Credit Cards: క్రెడిట్‌ కార్డును మెరుగ్గా ఉపయోగించుకోవడానికి చిట్కాలు

క్రెడిట్‌ కార్డును జాగ్రత్తగా ఉపయోగించినట్లయితే ఒక మంచి ఆర్థిక సాధనంగా ఉపయోగపడుతుంది. క్రెడిట్‌ కార్డు గురించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Updated : 23 May 2024 19:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రెడిట్‌ కార్డు ఒక విస్తృతంగా ఉపయోగించే ఆర్థిక సాధనంగా పనిచేస్తుంది. కార్డుదారుడికి తాత్కాలిక క్రెడిట్‌ లైన్‌ (రుణం) అందించడం వల్ల కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. మీకు అత్యవసర పరిస్థితిలో తక్షణం డబ్బు అవసరమైతే నగదు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కొవిడ్‌ తర్వాత కాంటాక్ట్‌లెస్‌ చెల్లింపులకు ప్రాధాన్యతమిస్తూ.. ఆర్‌బీఐ కాంటాక్ట్‌లెస్‌ కార్డులపై లావాదేవీల గరిష్ఠ పరిమితిని మునుపటి రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది. ఏది ఏమైనప్పటికీ క్రెడిట్‌ కార్డులను సరిగ్గా ఉపయోగించుకుంటేనే ప్రయోజనముంటుంది. క్రెడిట్ కార్డు కొనుగోళ్లు, చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తే కోలుకోలేని ఆర్థిక వైఫల్యాలకు దారి తీయొచ్చు. జాగ్రత్త వహించకపోతే కార్డు వినియోగం ఎక్కువై గణనీయమైన ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు. మీ క్రెడిట్‌ కార్డును పొందడం నుంచి ఉపయోగించడం వరకు కొన్ని చిట్కాలు, జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి.

క్రెడిట్‌ కార్డు ఎంపిక

కేవలం ఏజెంట్‌ సిఫార్సులు, స్నేహితుల నుంచి సలహాలు, ప్రీ అప్రూవ్డ్‌ ఆఫర్లపై ఆధారపడి క్రెడిట్‌ కార్డులను ఎంపిక చేసుకోకూడదు. కార్డులను ప్రమోట్‌ చేసేవారు అసంపూర్ణ సమాచారం అందించి అంతగా ఉపయోగం లేని క్రెడిట్‌ కార్డును అందిస్తారు. ఈ ఆఫర్లు వార్షిక రుసుమును మాఫీ చేయడానికి ఇతర షరతులతో రావచ్చు. కాబట్టి కార్డును తీసుకునేటప్పుడు ఫైన్‌ ప్రింట్‌ను పూర్తిగా చదవండి. కార్డు ఉచితం అంటే పూర్తిగా ఉచితమని ఎప్పుడూ అనుకోకండి. కార్డుపై ఏడాదికి కనీస మొత్తం ఉపయోగిస్తేనే రుసుం లేకుండా ఉంటుంది.

బడ్జెట్‌

ఆర్థిక నిర్వహణకు బడ్జెట్‌ అనేది ఒక ముఖ్యమైన సాధనం. వివిధ క్రెడిట్‌ కార్డు ఎంపికలు అందుబాటులో ఉన్నందున, క్రెడిట్‌ కార్డు పరిమితి వారి నెలవారీ ఆదాయం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్‌ కార్డును ఉపయోగించేటప్పుడు డబ్బు ఖర్చవుతున్నట్లు అనిపించదు. ప్రత్యేకించి రివార్డు పాయింట్స్‌ లేదా క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలపై దృష్టి కేంద్రీకరించినప్పుడు అనుకోకుండా మీ బడ్జెట్‌ను అధిగమిస్తుంది. నగదు/డెబిట్‌ కార్డుల్లా కాకుండా, క్రెడిట్‌ కార్డులతో చేసే ఖర్చు తక్షణ ఆర్థిక ప్రభావం చూపించదు. బిల్లు తర్వాత వస్తుంది. మీ క్రెడిట్‌ కార్డు వినియోగాన్ని గమనించడానికి డైరీని లేదా ఖర్చుల జాబితాను నిర్వహించండి. ఏ కేటగిరీలోనైనా అధిక వ్యయం చేయకుండా, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించండి. క్రెడిట్‌ కార్డు ఖర్చు మీ బడ్జెట్‌ను దాటనీయొద్దు.

బిల్లు చెల్లింపులు

క్రెడిట్‌ కార్డు బిల్లును గడువు తేదీకి ముందే చెల్లించాలి. అలాగే బకాయి ఉన్న దాంట్లో కనీస మొత్తాన్ని కాకుండా మొత్తం బకాయిని చెల్లించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల క్రెడిట్‌ స్కోరు పెరగడమే కాకుండా జరిమానా రుసుముల నుంచి తప్పించుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు బిల్లులపై చెల్లింపులను ఆలస్యం చేయడం వల్ల అనేక పరిణామాలకు దారితీయొచ్చు. క్రెడిట్‌ కార్డులపై వడ్డీ ఛార్జీలు బిల్లింగ్‌ సైకిల్‌ ముగిసే సమయానికి కాకుండా గడువు తేదీ తర్వాత రోజునుంచే మొదలవుతాయి. గడువు దాటితే వడ్డీ (జరిమానా) తప్పదు. క్రెడిట్‌ కార్డు వడ్డీ రేట్లు విపరీతంగా ఉంటాయి.. 15-36% వరకు ఉండొచ్చు. చెల్లించని బ్యాలెన్స్‌ కాలక్రమేణా గణనీయంగా పెద్ద రుణంగా పెరిగే అవకాశం ఉంది. ఆలస్యమయ్యేకొద్దీ వడ్డీపై వడ్డీ కూడా వసూలు చేస్తారు. ఇది మీ రుణాన్ని మరింత పేరుకుపోయేలా చేస్తుంది. బిల్లు చెల్లించేటప్పుడు కనీస చెల్లింపుల మొత్తాన్ని చెల్లించినా.. వారు పూర్తిగా బకాయి చెల్లించే వరకు ఆ మొత్తంపై వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. ఇలాంటి వాటి వల్ల క్రెడిట్ స్కోరు కూడా దెబ్బ తింటుంది.

గరిష్ఠ పరిమితి వద్దు

మీరు క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నప్పుడు మీ వద్ద డబ్బు లేకుండానే ఖర్చు చేస్తుంటారు. ఇది వినియోగదారులను అధిక వ్యయం చేసేలాగా ప్రొత్సహిస్తుంది. అందుచేత, పరిస్థితులు ఎలా ఉన్నా మీ క్రెడిట్‌ కార్డు వినియోగాన్ని పరిమితిలో 2/3వ వంతుకు పరిమితం చేయాలి. ఉదాహరణకు మీ క్రెడిట్‌ కార్డు పరిమితి నెలకు రూ.3 లక్షలు అయితే, మీరు రూ.2లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయని విధంగా దాని వినియోగాన్ని ప్లాన్‌ చేయండి. ఇది మెరుగైన క్రెడిట్‌ స్కోరును నిర్వహించడానికి మీకు సహాయం చేస్తుంది. కొన్ని బ్యాంకులు క్రెడిట్‌ కార్డుపై వ్యక్తిగత వ్యయ పరిమితిని సెట్‌ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఖర్చుపై అదుపు లేనివారికి ఇది మంచి ఎంపిక.

స్టేట్‌మెంట్‌ తనిఖీ

మీ క్రెడిట్‌ కార్డు బిల్లు వచ్చిన తర్వాత స్టేట్‌మెంట్‌ను నిశితంగా పరిశీలించండి. ఈ స్టేట్‌మెంట్‌ను సరిపోల్చడానికి, మీరు ఎప్పుడు క్రెడిట్‌ కార్డు ఉపయోగించినా ఆ ఖర్చు వివరాలను ప్రతినెలా ఒక బుక్‌లో రాయండి. వీటిని ఆ నెల కార్డు స్టేట్‌మెంట్‌లో వివరాలతో సరిచూసుకోండి. వస్తువులు కొనుగోలు చేసినప్పుడు చెక్‌-అవుట్‌/POS వద్ద మీరు అందుకున్న చెల్లింపు రసీదులతో బిల్‌ చేసిన స్టేట్‌మెంట్‌ను లెక్కించడం మంచి అలవాటు. ఏవైనా అదనపు ఛార్జీలను గుర్తించి నివారించడంలో ఇది సహాయపడుతుంది.

ఆఫర్లు, రివార్డ్స్‌

క్రెడిట్‌ కార్డు సంస్థలు ఎప్పటికప్పుడు రివార్డులు, ప్రోత్సాహకాలను అందిస్తాయి. ఇది క్యాష్‌బ్యాక్‌ లేదా ఉచిత వోచర్స్‌ రూపంలో ఉండొచ్చు. తాజా ఆఫర్ల కోసం మీ బ్యాంకును సంప్రదించండి. చాలామందికి తెలియని కొన్ని ప్రామాణిక క్రెడిట్‌ కార్డు ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు కార్డుదారుడు ప్రమాదంలో మరణించినా లేక అంగవైకల్యానికి గురయినా..చాలా భారతీయ క్రెడిట్‌ కార్డులపై కాంప్లిమెంటరీ బీమా సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా, మీకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి మీ రివార్డ్‌ పాయింట్లు కూడా ఉపయోగించవచ్చు.

చివరిగా: క్రెడిట్‌ కార్డును బాధ్యతాయుతంగా ఉపయోగించినప్పుడే ప్రయోజనకరమైన సాధనంగా ఉపయోగపడుతుంది. ఇది రోజువారీ ఖర్చులకు ఉపయోగపడడమే కాకుండా, రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ సౌకర్యాలు, ఆఫర్లతో ఇది మీ సాధారణ డెబిట్‌ కార్డు కంటే మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు