Pension: పదవీ విరమణ ప్రశాంతంగా సాగాలంటే

పదవీ విరమణ.. ఎన్నో ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం. ఈ కాలంలో ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలం. దీనికోసం ఆర్జిస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి

Published : 07 Jun 2024 00:34 IST

పదవీ విరమణ.. ఎన్నో ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం. ఈ కాలంలో ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలం. దీనికోసం ఆర్జిస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే అనుకున్న విధంగా మలి జీవితాన్ని కొనసాగించగలం. అందుకోసం ముందునుంచే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్నది చూద్దాం.

ఉద్యోగంలో చేరినప్పుడే పదవీ విరమణ గురించి ఆలోచించాలి.. ఈ సాధారణ ఆర్థిక సూత్రాన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు. తీరా.. ఉద్యోగ విరమణకు ఇంకా రెండు మూడేళ్ల వ్యవధే ఉందని తెలిసినప్పుడు.. అప్పటికప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. దీర్ఘకాలిక లక్ష్యాన్ని స్వల్పకాలంలోనే సాధించాలని అనుకుంటారు. అప్పుడు అది అంత తేలికకాదు. 

ప్రణాళికలతో మొదలు..

 ప్రయాణం మొదలు పెట్టేముందు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆర్థిక విషయాల్లోనూ ఇదే వర్తిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మనం వేసుకున్న ప్రణాళిక కాలానుగుణంగా వాస్తవ పరిస్థితుల్లో సవరించుకునేలా ఉండాలి. ఆలోచన ఉండగానే సరికాదు. దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే విలువ. ఇప్పుడున్న ప్రణాళిక 10 ఏళ్ల తర్వాత పూర్తిగా భిన్నంగా మారిపోవచ్చు. ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, మారుతున్న అవసరాలు, జీవన శైలిలో మార్పులు ఇలా ఎన్నో దీనికి కారణం అవుతాయి. కాబట్టి, ముందుగా మీరు ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులు భవిష్యత్‌లో ఎలా ఉండవచ్చు అనే అంశాన్ని ఆలోచించండి. అందుకు అనుగుణంగా పొదుపు మొత్తాలను కేటాయించండి. పదవీ విరమణ ప్రణాళిక నిరంతరం సాగే ప్రక్రియ. మధ్యలో ఆపేస్తే విశ్రాంత జీవితంలో ప్రశాంతత కొరవడుతుంది.

పొదుపులో వృద్ధి

మీ నెలవారీ ఖర్చుల పట్ల అంచనాకు వచ్చాక చూడాల్సింది అందుకు అనుగుణంగా మీ పొదుపు, పెట్టుబడులు ఉన్నాయా అని. మీ రిటైర్మెంట్‌ నాటికి ఎంత మొత్తం జమ అయ్యే అవకాశం ఉందనేది లెక్క వేసుకోవాలి. చాలామంది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్, మ్యూచువల్‌ ఫండ్లు, స్థిరాస్తి తదితర మార్గాల్లో మదుపు చేస్తుంటారు. వీటిలో పదవీ విరమణ వరకూ కొనసాగేవి తక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు కొంత మొత్తం పిల్లల చదువులు, ఇతర అవసరాల కోసం వెనక్కి తీసుకుంటారు. ఆరోగ్య అత్యవసరాలు ఏర్పడవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పొదుపు మొత్తాన్ని క్రమంగా పెంచుతూ ఉండాలి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి దీటుగా రాబడినిచ్చే పెట్టుబడులను ఎంచుకోవాలి. పదవీ విరమణ అనంతరం ఎంత మొత్తం అవసరం? ఈ పెట్టుబడులు ఎంత మేరకు ఆ నిధిని జమ చేసేందుకు తోడ్పడతాయి? అనే లెక్కలు ఎప్పటికప్పుడు వేసుకుంటూ ఉండాలి. 

జీవన శైలికి తగ్గట్లుగా..

 రిటైర్మెంట్‌ అనంతరం మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు. ఎక్కడ స్థిర నివాసం ఉంటారు.. సొంతిల్లా.. అద్దె ఇల్లా.. ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి. ఇది అనవసరమైన ప్రశ్న అనిపించవచ్చు. వీటికి కచ్చితమైన సమాధానం అవసరం లేదు కానీ, కొంతమేరకైనా అంచనా ఉండాలి. వసతి, ఆహారం, సాధారణ ఔషధాల ఖర్చు, ఇతర జీవన శైలి వ్యయాలు.. ఎంత మేరకు అవుతాయనే లెక్కలు వేసుకోవాలి. మీరు భవిష్యత్‌ను ఇప్పటి నుంచే ఊహిస్తే దానికి అనుగుణంగా మీ పెట్టుబడులూ కొనసాగించాలి. అంచనాలను రూపొందించుకునేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. మీ పదవీ విరమణకు మరో అయిదేళ్ల సమయం ఉంది అనుకుంటే.. ఇప్పటి నెలవారీ ఖర్చు అయిదేళ్ల తర్వాత ఎంత ఉండొచ్చు. అనేది లెక్క వేసుకోవాలి. అందుకు అనుగుణంగా ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి.

లోటును భర్తీ చేసేలా..

పదవీ విరమణ చేశాక ఎంత మొత్తం అవసరం అనే అవగాహన వచ్చాక వేయాల్సింది.. మీ ప్రస్తుత పొదుపు, పెట్టుబడులు ఎంత మేరకు వృద్ధి చెందుతున్నాయని. నెలవారీ ఖర్చులను తట్టుకునేందుకు అవి ఎంత మేరకు సహాయం చేస్తాయి అని తెలుసుకోవాలి. ఉదాహరణకు మీ రిటైర్మెంట్‌ అనంతరం నెలకు రూ.50 వేలు అవసరం అవుతాయని అంచనా వేశారనుకుందాం. మీ ప్రస్తుత పొదుపు మొత్తం నుంచి వచ్చేది రూ.30 వేలే అనుకుందాం. మిగతా రూ.20 వేల కోసం ప్రణాళిక రూపొందించుకోవాలి. సురక్షితంగా ఉంటూ ఆదాయాన్ని అందించే పథకాలను ఎంపిక చేసుకునేటప్పుడు యాన్యుటీ పాలసీలను పరిశీలించవచ్చు. వెంటనే పింఛను ఇచ్చే ఇమ్మీడియట్‌ యాన్యుటీలు పదవీ విరమణ చేసిన వారికి ఉపయోగం. 10 ఏళ్లకు మించి వ్యవధి ఉన్నప్పుడు డిఫర్డ్‌ యాన్యుటీ పథకాలను ఎంచుకోవచ్చు. వీటిని తీసుకునేటప్పుడు జీవితాంతం వరకూ పింఛను ఇచ్చే ఏర్పాటు చేసుకోవాలి. క్రమానుగత పెట్టుబడి విధానంలో డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలోనూ మదుపు చేయొచ్చు. 
ఉద్యోగం చేస్తున్నన్ని రోజులూ త్యాగం చేసిన ఎన్నో విషయాలను నెరవేర్చుకునేందుకు విశ్రాంత జీవితాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆర్థికంగా ముందుగా ప్రణాళిక వేసుకున్నప్పుడే ఇది సాధ్యం అవుతుందన్నది మర్చిపోవద్దు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు