పదవీ విరమణ ప్రణాళిక...వద్దు ఈ పొరపాట్లు..

కాలం ఎవరికోసం వేచి చూడదు. మన జీవితంలోని ఎన్నో దశల మాదిరిగానే విశ్రాంత జీవితమూ ఒక అంకం. దీన్ని ఆనందమయం చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంటుంది

Updated : 31 Mar 2023 02:43 IST

పదవీ విరమణ.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దొరికే విశ్రాంతి సమయం.. కొంతమంది అప్పటికే ఆర్థికంగా స్థిరత్వం సాధించి ఉంటారు. మరికొందరు ఇంకా సంపాదించాల్సిన అవసరం ఉంటుంది. మలి జీవితంలోకి ప్రవేశించే దశలో కొన్ని పొరపాట్లకు ఏమాత్రం తావీయకూడదు. అవేమిటో చూద్దాం..

కాలం ఎవరికోసం వేచి చూడదు. మన జీవితంలోని ఎన్నో దశల మాదిరిగానే విశ్రాంత జీవితమూ ఒక అంకం. దీన్ని ఆనందమయం చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంటుంది. ముందునుంచే సిద్ధంగా ఉన్నవారికి ఇది పెద్ద సమస్యేమీ కాదు. ఒక సంవత్సరం ఆలస్యం చేసినా.. పదవీ విరమణ నిధిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పదవీ విరమణ చేసిన తర్వాత చూద్దాం అనే ధోరణీ పనికిరాదు. సాధ్యమైనంత తొందరగా పదవీ విరమణ ప్రణాళికను ప్రారంభించడం మంచిది.

తక్కువ అంచనా వేయడం..

పదవీ విరమణ కోసం ప్రణాళికలు వేసుకునేటప్పుడు చాలామంది ఖర్చులను తక్కువగా అంచనా వేస్తుంటారు. మీరు విశ్రాంత జీవితాన్ని ఏ విధంగా గడపాలనుకుంటున్నారు అన్నదాని ఆధారంగా వ్యయాలను గణించాలి. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లాంటివి పెరిగే అవకాశం ఉంది. వీటిన్నింటినీ లెక్కలోకి తీసుకోవాల్సిందే. మీ పదవీ విరమణ అంచనాలను క్రమం తప్పకుండా సమీక్షించడం, వాటిని అవసరమైన విధంగా పెట్టుబడులను సర్దుబాటు చేయడం చాలా ముఖ్యం. చాలామంది పదవీ విరమణ అంటే తమ ఒక్కరి అవసరాలే అనుకుంటారు. జీవిత భాగస్వామి అవసరాలు, ఖర్చులనూ లెక్కలోకి తీసుకున్నప్పుడే సరైన ప్రణాళిక అవుతుంది.

సమీక్షించుకోకపోవడం..

ప్రతి పెట్టుబడి పథకాన్నీ తప్పనిసరిగా ఏడాదికోసారైనా సమీక్షించుకోవాలి. ఒకే తరహా పెట్టుబడి పథకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మదుపు చేయొద్దు. సురక్షిత పెట్టుబడి పథకాలకు తోడుగా.. కొంత అధిక రాబడినిచ్చే వాటిని జత చేయాలి. పదవీ విరమణ తర్వాత క్రమానుగతంగా ఆదాయం అందుకునేందుకు ఎంచుకునే పథకాలూ భిన్నంగానే ఉండాలి. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం, డెట్‌ ఫండ్ల నుంచి క్రమానుగతంగా వెనక్కి తీసుకోవడంలాంటివి పరిశీలించాలి.

ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకపోవడం..  

మన డబ్బు విలువను హరించేది ద్రవ్యోల్బణం. ఈ రోజు మీ ఇంటి ఖర్చులు రూ.25,000 ఉంటే.. 8 శాతం ద్రవ్యోల్బణం అంచనాతో 20 ఏళ్ల తర్వాత రూ.1,16,524 అవసరం. కాబట్టి, పదవీ విరమణ పెట్టుబడులు ఇందుకు అనుగుణంగానే ఉండాలి. పదవీ విరమణ తర్వాతా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుంది. అందువల్ల దానికి తగ్గట్టుగా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. పెరిగిన వైద్య పరిజ్ఞానం వల్ల 100 ఏళ్ల వరకూ జీవిస్తామనే అంచనాతో ఖర్చుల లెక్కలు వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ దశలోనూ ద్రవ్యోల్బణాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. పెట్టుబడులు పెట్టేటప్పుడు దీనికి మించి రాబడినిచ్చే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

సురక్షిత పథకాలనే ఎంచుకుంటే..

చాలామంది తమ పదవీ విరమణ అవసరాల కోసం ఉద్యోగ భవిష్య నిధి, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లాంటి పథకాలను ఎంచుకుంటారు. ఎన్‌పీఎస్‌ మినహా ఇతర రెండు పథకాలూ పూర్తిగా సురక్షితం. కేవలం వీటి ద్వారానే పదవీ విరమణ నిధిని సమకూర్చుకోవడం సాధ్యం కాదు. గణనీయమైన మొత్తం సంపాదించాలంటే.. దీర్ఘకాలం పాటు కాస్త అధిక రాబడులు ఇచ్చే పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలాంటి వాటిని ఇందుకోసం పరిశీలించవచ్చు. యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు, సంప్రదాయ పాలసీలూ ఉంటాయి. బీమా అవసరాల కోసం వీటిని ఎంచుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. సాధ్యమైనంత వరకూ తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే పాలసీలను ఎంచుకోవాలి.

మధ్యలోనే తీసుకోవడం..

పదవీ విరమణ అనేది పని నుంచి విశ్రాంత జీవితంలోకి మారే దశ. ఇది సంపాదనకు ముగింపు, ఖర్చులకు ప్రారంభాన్నీ సూచిస్తుంది. సరైన ప్రణాళిక లేకపోతే.. మీ నిధి మధ్యలోనే నిండుకోవచ్చు. పదవీ విరమణ నిధి నుంచి సాధ్యమైనంత వరకూ డబ్బును తీయొద్దు. నిధిపై వచ్చిన రాబడితోనే ఖర్చులను వెళ్లదీయాలి. తప్పనిసరి అవసరం వచ్చినా 2-3 శాతానికి మించి వెనక్కి తీసుకోవద్దు. ఉపసంహరణలపై స్వీయ పరిమితి విధించుకోవాలి.

కొత్త అప్పులు...

పదవీ విరమణకు రెండేళ్ల ముందు నుంచే అప్పులు వదిలించుకోవాలి. కొత్త రుణాల జోలికి వెళ్లకూడదు. కొంతమంది 50 ఏళ్ల తర్వాత గృహరుణాలు తీసుకుంటారు. వడ్డీ రేట్లు పెరిగినప్పుడు వ్యవధి పెరుగుతుంది. దీంతో పదవీ విరమణ తర్వాతా ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. వ్యక్తిగత రుణాల్లాంటి వాటికీ దూరంగానే ఉండాలి. అప్పులు తీర్చేందుకు మీ పొదుపు మొత్తాన్ని వాడకూడదు.

ఆరోగ్య ఖర్చులనూ..

వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చుల అవసరం అధికంగా ఉంటుంది. కానీ, చాలామంది దీన్ని పట్టించుకోరు. అనుకోని అనారోగ్యం మీ మలి జీవితం నిధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత యాజమాన్యం అందించే బృంద బీమా సౌకర్యం వర్తించకపోవచ్చు. కాబట్టి, ఉద్యోగంలో ఉన్నప్పుడే సొంతంగా ఒక పాలసీని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా ఒక సీనియర్‌ సిటిజన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని