Shopping Tips: షాపింగ్‌ చేసేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి!

Shopping Tips: పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోళ్లపై డబ్బు ఆదా కోసం గుర్తుంచుకోవాల్సిన కొన్ని చిట్కాలు ఇవిగో.. 

Updated : 28 Feb 2024 10:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లిళ్ల సీజన్‌ మొదలైంది. ఈ వేడుకలకు కొనుగోళ్లు ఎక్కువే ఉంటాయి. వివాహాలు జరిపే కుటుంబాలే కాకుండా హాజరయ్యేవారూ షాపింగ్‌ చేయడం పరిపాటి. సీజన్‌ సమీపిస్తున్న కొద్దీ ఆకర్షణీయమైన తగ్గింపులు ఉంటాయి. చాలా మంది అత్యుత్తమ డీల్స్‌ను పొందేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో ఖర్చులను తెలివిగా ప్లాన్ చేయడం అవసరం. దాని కోసమే ఇవిగో కొన్ని చిట్కాలు..

బడ్జెట్‌..

షాపింగ్‌ చేసే ముందు బడ్జెట్‌ సెట్‌ చేసుకోండి. పెళ్లి షాపింగ్‌ ఒక్కటే ఖర్చు కాదు.. అనేక వ్యయాల మిళితం. ప్రతి ఖర్చులోను తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. షాపింగ్‌ ప్రారంభించే ముందు ఎంత ఖర్చు చేయగలరో నిర్ణయించుకోండి. వివిధ వ్యాపార సంస్థలు ఆఫర్లు ఇస్తుంటాయి. అలాగని బడ్జెట్‌ గురించి ఆలోచించకుండా ఖర్చు పెడితే ఇబ్బంది పడతారు. బడ్జెట్‌లో వచ్చే వస్తువులను కొనుగోలు చేయాలి. తగిన బడ్జెట్‌ను ముందే సెట్‌ చేసుకోవడం వల్ల అధిక వ్యయం చేయకుండా ఉంటారు. అవసరమైన కొనుగోళ్లకే ప్రాధాన్యతనిస్తారు.

షాపింగ్‌ జాబితా..

కావలసిన వస్తువుల జాబితాను ఇంటి దగ్గరే రాసుకోండి. కొనుగోలు సమయంలో ఆ జాబితాకే కట్టుబడి ఉండండి. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకుండా ఇది నిరోధిస్తుంది. అంతేకాకుండా, వివాహానికి సరిపడా అన్ని వస్తువులు ఒకేచోట లభించకపోవచ్చు. చాలా చోట్ల షాపింగ్‌ చేయవలసి ఉంటుంది. షాపింగ్‌ చేసే ప్రతిచోటా అనవసర కొనుగోళ్లు చేయకుండా జాబితా ఉపయోగపడుతుంది. చాలామంది రిటైలర్లు వ్యూహాత్మకంగా క్యాష్‌ / చెక్‌అవుట్‌ కౌంటర్ల వద్ద ఆకర్షణీయ వస్తువులను ప్రదర్శనలో ఉంచుతారు. వాటిపై దృష్టి కేంద్రీకరించకపోవడమే మంచిది. లిస్ట్‌లో రాసుకున్నవాటినే  కొనుగోలు చేయడం వల్ల మీకు సమయంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతుంది.

ధరల పోలిక..

వస్తువులను చూసిన మొదటి షాప్‌లోనే కొనుగోలు చేయనక్కర్లలేదు. నాణ్యతగల వస్తువును, సరైన ధరకు పొందుతున్నారని నిర్ధరించుకోవడానికి వివిధ రిటైలర్లు, ఆన్‌లైన్‌ స్టోర్స్‌ ధరలతో సరిపోల్చండి. కొన్ని పేరున్న దుకాణాల్లో, ఆన్‌లైన్‌ రిటైలర్స్‌ వద్ద కొన్ని రోజులలో ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. ఎక్కువ కొనుగోలు చేసినప్పుడు డిస్కౌంట్స్‌ మరింతగా ఉండొచ్చు. కాబట్టి, ధరల విషయంలో ప్రతి విక్రయశాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది. మీ కొనుగోళ్లపై అదనపు తగ్గింపులను అందించే కూపన్స్‌, ప్రోమో కోడ్స్‌ లేదా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్ల కోసం చూడండి. కొనుగోళ్లు చేయాలనుకున్నప్పుడు వివిధ రిటైలర్ల నుంచి విక్రయ ప్రకటనలు, అప్‌డేట్‌లపై ఓ కన్నేయండి. 

ఎర్లీ షాపింగ్‌..

ఉదయం వేళలలో షాపింగ్‌ చేయడం కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటుంది. రద్దీ ఎక్కువ ఉండదు కాబట్టి, దుకాణదారులు ఎక్కువ ఐటెమ్స్‌ను విసుగు లేకుండా చూపిస్తారు. బేరమాడడానికి అవకాశముంటుంది. కొన్ని దుకాణాలలో ఎక్కువ జనాదరణ పొందిన వస్తువులు త్వరగా అయిపోతాయి. ఉదయం వెళ్లడం వల్ల వాటిని చేజిక్కుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. షాపులు మూసివేసే సమయంలో హడావుడిగా కొనుగోలు చేయడం అంతగా లాభించదు. ఇలాంటి సమయాల్లో బేరమాడడానికి పెద్దగా అవకాశం ఉండదు.

బల్క్‌ కొనుగోళ్లు..

వివాహ వేడుకలలో ఒకే రకమైన వస్తువును ఎక్కువ మొత్తం (బల్క్‌గా)లో కొనుగోలు చేసే అవసరం ఉంటుంది. సాధారణంగా కొంత కాలం నిల్వ ఉండే వస్తువులు, అతిథులకు ఇచ్చే బహుమతులు వంటి కొన్ని వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు భారీగా డిస్కౌంట్స్‌ లభించే అవకాశం ఉంది. ఇలాంటి కొనుగోళ్లకు రిటైల్‌ మార్కెట్లను ఆశ్రయించకుండా.. టోకు సరకుల దుకాణాల్లో కొనుగోలు చేయడం మంచిది. ధరలు పెద్ద మొత్తంలో తగ్గే అవకాశం ఉంది.

నగదు..

చాలా మంది షాపింగ్‌ సమయంలో డెబిట్‌ / క్రెడిట్‌ కార్డులను, యూపీఐను ఉపయోగిస్తున్నారు. మీ ఆర్థిక సామర్థ్యం ఆధారంగా కొనుగోలు చేయగలిగిన వాటిని మాత్రమే డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేయండి. జేబు / ఖాతాలో ఉన్న నగదును ఇచ్చేటప్పుడు ఖర్చు గురించి ఎక్కువగా ఆలోచిస్తాం! దీనివల్ల కొంతవరకు ఆదా చేసుకోవచ్చు.

క్రెడిట్‌ కార్డ్స్‌..

తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు క్రెడిట్‌ కార్డులను ఉపయోగించవలసి ఉంటుంది. చాలా క్రెడిట్‌ కార్డులు క్యాష్‌బ్యాక్‌, రివార్డ్‌ పాయింట్లను అందిస్తాయి. కొన్ని సీజన్‌ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ లేదా రివార్డ్స్‌ను పొందగలరో లేదో తెలుసుకోవడానికి మీ కార్డ్‌ నిబంధనలు, షరతులను చెక్‌ చేయండి. డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో ఖర్చులు చేసేటప్పుడు ఈ పాయింట్లు ఉపయోగపడతాయి. అనేక కార్డులు ఎంచుకున్న బ్రాండ్‌లపై రివార్డులను అందిస్తాయి. చాలా క్రెడిట్‌ కార్డు సంస్థలు కొనుగోళ్లపై నో - కాస్ట్‌ ఈఎంఐను అందిస్తాయి. ఖర్చుల భారం వెంటనే లేకుండా కొనుగోళ్లను సున్నా వడ్డీతో సులభమైన నెలవారీ వాయిదాలుగా మార్చుకోవడానికి అవకాశముంటుంది.

దుస్తులు..

వివాహంలో దుస్తులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యమైన దుస్తులను కొనుగోలు చేసేటప్పుడు ఆన్‌లైన్‌పై ఆధారపడకుండా షోరూం / మాల్స్‌లలో కొనుగోలు చేస్తే వాటి నాణ్యతను అక్కడే పరిశీలించవచ్చు. ట్రయల్‌ రూమ్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఫిట్టింగ్‌ సమస్య లేకుండా చూసుకోవచ్చు. చాలా షోరూమ్‌లలో దర్జీ (టైలర్‌) ఉంటారు. మీ అవసరాలకు అనుగుణంగా దుస్తుల కొలతలను సర్దుబాటు చేస్తారు.

రిటర్న్‌ పాలసీ..

కొనుగోలు చేస్తున్న స్టోర్‌ లేదా వెబ్‌సైట్‌లో రిటర్న్‌ / ఎక్స్‌ఛేంజ్‌ విధానాల గురించి తెలుసుకోండి. కొన్నిసార్లు వస్తువును కొనుగోలు చేసిన తర్వాత అది మీ అవసరాలకు నప్పకపోవచ్చు. లేదా ఆ వస్తువు డ్యామేజ్‌ అయి ఉండవచ్చు. ఎన్ని రోజుల్లో ఆ వస్తువులను తిరిగి మార్చుకోవడానికి అవకాశముంటుందో కొనుగోలు చేసినప్పుడే వాకబు చేయాలి. అలాగైతే రిటర్న్‌ లేదా ఎక్స్‌ఛేంజ్‌ అవకాశం ఉన్నప్పుడు వినియోగదారులు నష్టపోకుండా ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని