Mutual Funds: వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల మధ్య వ్యత్యాసం ఏంటి?

మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మ్యూచువల్‌ ఫండ్లలో లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్ల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోండి.

Published : 24 May 2024 18:45 IST

ఇంటర్నెట్ డెస్క్: మ్యూచువల్‌ ఫండ్లు.. భవిష్యత్తులో మెరుగైన రాబడిని సంపాదించడానికి, డబ్బును ఆదా చేయడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (మార్కెట్‌ విలువను), రిస్క్‌ ఆధారంగా అనేక మ్యూచువల్‌ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యక్షంగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిలేని వారు మ్యూచువల్‌ ఫండ్లలో మూడు రకాల ఫండ్లలో ఏదో ఒకదానిలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. కంపెనీ విలువ స్టాక్‌ మార్కెట్‌ నిర్ణయిస్తుంది. మూడు రకాల మ్యూచువల్ ఫండ్లు - లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లార్జ్‌ క్యాప్‌ ఫండ్లు

కంపెనీలను వర్గీకరించడానికి సెబీ కొన్ని ప్రమాణాలను అమలు చేసింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఆధారంగా స్టాక్‌ మార్కెట్‌లో జాబితా చేసిన టాప్‌ 100 కంపెనీలను లార్జ్‌ క్యాప్‌ కంపెనీలుగా వర్గీకరించారు. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్‌ ఫండ్లను లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ అంటారు. లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు సాధారణంగా మంచి ట్రాక్‌ రికార్డ్స్‌ను కలిగి ఉంటాయి. ఈ కంపెనీల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. వీటిని బ్లూ-చిప్‌ స్టాక్స్‌ అని కూడా అంటారు. ఈ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ దాదాపు రూ.20,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఇవి బలమైన మార్కెట్‌ ఉనికిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు రిలయన్స్‌, ఎస్‌బీఐ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా మొదలైన కంపెనీలు.

మిడ్‌ క్యాప్‌ ఫండ్లు

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా టాప్ 100 నుంచి 250 కంపెనీలను మిడ్‌ క్యాప్‌ కంపెనీలు అంటారు. ఈ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ దాదాపు రూ.5,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల వరకు ఉంటుంది. ఉదాహరణకు.. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌, వోల్టాస్‌ మొదలైన కంపెనీలు. మిడ్‌-క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్‌ ఫండ్లను ‘మిడ్‌-క్యాప్‌ ఫండ్స్‌’ అంటారు. మిడ్‌-క్యాప్‌ కంపెనీలకు కూడా మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. అయితే, లార్జ్‌ క్యాప్‌ ఫండ్ల కంటే మిడ్‌ క్యాప్‌ ఫండ్లలో రిస్క్‌ ఎక్కువ. మిడ్‌ క్యాప్‌ కంపెనీలు వాటి పరిమిత మార్కెట్‌ ఉనికి కారణంగా విస్తృత మార్కెట్‌ సూచీల్లో కాస్త తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండొచ్చు.

స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా 251వ స్థానం నుంచి ర్యాంక్‌ పొందిన కంపెనీలను స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు అంటారు. ఈ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.5,000 కోట్లలోపే ఉంటుంది. స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్‌ ఫండ్లను స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ అంటారు. స్మాల్‌ క్యాప్‌ కంపెనీలకు సుదీర్ఘ ట్రాక్‌ రికార్డ్‌ ఉండదు. ఉదాహరణకు స్టార్టప్‌ కంపెనీ లేదా అభివృద్ధిలో ఉన్న ఏదైనా కంపెనీ స్మాల్‌ క్యాప్‌ సెక్టార్‌ కిందకు రావచ్చు. ఈ కంపెనీలకు చాలా తక్కువ మార్కెట్‌ ఉనికి గల కారణంగా విస్తృత మార్కెట్‌ సూచీలలో ప్రాముఖ్యత ఉండదు.

లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్ల మధ్య వ్యత్యాసం..

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పై పట్టికలో తెలిపిన రాబడులు భవిష్యత్‌లోనూ వస్తాయని హామీ లేదు. కాబట్టి, ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు