Streedhan: స్త్రీధన్‌ అంటే ఏంటి ?వివాహితలు తెలుసుకోవాల్సినవి

స్త్రీధన్‌ (ఆస్తి) అనేది మహిళ వివాహ సమయంలో తన తల్లిదండ్రులు, బంధువులు, వరుడు వైపు వారు, మొదలైన వారి నుంచి పొందే సంపద. దీనిపై హక్కులు ఎవరివి?

Published : 14 May 2024 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వివాహిత మహిళల హక్కుల గురించి ఇటీవల సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. స్త్రీధన్‌ (ఆస్తి) మహిళలకు మాత్రమే చెందుతుందని స్పష్టంచేసింది.  స్త్రీ ధన్‌ భార్యాభర్తల ఉమ్మడి ఆస్తిగా మారదని, ఆస్తిపై భర్తకు ఎలాంటి హక్కు, ఆధిపత్యం ఉండదని స్పష్టంచేసింది. స్త్రీధన్‌పై ఆమె వివాహం తర్వాత భర్త లేదా అత్తమామల అదుపులో తాత్కాలికంగా ఉంచినప్పటికీ వారు ధర్మకర్తలుగా వ్యవహరించాలే తప్ప.. ఆ ఆస్తిని స్వప్రయోజనాల కోసం వాడుకోవడం గానీ, దుర్వినియోగం చేయడం గానీ చేయకూడదు. ఆమె ఎప్పుడు అడిగినా వెంటనే ఆ ఆస్తిని ఆమెకు స్వాధీనపరచాలి. తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం నేరపూరిత ఉల్లంఘన కిందకి వస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది.

స్త్రీధన్ అంటే ఏంటి?

స్త్రీధన్‌.. పేరుకు తగ్గట్టే మహిళకు సంబంధించిన ఆస్తి అని అర్థం. హిందూ వివాహిత మహిళ ఆస్తి గురించి మాట్లాడేటప్పుడు.. కట్నం, భరణం వంటి పదాలు గుర్తుకు వస్తాయి. ఇందులో వరకట్నం, స్త్రీధన్‌ అనేవి వేర్వేరు పదాలు. ప్రజలు స్త్రీధన్‌ను వరకట్నంతో పోలుస్తారు. అది సరికాదు. స్త్రీధన్‌ చట్టబద్ధమైనది, వరకట్నం చట్ట విరుద్ధం. ఉమ్మడి ఆస్తులు, వాటిలో తమ వాటా గురించి తెలియని వివాహిత మహిళలు వీటిపై కనీస అవగాహన కలిగి ఉండాలి. స్త్రీధన్‌.. వరకట్నం, భరణం మధ్య వ్యత్యాసాన్ని కూడా వివరిస్తుంది. అయితే భరణం ఒక మహిళ తన భర్త నుంచి విడిపోయిన తర్వాత తన మద్దతు/జీవనాధారం కోసం హక్కును కలిగి ఉంటుంది. మహిళలు స్త్రీధన్‌కు సంబంధించిన చట్టాలు, నియమనిబంధనల గురించి తెలుసుకోవాలి.

స్త్రీధన్‌ పరిధిలో ఉన్న ఆస్తులు

స్త్రీధన్‌ కింద మహిళకు చెందిన చర, స్థిరాస్తులే కాకుండా దాని పరిధిలో అనేకమైనవి ఉన్నాయి. అన్ని రకాల ఆభరణాలు (బంగారం, వెండి, విలువైన రాళ్లు మొదలైనవి). కారు లాంటి విలువైన వస్తువులు, పెయింటింగ్‌లు, కళాఖండాలు, గృహోపకరణాలు, ఫర్నీచర్‌ మొదలైనవి. వివాహానికి ముందు, తర్వాత సమయంలో మహిళకు బహుమతిగా వచ్చినవి కూడా స్త్రీధన్‌ కింద ఆమెకే చెందుతాయి. బహుమతులు.. తల్లిదండ్రులు, అత్తమామలు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల నుంచి రావచ్చు. లేదా మహిళ సంపాదన/రాబడితో చేసిన ఏవైనా పొదుపులు, పెట్టుబడులు.. వాటి వల్ల వచ్చిన రాబడులు ఆమెకే దక్కుతాయి. హిందూ మతంలోనే కాకుండా ఇతర మతాలలో కూడా మహిళల ఆస్తులు లేదా వివాహ సమయంలో పొందిన బహుమతులను రక్షించడానికి ఇలాంటి నిబంధనలు ఉన్నాయి.

స్త్రీధన్‌ కోసం ఏం చేయాలి?

మహిళ పేరు మీద వివాహానికి ముందు/తర్వాత అనేక విలువైన ఆస్తులు, బహుమతులు వస్తుంటాయి. మహిళ తన/భర్త కుటుంబం, స్నేహితులు, ఇతర పరిచయస్తుల నుంచి వచ్చే అన్ని బహుమతులు, ఆస్తుల జాబితాను రాసుకోవాలి. విలువైన ఆభరణాల జాబితాను రాసుకుని తన పేరు మీద బ్యాంకు లాకర్‌లో భద్రపరచుకోవడం మేలు. నగదును తన పేరు మీద బ్యాంకులో డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఆభరణాలు, విలువైన వస్తువులకు సాక్ష్యంగా పెళ్లి ఫోటోలను ఉపయోగించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది.. విలువైన ప్రతి వస్తువుకు బిల్లులు ఆమె పేరు మీద ఉండేలా చూసుకుంటే భవిష్యత్తులో చాలా ప్రయోజనముంటుంది. మహిళకు సంపాదన (ఆస్తి, జీతం ద్వారా) ఉన్నప్పుడు ఆమె పేరు మీద బ్యాంకులో ప్రత్యేక ఖాతాను నిర్వహించాలి. ముఖ్యంగా మహిళ తల్లిదండ్రులు ఖరీదైన వినియోగ వస్తువుల కంటే ఆమెకు ఆదాయాన్ని సంపాదించిపెట్టే ఆస్తిని బహుమతిగా ఇవ్వడం మంచిది. దీనివల్ల ఆమె ఆస్తి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది.

స్త్రీధన్‌ పరిధిలో లేనివి

వివాహ సమయంలో భార్య తల్లిదండ్రులు భర్తకు బహుమతిగా ఇచ్చిన ఉంగరం, బంగారు గొలుసు వంటి ఏదైనా ఆభరణాలు, ఇతర వస్తువులు స్త్రీధన్‌ పరిధిలోకి రావు. భార్య పేరు మీద భర్త ఏదైనా చర, స్థిరాస్తిని కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వకున్నా ఆ ఆస్తి స్త్రీధన్‌ కిందకు రాదు. వివాహిత సంపాదనతో ఇల్లు గడవడానికి ఖర్చుల నిమిత్తం వెచ్చించినా అది తిరిగి క్లెయిం చేయలేరు.

చివరిగా

మహిళకు స్త్రీధన్‌పై విడదీయరాని హక్కు ఉంది. ఆమె తన భర్త నుంచి విడిపోయిన తర్వాత కూడా దాన్ని క్లెయిం చేయొచ్చు. ఆమె క్లెయింను తిరస్కరించడం కూడా గృహ హింస కిందకు వస్తుంది. ఆమె భర్తతో పాటు అత్తమామలు కూడా క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. భర్త, అతడి కుటుంబం ఆమె ఆస్తిని ఆక్రమించినట్లయితే చట్టంలో ఆమె ప్రయోజనాలను పరిరక్షించడానికి నిబంధనలు ఉన్నాయి. ఆమె ఆస్తిని.. భర్త గానీ అతడి కుటుంబ సభ్యులు గానీ అడిగినప్పుడు తిరిగి ఇవ్వకపోతే ఆ స్త్రీ భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 406 ప్రకారం ‘నేరపూరిత నమ్మక ఉల్లంఘన’ (Criminal Breach of Trust) కేసు పెట్టొచ్చు. దీని ప్రకారం కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు. భర్త చేసిన అప్పులు తీర్చడానికి మహిళకు సంబంధించిన ఆస్తి ఉపయోగించకూడదని కోర్టులు స్పష్టంగా చెప్పాయి. స్త్రీధన్‌ భార్య, భర్తల ఉమ్మడి ఆస్తిగా మారదు. యజమానిగా ఆస్తిపై భర్తకు ఎలాంటి ఆధిపత్యం ఉండదు. స్త్రీధన్‌ అనేది మహిళకు సంబంధించిన సంపూర్ణ ఆస్తి అని చట్టం చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని