logo

అగ్రనేతలొస్తున్నారు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది.

Published : 30 Apr 2024 03:14 IST

పట్టు కోసం ప్రధాన పార్టీల కసరత్తు

  • మే 5 నిర్మల్‌ రాహుల్‌గాంధీ
  • మే 4 మంచిర్యాల కేసీఆర్‌
  • మే 2 ఆసిఫాబాద్‌ రేవంత్‌రెడ్డి

ఈటీవీ - ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. ఆదిలాబాద్‌, పెద్దపల్లి లోక్‌సభ స్థానాలతో విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, భారాసలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా విడుదలైన జాబితా ప్రకారం 16,50,175 మంది ఓటర్లతో ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం విస్తరించి ఉంటే పెద్దపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లా(మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు శాసనసభ స్థానాలతో కలిపి) 6,49,030 ఓటర్లను కలిగి ఉంది. ఉమ్మడిజిల్లాను పరిగణనలోకి తీసుకుంటే 22,99,205 ఓటర్లను కలిగి ఉంది. ప్రతిఓటు కీలకమైనందున అగ్రనేతల ప్రచారంపై దృష్టి సారించారు.

కాంగ్రెస్‌ వ్యూహం

ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ఏప్రిల్‌ 22న ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనతో ఎన్నికల శంఖారావం పూరించిన కాంగ్రెస్‌ ఇప్పుడు కుమురంభీం, నిర్మల్‌ జిల్లాలపై దృష్టి సారించింది. మే 2న ఆసిఫాబాద్‌లో రేవంత్‌రెడ్డి సభతో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి)లో నియోజకవర్గాల్లో భారాసపై, 5న అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనతో నిర్మల్‌లో భాజపాపై పైచేయి సాధించేలా వ్యూహరచన చేస్తోంది. ఖానాపూర్‌, ముథోల్‌, నిర్మల్‌ నియోజకవర్గాలతో కలిపి 7,37,416 ఓట్లు కలిగిన నిర్మల్‌ జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ప్రియాంకగాంధీ ఖానాపూర్‌ పర్యటన సత్ఫలితాన్నిచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్‌ ఇప్పుడు రాహుల్‌ పర్యటనతో నిర్మల్‌ జిల్లాపై దృష్టి సారించింది. జిల్లాకో పర్యటన చొప్పున ఇప్పటికే ఆదిలాబాద్‌ పూర్తి చేసిన సీఎం మే 2న ఆసిఫాబాద్‌, 5న రాహుల్‌తో కలిసి నిర్మల్‌ పర్యటన పూర్తి చేస్తే పెద్దపల్లి పరిధిలోకి వచ్చే మంచిర్యాల జిల్లా పర్యటన ఖరారు చేయాల్సి ఉంటుంది.

కేసీఆర్‌ భరోసా

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఏప్రిల్‌ 16న ఆదిలాబాద్‌లో ఆత్రం సక్కు తరఫున శంఖారావం పూరించగా ఆ పార్టీ అగ్రనేత కేసీఆర్‌ మే 4న పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ తరఫున మంచిర్యాలలో నిర్వహించే రోడ్‌షో ఖరారైంది. పార్టీకి బలమున్న ఆసిఫాబాద్‌, బోథ్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గాలతో కలిపి శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చెదరకుండా చూసుకోవాలని భారాస భావిస్తోంది. కేసీఆర్‌ బస్సు యాత్రలో ఆదిలాబాద్‌ జిల్లా లేదు. బస్సుయాత్ర ముగిశాక హెలిక్యాప్టర్‌ ద్వారా ఆదిలాబాద్‌, నిర్మల్‌లో కేసీఆర్‌ పర్యటన, మరో నేత హరీశ్‌రావుతో ఆదిలాబాద్‌, కేటీఆర్‌తో ఆసిఫాబాద్‌లో ప్రచార సభలు నిర్వహించాలని భారాస ప్రణాళిక చేస్తోంది.

భాజపా ప్రయత్నం

ఆదిలాబాద్‌లో పార్టీ అభ్యర్థి గోడం నగేష్‌ గెలుపును భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. సిట్టింగ్‌ స్థానమే కాకుండా మొన్నటి శాసనసభ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించినందున ఓటరు నాడి అనుకూలంగా ఉందనే ధీమా నేతల్లో ఉంది. కానీ కాంగ్రెస్‌, భారాస అగ్రనేతలు జరిపే పర్యటనలకు దీటుగా సభలు నిర్వహించాలని భావిస్తోంది. ఏప్రిల్‌లో ఆదిలాబాద్‌లో జరగాల్సిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, విదేశాంగ మంత్రి శివశంకర్‌ పర్యటనలు రద్దు కావటంతో మే మొదటి వారంలో ప్రధాని మోదీ, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి, కేంద్రమంత్రి అమిత్‌షా సభలను ఖరారు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. అనుకూలిస్తే  ఆసిఫాబాద్‌ - కాగజ్‌నగర్‌ కలిసేలా మోదీ, ఆదిలాబాద్‌ ఉట్నూర్‌ కలిసేలా యోగి, నిర్మల్‌ ముథోల్‌ కలిసేలా అమిత్‌షా సభలను ఏర్పాటుచేయాలని భావిస్తోంది. మంచిర్యాల జిల్లాలో రాష్ట్ర నాయకులతో ప్రచారం చేయిస్తే చాలన్నట్లుగా చూస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని