను ఆకర్షించడానికి ఆన్‌లైన్‌ ప్రమోషన్స్‌ చేస్తాయి. కాబట్టి, మీరు రెస్టరంట్‌కు వెళ్లే ముందు ఏదైనా ప్రత్యేక డీల్స్‌, ఆఫర్స్‌, ప్యాకేజీల కోసం ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం కూడా మంచిదే. EazyDiner, Swiggy's DineOut వంటి డైనింగ్‌ యాప్స్‌ టేబుల్స్‌ రిజర్వ్‌ చేయడానికి, డిస్కౌంట్స్‌ పొందేందుకు అనుమతిస్తాయి. ఈ ఫుడ్‌ సేవింగ్‌ యాప్స్‌ను ఉపయోగించడం ద్వారా, యాప్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేక ఆఫర్స్‌, డిస్కౌంట్స్‌, ప్రత్యేకమైన డీల్స్‌ను పొందొచ్చు.

గమనించాల్సినవి

చాలా వరకు రెస్టరంట్లు కొన్ని రకాల వంటకాలకు ప్రసిద్ధి. ఈ ఆహార పదార్థాల కోసమే వినియోగదారులు తరచూ అక్కడికి వెళుతుంటారు. అయితే, ఖర్చులు తగ్గించుకోవాలని భావించేవారు కేవలం అక్కడ లభించే ప్రత్యేక వంటకాలను ఆరగించడమే మంచిది. శీతల పానీయాలు, ప్యాకింగ్‌ వాటర్‌ బాటిల్స్‌ను తీసుకోకపోవడమే మేలు. వీటిపై పన్నులు అదనంగా ఉండడం వల్ల ఖరీదు ఎక్కువ ఉంటాయి. ప్రతి రెస్టరంట్లలోనూ ఆర్‌ఓ వాటర్‌ ఉచితంగా లభిస్తుంది. శీతల పానీయాలు కూడా సరసమైన ధరల్లో బయట ప్రతిచోటా లభ్యమవుతాయి. కాబట్టి రెస్టరంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ లభించే ప్రత్యేకమైన వంటకాల పైన మాత్రమే దృష్టి పెట్టడం మేలు. చివరిగా సర్వర్‌ బిల్లు ఇచ్చినప్పుడు కూడా మీరు తీసుకున్న ఐటమ్స్‌కే బిల్లు ఉందని నిర్ధరించుకోండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని