logo

ఇక ఓపీ సేవలు సులభం

జనరల్‌ ఆసుపత్రిలో బాధితుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. వైద్యులను సంప్రదించడం పక్కన పెడితే ఓపీ చీటీ పొందాలంటేనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి.

Published : 17 May 2024 02:15 IST

అందుబాటులోకి ప్రత్యేక యాప్‌

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: జనరల్‌ ఆసుపత్రిలో బాధితుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. వైద్యులను సంప్రదించడం పక్కన పెడితే ఓపీ చీటీ పొందాలంటేనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి. దీంతో ఓపీ సేవలు కొనసాగే సగం సమయం దీనికే సరిపోతుంది. ఇక వైద్యులు చూసి ఏవైనా పరీక్షలు రాస్తే అంతే సంగతులు. ఈ భారీ వరుసల నుంచి బాధితులకు ఉపశమనం కలిగించేలా, వారి ఇబ్బందులను అధిగమించేలా ప్రత్యేక యాప్‌(ఏబీహెచ్‌ఏ) అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌తో ఓపీ చీటీని సులభంగా క్షణాల్లో పొందవచ్చు. ప్రస్తుతం ప్రతి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జీజీహెచ్‌లోనూ మొదలుకాగా బాధితులకు అవగాహన లేక ఇంకా వరుస కడుతూనే ఉన్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న బాధితులందరికి ఈ యాప్‌ సేవలు చేరువ చేసేలా పర్యవేక్షకులు సిబ్బందిని కేటాయించారు. యాప్‌ గురించి వివరించడంతోపాటు వారి అనుమతి మేరకు దగ్గరుండి డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సేవలు వినియోగించుకునేందుకు పలువురు సిద్ధం అవుతుండగా మరింత విస్తృతం చేసేందుకు ఓపీ నమోదు కౌంటర్ల వద్ద సిబ్బందిని అందుబాటులో ఉంచి అవగాహన పెంచుతున్నారు. వివిధ సమస్యలరీత్యా ఆసుపత్రికి వచ్చే బాధితులు ఈ యాప్‌ సేవలతో ఉపశమనం పొందవచ్చు.

ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

చరవాణిలోని ప్లేస్టోర్‌కు వెళ్లి ఏబీహెచ్‌ఏ(ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌) టైప్‌ చేయండి. నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో కూడిన యాప్‌ కనిపిస్తుంది. ఇన్‌స్టాల్‌ చేసిన అనంతరం ఆసుపత్రిలోని ఓపీ నమోదు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని క్యూఆర్‌ కోడ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని యాప్‌ ద్వారా స్కాన్‌ చేయాలి. సంబంధిత బాధితుల సమాచారం(ఆధార్‌కార్డు, చరవాణి సంఖ్య) నమోదు కాగానే ఆ వివరాలన్నీ ఓపీ నమోదు కౌంటర్‌కు చేరుతాయి. వెంటనే టోకెన్‌ నంబర్‌ వస్తుంది. ఆ సంఖ్యను అబా కౌంటర్‌లోని సిబ్బందికి తెలపగానే ఏ వైద్యుడిని కలవాలో అడిగి ఆయా గది నంబరుతో కూడిన ఓపీ చీటీ అందజేస్తారు. ఆ తర్వాత మరోసారి ఆసుపత్రికి వచ్చినా అక్కడి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే టోకెన్‌ నంబరు సులువుగా పొంది సమయం ఆదా చేసుకోవచ్చు.

  • ఇది మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి పరిస్థితి. ఓపీ నమోదు గదిలో బాధితులు ఇలా బారులు తీరుతున్నారు. వరుస క్రమంలో గంటలకొద్ది నిలబడుతున్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన అబా(ఏబీహెచ్‌ఏ) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఈ ఇబ్బందులను అధిగమించవచ్చు. ఆసుపత్రికి వచ్చిన ప్రతీసారి వరుసలో నిలబడే అవసరం ఉండదు. నిమిషం వ్యవధిలో ఓపీ చీటీ పొందవచ్చు.
  • అబా(ఏబీహెచ్‌ఏ) యాప్‌పై అవగాహన పెంచేందుకు, మంచిర్యాల జీజీహెచ్‌లోనూ ఈ తరహా విధానాన్ని విస్తృతం చేసేందుకు ఓపీ నమోదు వద్ద ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. బాధితులకు ఇలా దగ్గరుండి వివరిస్తున్నారు. స్వయంగా చరవాణిలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. ఎలా వినియోగించాలో తెలియజేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ కార్యక్రమం చేపడుతుండగా చాలా మంది బాధితులు ఆసక్తి చూపిస్తున్నారని, సమయం ఆదా చేసుకుంటూ ఉపశమనం పొందుతున్నారని సిబ్బంది చెబుతున్నారు.
  • ఇది అబా యాప్‌కు సంబంధించిన సూచనలు, డౌన్‌లోడ్‌, పని చేసే విధానాన్ని తెలియజేసే సూచిక. దీన్ని ఫ్లెక్సీ రూపంలో జీజీహెచ్‌లో అందుబాటులో ఉంచారు. ఆసుపత్రికి వచ్చే బాధితులు దీని ఆధారంగా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. వివరాల నమోదుతో టోకెన్‌ పొందవచ్చు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక అబా టోకెన్‌ కౌంటర్‌లో తెలిపి ఓపీ చీటీని సులభంగా తీసుకోవచ్చు.

ఇది ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో ఇటీవల ఏర్పాటు చేసిన అబా టోకెన్‌ కౌంటర్‌. అక్కడే క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ఫ్లెక్సీని అందుబాటులో ఉంచగా బాధితులు ఇలా వచ్చి స్కాన్‌ చేసుకుని టోకెన్‌ నంబరును పొందుతున్నారు. ఆ పక్కనే ఉన్న సంబంధిత కౌంటర్‌లో తెలిపి ఓపీ చీటీ సులువుగా స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సేవలు మంచిర్యాలలోని జీజీహెచ్‌లోనూ మొదలయ్యాయి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని