YouTube: యూట్యూబ్‌లో కంటెంట్‌ క్రియేటర్ల కోసం కొత్త AI ఫీచర్లు

Eenadu icon
By Business News Team Published : 17 Sep 2025 14:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

YouTube | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌ యూట్యూబ్‌ తాజాగా నిర్వహించిన ‘మేడ్‌ ఆన్‌ యూట్యూబ్‌’ ఈవెంట్‌లో పలు కొత్త ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారిత ఫీచర్లను ఆవిష్కరించింది. కంటెంట్‌ క్రియేటర్లకు ఉపయోగపడే విధంగా షార్ట్స్‌, పాడ్‌కాస్ట్‌, లైవ్‌స్ట్రీమింగ్‌లో పలు కొత్త ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏఐ టూల్స్‌ను ఉచితంగా అందిస్తోంది. వీటి ద్వారా క్రియేటర్లు వీడియో బ్యాక్‌గ్రౌండ్లు, సౌండ్‌తో కూడిన క్లిప్‌లను రూపొందించుకోవచ్చు.

గూగుల్‌ వియో3..

వియో3.. వీడియో జనరేట్‌ చేసేందుకు వాడే ఏఐ మోడల్‌. దీని ద్వారా 480p క్వాలిటీ వీడియోలను జాప్యం లేకుండా ఉచితంగా సృష్టించుకోవచ్చని యూట్యూబ్‌ తన బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇతర దేశాల్లో అందించనున్నట్లు సమాచారం. క్రియేటర్లు తమ యూట్యూబ్‌ యాప్‌లోని ‘క్రియేట్‌’ ఆప్షన్‌ను ఎంచుకొని.. టాప్‌లో కుడివైపు కనిపించే ‘sparkle icon’పై క్లిక్‌ చేసి ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. స్టిల్ ఫొటోలు ఉపయోగించి వీడియోలు తయారు చేసుకోవడం, తమ వీడియోలకు ‘పాప్ ఆర్ట్‌’ లేదా ‘ఒరిగామి’ లుక్ ఇవ్వడం, ప్రాంప్ట్‌ ద్వారా క్యారెక్టర్‌, ప్రాప్‌, ఎఫెక్ట్‌లను చేర్చుకోవడం వంటివి చేసుకోవచ్చు. మరికొన్ని నెలల్లో ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

పాడ్‌కాస్ట్‌లోనూ..

యూట్యూబ్‌ పాడ్‌కాస్ట్స్‌లో కూడా వియో 3 ఏఐని యూట్యూబ్‌ ఇంటిగ్రేట్ చేస్తోంది. దీని సాయంతో పాడ్‌కాస్టర్‌లు పూర్తి ఎపిసోడ్‌ల నుంచి వీడియో క్లిప్‌లు, షార్ట్స్‌ తయారు చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ లేని సందర్భాల్లో, కేవలం ఆడియో ఫైల్ ఆధారంగా కస్టమైజ్‌ చేయదగిన వీడియోను ఈ ఏఐ టూల్ సృష్టిస్తుంది.

లైవ్‌స్ట్రీమింగ్‌లో కొత్త ఫీచర్లు

లైవ్‌స్ట్రీమింగ్ క్రియేటర్ల కోసం యూట్యూబ్‌ కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఇప్పటి వరకు కేవలం యూజర్లకే అందుబాటులో ఉన్న ప్లేయబుల్స్‌ (Playables)ను ఇప్పుడు క్రియేటర్లు కూడా లైవ్‌లో ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా లైవ్‌స్ట్రీమ్ చేస్తూనే గేమ్‌లు ఆడటం, మానిటైజ్ చేసుకోవడం, ఆడియన్స్‌తో ఇంటరాక్ట్‌ కావడం సాధ్యం అవుతుంది. ఇక నుంచి క్రియేటర్లు వర్టికల్ లైవ్‌స్ట్రీమ్ కూడా చేయగలరు. అదనంగా లైవ్ నుంచి హైలైట్స్ లేదా షార్ట్స్‌ను సృష్టించుకునే ఏఐ టూల్‌ను కూడా తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు