logo

భాజపాకు కలిసొచ్చేనా?

పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

Published : 30 Apr 2024 02:52 IST

ఎట్టకేలకు కమలదళంలో చేరిన ఎంపీ వెంకటేశ్‌నేత

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి డా.నరేష్‌తో చర్చిస్తున్న ఎంపీ వెంకటేశ్‌నేత

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. వెంకటేశ్‌నేతతోపాటు ప్రస్తుత అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌ నేతకాని సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయా కులసంఘం ఓట్లన్నీ భాజకు కలిసివస్తాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

బొర్లకుంట వెంకటేశ్‌నేత స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డిప్యూటీ ప్రొహిబిషన్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌. రాజకీయాలపై ఆసక్తి, ప్రజలకు సేవ చేయాలని 2018లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజుల్లోనే చెన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్‌ దక్కించుకున్నారు. బాల్క సుమన్‌కు గట్టిపోటీనిచ్చి ఓటమిపాలయ్యారు. అనంతరం 2019 పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి చివరి నిమిషంలో పెద్దపల్లి పార్లమెంట్‌ తెరాస(ప్రస్తుత భారాస) అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. అనూహ్యంగా విజయం సాధించి తొలిసారి ప్రజాప్రతినిధిగా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారాస అధికారం కోల్పోవడం, ఈసారి పెద్దపల్లి నియోజకవర్గ టికెట్‌ లభించడం కాస్త కష్టమనే అనుమానం, వచ్చినా ఓడినా పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే కారణంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. టికెట్‌ వస్తుందనే ఆశతో హస్తం గూటికి వచ్చినా నిరాశే మిగిలింది. ఆ పార్టీ కార్యకలాపాలకు మొదటి నుంచే దూరంగా ఉండటం, కొద్దిరోజుల నుంచి భాజపాలో చేరి పోటీలో ఉంటారనే ప్రచారం సైతం తీవ్రంగా జరిగింది. కాషాయం పార్టీ ముందుగా ప్రకటించిన విధంగానే అభ్యర్థిని కొనసాగించడంతో ఉత్కంఠ తొలగింది. ఆయన మార్పు కూడా ఉండదని తేలింది. కానీ హఠాత్తుగా సోమవారం కేంద్ర మంత్రుల సమక్షంలో కమలంగూటికి చేరారు.

సామాజికవర్గం ఓట్ల సమీకరణకేనా..

వెంకటేష్‌నేత చేరికతో పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల్లో లాభం చేకూరుతుందని భాజపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గంలో నేతకాని సామాజికవర్గం ఓట్లు భారీగా ఉండటం, ప్రస్తుత అభ్యర్థితో పాటు వెంకటేశ్‌నేత కూడా ఇదే వర్గానికి చెందినవారు కావడంతో ఆయా కులసంఘం ఓట్లన్నీ చీలకుండా ఉంటాయనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో పాటు ఏడు నియోజకవర్గాల్లో నేతకంటూ ప్రత్యేక వర్గం, అనుచరగణం ఉండటం, ఆయా నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరేందుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

భవిష్యత్తు కోసమేనా..

రెండు పార్టీల నుంచి టికెట్‌ అశించినా నిరాశే మిగలడం, భాజపాతోనే తన రాజకీయ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన దగ్గరి అనుచరులు చెబుతున్నారు. ఈ ఎన్నికలతో పాటు రానున్న అయిదేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి భాజపాను బలోపేతం చేసేత తనకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌తో పాటు మూడు అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాలు ఉండటం, ఈ రెండింటిలోనూ తనకు పట్టు ఇప్పటికే ఉండటంతో ఖచ్చితంగా అవకాశం లభిస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు