logo

ఆర్జీయూకేటీ.. ఏమిటీ దుస్థితి!

అక్కడంతా రహస్యమే.. అధ్యాపకుల బోధన, అధికారుల పర్యవేక్షణ, విద్యార్థుల బాగోగులు-మానసిక స్థితిగతులు- బోధకుల కౌన్సెలింగ్‌.. సైతం గోప్యమే.

Updated : 09 Aug 2023 05:16 IST

వరుస మరణాలతో మసకబారుతున్న ఖ్యాతి

ఈటీవీ, ఆదిలాబాద్‌, ముథోల్‌(బాసర):అక్కడంతా రహస్యమే.. అధ్యాపకుల బోధన, అధికారుల పర్యవేక్షణ, విద్యార్థుల బాగోగులు-మానసిక స్థితిగతులు- బోధకుల కౌన్సెలింగ్‌.. సైతం గోప్యమే. వెరసి.. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) అంటేనే అంతుచిక్కని ఓ రహస్య కేంద్రంగా మారుతోంది. గ్రామీణ విద్యార్థులను సాంకేతిక రంగంలో వైజ్ఞానికులను తయారుచేస్తూ భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన చోటే బలవన్మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేకెత్తిస్తోంది. గతేడాది ఆగస్టు 23 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు పరిగణలోకి తీసుకుంటే.. ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి మృతిచెందగా, మరో నలుగురు ఆత్మహత్యకు ఒడిగట్టడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఆత్మహత్యలు వారి వ్యక్తిగత తప్పిదమన్నట్లు చూపించడమే తప్పితే వారి మానసిక స్థితిగతులను గుర్తించడంపై ధ్యాస కనిపించడం లేదు. తాజాగా మంగళవారం మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం విశాదాన్ని నింపింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన గ్రామీణ విద్యార్థులను సాంకేతిక వైజ్ఞానిక రంగంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 2008 మార్చిలో ఆర్జీయూకేటీ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మధ్యలో ఓ రెండు, మూడేళ్లు మినహాయిస్తే మిగిలిన కాలమంతా హైదరాబాద్‌కే పరిమితమవుతున్న ఇన్‌ఛార్జి వైస్‌ ఛాన్సలర్ల పర్యవేక్షణ కారణంగా.. విద్యాలయంలో ఏం జరుగుతుందో బయటకు తెలియని పరిస్థితి. అసౌకర్యాలతో సతమతమవ్వడం, సరైన రీతిలో భోజనాలు లేకపోవడం, అనుకున్నట్లుగా బోధన జరగకపోవడంపై విద్యార్థులు ఆందోళనకు దిగిన ప్రతిసారి ఫెయిల్‌ చేస్తామని బెదిరించడం పరిపాటిగా మారింది.

మంత్రుల హామీలేమయ్యాయి?

విద్యాలయంలో నెలకొన్న సమస్యలపై 2022 జూన్‌ విద్యార్థులు ఆందోళనకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ప్రభుత్వ ప్రతినిధిగా జూన్‌ 20న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాలయాన్ని సందర్శించారు. తరువాత సెప్టెంబర్‌ 26న ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ వచ్చి విద్యార్థులు లేవనెత్తిన సమస్యలన్నింటినీ విడతల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నెల రోజులపాటు కొనసాగిన ఆందోళన సద్దుమణిగింది. మళ్లీ 2022 డిసెంబర్‌ 10న జరిగిన స్నాతకోత్సవంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి వచ్చిన మంత్రి కేటీఆర్‌ విద్యాలయంలో సమస్యలేవి పరిష్కారం కాలేదని తెలిసి అసహనానికి గురయ్యారు.

వీసీ సహా అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో విద్యార్థుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ‘వసతిగృహాల్లో ఉన్న నేను మీ ఆవేదనను అర్థం చేసుకున్నానని’ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రసంగించిన తీరు విద్యార్థులను ఆకట్టుకుంది. ఆర్జీయూకేటీని తెలంగాణ మినీ హబ్‌గా ఏర్పాటుచేస్తామని భరోసా ఇవ్వడం విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. కానీ ఇప్పటిదాకా కేవలం వివిధ విశ్వవిద్యాలయాలతో ఎంవోయూ చేసుకున్నామని అధికారులు మాట వరుసగా చెప్పడమే తప్పితే ఏ సమస్య పరిష్కారం కాలేదు. కనీసం విద్యార్థుల బాగోగులను పట్టించుకోవడంలేదు. ఇన్‌ఛార్జి బాధ్యతలతో ఉన్న వీసీ హైదరాబాద్‌కే పరిమితం కావడంతో విద్యాబోధన-విద్యార్థుల బాగోగుల విషయంలో ఏం జరుగుతుందో తెలియకుండా పోతోంది.

జిల్లా ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

నిర్మల్‌ పట్టణం: విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో నిర్మల్‌ జిల్లా ఆసుపత్రి వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. కుటుంబసభ్యులు రావడం ఆలస్యమవుతుందన్న కారణంతో శవాగారంలో భద్రపరిచారు. ముందుజాగ్రత్తగా డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ సీఐ పురుషోత్తంచారి ఆధ్వర్యంలో ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. భాజయుమో, కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం నాయకులు ఆందోళన చేపట్టడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విద్యాలయానికి వచ్చిన వారం రోజుల్లోనే..

ఆర్జీయూకేటీలో చేరిన వారం రోజుల్లోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బలవన్మరణానికి ముందు అతను తల్లిదండ్రులతోపాటు విద్యాలయంలోనే చదువుతున్న వరుసకు సోదరుడైన సాయినాథ్‌తో చరవాణిలో మాట్లాడాడు. మాట్లాడిన అరగంట తర్వాత తండ్రికి విద్యాలయాధికారులు మీ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఆ అరగంటలో ఏమి జరిగింది.. అంతకు ముందు ఉత్సాహంగా ఉన్న వాడు ఒక్కసారిగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రుల ఆశలు ఆవిరి..

నారాయణఖేడ్‌, జోగిపేట: విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటంతో స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం నాగాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. జాదవ్‌ సంతోష్‌-రుక్మిణీబాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరికి గ్రామంలో 13 గుంటల భూమి మాత్రమే ఉంది. ఉపాధి నిమిత్తం ఈ కుటుంబం పిల్లలతోసహా ఐదేళ్ల కిందట సంగారెడ్డికి వలసవెళ్లారు. దంపతులు అక్కడ నిత్యం అడ్డా కూలీలుగా పనిచేస్తూ పిల్లలను పోషించుకునేవారు. పెద్దకుమారుడు అందోలు మండలం నేరేడుగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో 9.5 జీపీఏతో ఉత్తీర్ణత సాధించి బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించాడు.
ఈ నెల 1న తండ్రి సంతోష్‌ అతడిని బాసరకు తీసుకెళ్లి కళాశాలలో వదిలివచ్చారు. అప్పటి నుంచి నిత్యం తమతో చరవాణిలో మాట్లాడేవాడని, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైతం ఫోన్‌చేసి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నాడని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, కళ్లకలక వచ్చిందని, గదిలోనే ఉన్నానని చెప్పాడని.. సంతోష్‌ పేర్కొన్నారు. మాట్లాడిన అరగంటలోనే ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ఫోన్‌ చేయడంతో నిర్ఘాంతపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద కొడుకు ప్రయోజకుడైతే తమ కష్టాలు తీరుతాయనుకున్నామని, తమ ఆశలు ఆవిరయ్యాయని కుటుంబ సభ్యులు వాపోయారు. నాగాపూర్‌లో సంతోష్‌కు రేకుల ఇల్లు మాత్రమే ఉంది. సంగారెడ్డి నుంచి స్వగ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకొంటూ జీవించాలని ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం సైతం ప్రారంభించారని సర్పంచి పుండ్లిక్‌తోపాటు తండావాసులు పేర్కొన్నారు.

కౌన్సెలింగ్‌ ఏది?

ఆర్జీయూకేటీలో కొత్తగా చేరే విద్యార్థుల మానసిక స్థితిగతులను అధికారుల పసిగట్టాల్సి ఉంది. ర్యాగింగ్‌ జరగకుండా చూడటం, బాలికల ఆరోగ్య స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా నిరంతర పర్యవేక్షణ చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలు తరచూ నిర్వహించడం, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో విద్యార్థుల ప్రతిభను వివరించడం చేయాలనే నిబంధన ఎక్కడా అమలుకావడం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి రావడంతో ముభావంగా ఉండే కొంతమంది పిల్లలను చేరదీసి కౌన్సెలింగ్‌ చేసే విధానం ఏమీ లేదు. విద్యార్థుల యోగక్షేమాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే కాకుండా అధికారులు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలే విద్యార్థుల్లో ఆందోళనలకు దారితీస్తోంది.

  • నేరడిగుంటలోని వసతిగృహంలో ఉంటూ నిత్యం పాఠశాలకు వచ్చే సదరు విద్యార్థి చదువుతోపాటు ఆటల్లోనూ చురుగ్గా ఉండేవాడని, తోటి విద్యార్థులతో కలుపుగోలుగా ఉంటూ చదువులో మంచి మార్కులు తెచ్చుకునేవాడని, కబడ్డీ, వాలీబాల్‌ ఆటలు ఎక్కువగా ఆడేవాడని హెచ్‌ఎం రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.

పోలీసుల దర్యాప్తు

విద్యార్థి ఆత్మహత్య విషయంపై ఆర్జీయూకేటీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కళాశాలకు వెళ్లి విద్యార్థి వివరాలు, ఆత్మహత్య చేసుకున్న సమయం, ఎవరు గమనించారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. కారణాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని