కొలువుల ఆశ చూపి కంబోడియాకు..

ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్‌ను అరెస్టు చేశారు.

Updated : 28 Apr 2024 08:54 IST

కమీషన్ల కోసం విదేశాలకు యువకులను తరలిస్తున్న ముఠా
గుట్టురట్టు చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు
జగిత్యాల జిల్లాకు చెందిన ఏజెంట్‌ అరెస్టు

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఆ దేశంలో ఉన్న చైనా కంపెనీ యువకులతో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైందని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ‘సిరిసిల్ల పురపాలక సంఘం పరిధి పెద్దూరుకు చెందిన అతికం లక్ష్మి తన కుమారుడు అతికం శివ ప్రసాద్‌ కంబోడియాలో ఇబ్బంది పడుతున్నాడంటూ నాలుగు రోజుల క్రితం సిరిసిల్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టాం.

జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన కంచర్ల సాయిప్రసాద్‌ అనే ఏజెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశచూపి, రూ.1.40 లక్షలు తీసుకుని శివ ప్రసాద్‌ను కంబోడియా దేశానికి పంపినట్టు తెలుసుకున్నాం. వాట్సప్‌లో శివప్రసాద్‌తో మాట్లాడాం. ‘అక్కడున్న చైనా దేశానికి చెందిన కంపెనీ కాల్‌ సెంటర్‌లో తాను పనిచేస్తున్నానని, కంపెనీ నిర్వాహకులు భారతీయుల ఫోన్‌ నంబర్లు ఇచ్చి లాటరీ, ఉద్యోగాల పేరుతో అమాయకులను మభ్యపెట్టి వారి ఖాతాల్లో డబ్బు దోచేసేలా తర్ఫీదు ఇచ్చారని, తనలాగే 500-600 మంది బాధితులు పనిచేస్తున్నారని, అందరితో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్నారని’ ఆయన వివరించారు. అనంతరం కంబోడియాలో ఉన్న ఇండియన్‌ ఎంబసీ అధికారులకు సమాచారం అందించాం. అక్కడి పోలీసుల సహకారంతో శివ ప్రసాద్‌ను కాపాడాం. రెండు రోజుల్లో ఆయన భారత్‌కు చేరుకుంటారు. ఆయనతోపాటు అక్కడ ఉన్న బాధితులందర్నీ స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాం’ అని ఎస్పీ తెలిపారు.

రూ.10 వేల కమీషన్‌ కోసం అక్రమాలు..

ఓ ముఠా కమీషన్ల కోసం యువకులను మభ్యపెట్టి అక్రమంగా కంబోడియాకు తరలిస్తున్న వైనం విచారణలో వెలుగులోకి వచ్చిందని ఎస్పీ వివరించారు. ‘అతికం లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో జగిత్యాల జిల్లాకు చెందిన కంచర్ల సాయి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించాం. అతను రూ.10 వేలు కమీషన్‌ తీసుకొని శివ ప్రసాద్‌ను లక్నోకు చెందిన సదాకత్‌ (ప్రస్తుతం సదాకత్‌ మాల్దీవులులో ఉన్నాడు) వద్దకు పంపినట్టు తెలుసుకున్నాం. అతను మరో రూ.10 వేలు కమీషన్‌ తీసుకొని పుణెలో ఉన్న అబిద్‌ అన్సారీ వద్దకు పంపించినట్టు, ఆయన బిహార్‌ రాష్ట్రానికి చెందిన షాదల్‌ (ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు) వద్దకు పంపగా, అతను శివ ప్రసాద్‌ను కంబోడియా దేశానికి పంపినట్టు తెలుసుకున్నాం’ అని ఎస్పీ తెలిపారు. కంచర్ల సాయి ప్రసాద్‌ను అరెస్టు చేశామని, పుణెలో ఉన్న అబిద్‌ అన్సారీని విచారించి..నోటీసు ఇచ్చి పంపించామని వివరించారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ఇలా మోసపోయి ఉంటే స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌ నంబర్‌ 8712656411కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని