Debit Cards: ఎలాంటి డెబిట్‌ కార్డు ఎంచుకోవాలి?

డెబిట్‌ కార్డుతో లావాదేవీలు సులభంగా, త్వరగా, అవాంతరాలు లేకుండా జరుగుతున్నాయి. మరి డెబిట్‌ కార్డును ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటివి ఎంపిక చేసుకోవాలి?

Updated : 11 Feb 2023 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డెబిట్‌ కార్డులు (Debit card) సరిగ్గా ఉపయోగించినప్పుడు సౌకర్యంగా, లాభదాయకంగా ఉంటాయి. కాబట్టి మీ అవసరాలకు తగ్గట్టు ఉపయోగించుకోవడానికి సరైన డెబిట్‌ కార్డును జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఏటీఎంలో డబ్బు తీసుకోవడానికే మాత్రమే పరిమితమయ్యేవి. ఇప్పుడు బహుముఖ చెల్లింపుల సాధనంగా మారాయి. POS, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారాలు, UPI ఇంటర్‌ఫేస్‌లు, మరికొన్నింటి ద్వారా దేశీయ, అంతర్జాతీయ లావాదేవీల కోసం డెబిట్‌ కార్డులను ఉపయోగించవచ్చు. కాబట్టి మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల డెబిట్‌ కార్డుల్లో సరైనది ఎంపిక చేసుకోవాలి.  వాటి ఛార్జీలు, ఫీచర్స్‌ను సరిపోల్చాలి.

సరైన చెల్లింపుల నెట్‌వర్క్‌ ప్రాసెసర్‌ (PNP) కార్డును ఎంచుకోండి

మాస్టర్‌ కార్డు, వీసా, మేస్ట్రో, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, రూపే మొదలైన విభిన్న చెల్లింపుల నెట్‌వర్క్‌ ప్రాసెసర్‌లు (PNPలు) దేశంలో ఉన్నాయి. డెబిట్‌ కార్డును ఎంచుకున్నప్పుడు, మీరు ఎక్కువగా ఉపయోగించాలనుకుంటున్న ప్రాంతంలో PNP ఎంతవరకు ఆమోదం ఉందో తనిఖీ చేయాలి. రూపే.. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) నిర్వహణలో ఉంది. భారత్‌లో ఎక్కువ మంది ఈ తరహ కార్డులు వాడుతున్నారు. రూపే కార్డుపై ఛార్జీలు తక్కువగా ఉంటాయి. వీసా, మాస్టర్‌ కార్డు మొదలైన ఇతర PNPలు అంతర్జాతీయ సంస్థల నిర్వహణలో ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్త విస్తృత ఆమోదాన్ని కలిగి ఉంటాయి. విదేశాలకు ప్రయాణిస్తున్నవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

కాంటాక్ట్‌లెస్‌ (Vs) రెగ్యులర్‌ కార్డు

ఈ రోజుల్లో POS మెషిన్‌ను తాకకుండా లావాదేవీలను అనుమతించే ఫీచర్లతో కూడిన డెబిట్‌ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి కార్డులను.. కాంటాక్ట్‌లెస్‌ కార్డులు అని పిలుస్తారు. కొవిడ్‌ పరిణామాల తర్వాత నుంచి కాంటాక్ట్‌లెస్‌ కార్డులు ప్రజాదరణ పొందుతున్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. డెబిట్‌ కార్డు పిన్‌ నమోదు చేయకుండానే రూ.5000 వరకు లావాదేవీలు చేయొచ్చు. షాపింగ్‌ చేసేటప్పుడు, తరచుగా చెల్లింపులు చేయాల్సి వచ్చినప్పుడు కాంటాక్ట్‌లెస్‌ కార్డులతో సులభంగా, త్వరితగతిన చెల్లింపులు చేయొచ్చు. తక్కువ విలువ లావాదేవీల కోసం కాంటాక్ట్‌లెస్‌ కార్డులకు పిన్‌ను నమోదు చేయాల్సిన అవసరం లేదు గానీ, అలాంటి కార్డులను పోగొట్టుకున్నప్పుడు డబ్బును కోల్పోయే అవకాశమూ ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌ లేదా ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా మీ డెబిట్‌ కార్డులో తక్కువ లావాదేవీ పరిమితిని సెట్‌ చేసుకోవాలి. లేదంటే కాంటాక్ట్‌లెస్‌ ఫీచర్‌ను ఆఫ్‌ చేయాలి. కార్డును పోగొట్టుకున్నప్పుడు బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌చేసి కార్డును బ్లాక్‌ చేయించాలి.

కో-బ్రాండెడ్‌ (Vs) నాన్‌-కో-బ్రాండెడ్‌ డెబిట్‌ కార్డు

క్రెడిట్‌ కార్డుల మాదిరిగానే మార్కెట్‌లో కో-బ్రాండెడ్‌ డెబిట్‌ కార్డులూ చాలానే అందుబాటులో ఉన్నాయి. సినిమా టికెట్‌, విమాన టికెట్‌, హోటల్‌ బుకింగ్‌ కోసం ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన డెబిట్‌ కార్డును పొందొచ్చు. ఫీచర్‌పై ఆధారపడి కో-బ్రాండెడ్‌ డెబిట్‌ కార్డులు సాధారణంగా అధిక రివార్డు పాయింట్‌ ప్రయోజనాలు, ఆకర్షణీయమైన క్యాష్‌ బ్యాక్‌లు, ప్రత్యేకమైన డిస్కౌంట్‌లను అందిస్తాయి. కో-బ్రాండెడ్‌ డెబిట్‌ కార్డులు సాధారణ కార్డుల కంటే ఎక్కువ ఛార్జీలను కలిగి ఉంటాయనేది గుర్తుంచుకోవాలి. నాన్‌-బ్రాండెడ్‌ చెల్లింపులు, ఏటీఎంల నుంచి డబ్బును విత్‌డ్రా చేయడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు మొదలైన సాధారణ లావాదేవీలకు కట్టుబడి ఉండాలనుకుంటే కో-బ్రాండెడ్‌ సరైన ఎంపిక కాదు.

సరైన డెబిట్‌ కార్డును ఎలా ఎంచుకోవాలి?

డెబిట్‌ కార్డును ఎంచుకున్నప్పుడు వాటి ఛార్జీలు, ఫీచర్స్‌ను చూసుకోవాలి. మీ వినియోగానికి సరిపడే కార్డును ఎంచుకోవాలి. ఉదాహరణకు: నెలలో అనేకసార్లు ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేస్తే, అధిక ఏటీఎం ఉపసంహరణ పరిమితిని, ఎక్కువ సంఖ్యలో ఉచిత విత్‌డ్రాాలను అందించే డెబిట్‌ కార్డును ఎంచుకోవాలి. డెబిట్‌ కార్డు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం, అధిక షాపింగ్‌ పరిమితి, పర్సనల్‌ యాక్సిడెంట్‌ కవర్‌ మొదలైనవి. ఇవి మీ జీవనశైలి, ఖర్చులకు తగ్గట్టుగా ఉన్నాయని భావిస్తే అలాంటి కార్డులనే ఎంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని