logo

పారిశ్రామిక ప్రాంతం.. ప్రచారానికి లేదు వేసవి తాపం

అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే.

Published : 23 Apr 2024 02:44 IST

ఆర్‌కే-5 గనిలో ప్రచారం చేస్తున్న భాజపా పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్‌,  పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌

న్యూస్‌టుడే, శ్రీరాంపూర్‌: అభ్యర్థుల ప్రచారానికి మండే ఎండలు అడ్డంకిగా మారాయి. కార్యకర్తలు సైతం ఎండలో బయటకు రావడానికి జంకుతున్నారు. దీంతో జనసమీకరణతో పనిలేకుండా గంపగుత్తగా ఒకేచోట వందల సంఖ్యలో ఎలాంటి ప్రయత్నం లేకుండా ఓటర్లు లభించే ప్రాంతాలు ఏవంటే అవి బొగ్గు గనులే. అభ్యర్థులకు వేసవి తాపాన్ని తీర్చే సెలయేర్లలా బొగ్గుగనులు కనిపిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి కష్టం లేకుండా షిఫ్టు సమయాలకు అరగంట ముందు వెళ్తే సరి. పెద్ద మొత్తంలో విధులకు హాజరయ్యే కార్మికులు వందల సంఖ్యలో ఒకేచోట కనిపిస్తారు. నాయకులకు వేదికలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమూ ఉండదు. గనులపై ఎక్కడికక్కడ యాజమాన్యం వేసిన వేదికలు ఉంటాయి. గని బయట ప్రచారం చేయాలన్నా షామియానాలతో పనిలేదు. బ్యాటరీతో పనిచేసే ఒక మైకు తీసుకుని పోతే సరిపోతుంది. పెద్దగా ఖర్చులేకుండా హాయిగా ఉదయం చల్లపూట ప్రచారం ముగించుకోవచ్చు.

ఖర్చులేని ప్రచారమంటే ఇదే..

బొగ్గు గనుల్లో ఉదయం ఏడు గంటలకు విధులకు హాజరయ్యే కార్మికుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఉదయం ఏడు గంటలకు మొదటి బదిలీ కార్మికులతోపాటు, జనరల్‌ షిఫ్టులో పనిచేసేవారితో కలిపి పెద్ద సంఖ్యలో కార్మికులు ఉంటారు. రాత్రి షిఫ్టులో విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు సిద్ధంగా మరికొంత మంది ఉంటారు. ఇలా ఉదయం ఏడు గంటలకు గనులపై ప్రచారానికి వెళ్లేవారికి మూడు బదిలీల్లో పనిచేసేవారు ఒక్కసారి తారసపడుతారు. నాయకులు వెళ్లి ఉపన్యాసాలు ఇవ్వడం, సమస్యల పేరిట చేతిలో చేయి కలపడం, ఇంకొంత చనువుంటే అలాయి బలాయి తీసుకోవడంతో ప్రచారం ముగుస్తుంది. అవసరమనుకుంటే పనిలో పనిగా గనులపై ఉండే క్యాంటీన్లలో కార్మికులు, కార్యకర్తలతో కలిసి నాలుగు ముచ్చట్లు చెప్పుకుంటూ అల్పాహారాన్ని పూర్తి కానిచ్చే వెసులుబాటూ ఉంటుంది. ప్రచారమంటే ఇలా ఉండాలని, కార్మికేతర క్షేత్రాల్లో పోటీచేసేవారు అసూయపడేలా బొగ్గు గనులపై నాయకులు సులభంగా పెద్ద ఖర్చులేకుండా ఎన్నికల ప్రచారం లాగించే వెసులుబాటు ఉంటుంది.

కార్మిక ఓటర్లదే నిర్ణయాధికారం

పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో అభ్యర్థుల గెలుపు ఓటములను కార్మిక కుటుంబాలే నిర్ణయిస్తాయి. పెద్దపల్లి పార్లమెంటరీ స్థానంలో మొత్తం 15,92,996 మంది ఓటర్లు ఉండగా.. అందులో కార్మికుల ఓట్లతోపాటు వారి కుటుంబ సభ్యులు, విశ్రాంతుల ఓట్లు దాదాపు సగం ఉంటాయి. సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ, ఎస్టీపీపీ, ఓరియంట్‌ సిమెంటు కర్మాగారం, సిరామిక్‌ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. ఈ పార్లమెంటు స్థానంలో పరిధిలో ఉన్న పెద్దపల్లి, ధర్మపురి మినహా మిగతా అయిదు నియోజకవర్గాల్లో కార్మిక కుటుంబాల ఓట్లే కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు కార్మిక క్షేత్రంపై దృష్టిసారిస్తూ ప్రచారం చేపట్టారు. వేసవి కాలంలో ఎండలను తట్టుకుని ప్రచారం చేయడానికి అభ్యర్థులు చెమటోడ్చాల్సి వస్తోంది. బొగ్గు గనుల ప్రాంతంలో  అభ్యర్థులకు ప్రచారం చేయడానికి గనుల ప్రాంతాలు అనువుగా కనిపిస్తున్నాయి. పెద్దపల్లి నియోజకవర్గంలోని పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలను మినహాయిస్తే, మిగతా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్లు, కార్మిక ఓటర్ల వివరాలివీ. కార్మిక కుటుంబాల్లో ఒక్కో ఇంటికి సగటున నాలుగు ఓట్ల చొప్పున లెక్కేస్తే, 1.22 లక్షల మంది ఓటర్లు ఉంటారు. వీరు కాకుండా విశ్రాంత కార్మిక కుటుంబాల ఓట్లు నాలుగు లక్షల మేరకు ఉంటాయని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని