logo

ఓటర్లు @ 15,96,430

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది.

Published : 28 Apr 2024 03:26 IST

పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలో తేలిన లెక్క
సవరణల తర్వాత తాజా జాబితా విడుదల
న్యూస్‌టుడే, మంచిర్యాల విద్యావిభాగం

ఓటు నమోదు దరఖాస్తు స్వీకరిస్తున్న సిబ్బంది (పాతచిత్రం)

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా కొలిక్కివచ్చింది. కొద్ది రోజులుగా క్షేత్ర స్థాయిలో అధికారులు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి నుంచి కొత్తగా స్వీకరించిన దరఖాస్తుల వడబోత చేపట్టారు. అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించారు. మృతులు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని తొలగించారు. తాజా ఓటరు జాబితాను అధికారులు ప్రచురించారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో 7,87,705 మంది పురుషులు, 8,08,622 మంది మహిళలు, 103 మంది ఇతరులు కలుపుకొని మొత్తం 15,96,430 మంది ఓటర్లున్నారు. ఏడు నియోజకవర్గాల్లో కొత్తగా 12,194 మంది ఓటు హక్కు పొందగా, వివిధ కారణాలతో 11,858 మందిని తొలగించారు.

కొత్తగా 12,194 మందికి చోటు

ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. విద్యాసంస్థల్లో ఎలక్టోరల్‌ క్లబ్‌లతో చైతన్యం చేశారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించారు. దీంతో కొత్తగా 12,194 మందికి ఓటు హక్కు లభించింది. పట్టణ ప్రాంతాలైన రామగుండంలో 2,465 మంది, మంచిర్యాలలో 2,445 మంది ఓటు హక్కు పొందారు. రెండేసి చోట్ల ఓటు, మృతులు, ఉపాధి కోసం ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడే శాశ్వతంగా నివసిస్తున్న వారు.. ఇలా మొత్తం 11,858 మందిని జాబితా నుంచి తొలగించారు. మంచిర్యాలలో 3,169, రామగుండంలో 4,713 మందిని తొలగించారు.

మంచిర్యాలలో అత్యధికం

లోక్‌సభ పరిధిలో పెద్దపల్లి జిల్లాలో రామగుండం, మంథని, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల నియోజకవర్గాలున్నాయి. అత్యధికంగా మంచిర్యాలలో 2,78,738 మంది ఓటర్లుండగా, అత్యల్పంగా బెల్లంపల్లిలో 1,76,514 మంది ఓటర్లున్నారు. మంచిర్యాల తర్వాత పెద్దపల్లి సెగ్మెంట్‌లో 2,57,192 మంది ఓటర్లున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని