logo

నీతి ఆయోగ్‌ పథకం.. అమలైతే అభివృద్ధి యోగం

మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం.

Published : 28 Apr 2024 03:21 IST

వస్పల్లి, దోందారి గ్రామాలకు వెళ్లే మట్టి రహదారి

న్యూస్‌టుడే, పెంబి: మారుమూల గిరిజన ప్రాంతమైన పెంబి మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. కనీస వసతులు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. వర్షాకాలం వాగులు పొంగితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే గ్రామాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెంబి మండలాన్ని అదృష్టం వరించింది. ఇటీవల ఆకాంక్షిత బ్లాకుల అభివృద్ధి కార్యక్రమం (యాస్పిరేషనల్‌ బ్లాక్‌ డెవలప్‌మెంట్‌)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలో అభివృద్ధికి నోచుకోని 500 మండలాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణలోని 10 మండలాలకు చోటు దక్కింది. నూతనంగా ఏర్పడిన నిర్మల్‌ జిల్లా నుంచి పెంబి మండలం ఒక్కటే ఎంపిక కావడం విశేషం. దీంతో మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలకు సమస్యలు తీరతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని రంగాల్లో ప్రగతే లక్ష్యం

దేశంలో వెనకబడిన మారుమూల ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2018లో యాస్పిరేషనల్‌ జిల్లా డెవలప్‌మెంట్‌ కార్యక్రమం ప్రారంభించింది. ఆ సమయంలో జిల్లాలను ఎంపిక చేసుకొని వాటిని అభివృద్ధి చేసింది. అవి సత్ఫలితాలు ఇవ్వడంతో కొనసాగింపుగా బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ప్రారంభించింది. ఇందులో భాగంగా మండలాలను ఎంపిక చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా 500 బ్లాకులను గుర్తించింది. తెలంగాణలో 10 మండలాలను ఎంపిక చేయగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మూడు మండలాలకు చోటు దక్కింది.

అయిదు అంశాలపై ప్రత్యేక దృష్టి

నీతి ఆయోగ్‌ పథకం ద్వారా వీటిని ఆదర్శ మండలాలుగా తీర్చిదిద్దడం కోసం అధికారులు బృందాలుగా ఏర్పడి విద్య-ఆరోగ్యం, పోషణ, వ్యవసాయం-నీటి వనరులు, సామాజిక స్థితిగతులు, ప్రాథమిక మౌలిక సదుపాయాలు అనే అయిదు అంశాలను 39 కొలమానాలుగా విభజించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దీనికోసం కొన్ని రోజులుగా ఆయా గ్రామాల్లో పర్యటించి వెనకబాటుకు గల కారణాలపై గ్రామాల్లో సభలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు లబ్ధిదారులకు అందేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

గ్రామాల్లో పరిస్థితి అధ్వానం

పెంబి మండలంగా ఏర్పడి తొమ్మిదేళ్లయినా గడుస్తున్నా అభివృద్ధి చెందడం లేదు. మండల కేంద్రం నుంచి గ్రామాలకు రోడ్డు, తాగునీరు, విద్యుత్తు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వర్షాకాలంలో వాగులు పొంగడంతో మండల కేంద్రానికి సంబంధాలు తెగిపోతున్నాయి. అత్యవసర వైద్యం అందక మరణాలు సైతం సంభవిస్తున్నాయి. నీతి అయోగ్‌ పథకంలో మండలం ఎంపికతో వాగులపై వంతెనలు నిర్మించి రోడ్డు, విద్యుత్తు, వైద్యం, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిస్తే బాగుంటుంది.

గాంధారి లింగన్న, ఎంగ్లాపూర్‌ గ్రామం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని