logo

సీఏం జగన్‌ మోసానికి రెండేళ్లు

‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  28 ఏప్రిల్‌ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు.

Updated : 29 Apr 2024 05:16 IST

సాక్షాత్తూ  ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదు.. 
తాడి తరలింపు ఎప్పుడో..?

 పరవాడ, న్యూస్‌టుడే :  ‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  28 ఏప్రిల్‌ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు. ఈనెల 28 నాటికి రెండేళ్లవుతున్నా ఒక్క ఇటుక కూడా పడలేదు. సాక్షాత్తూ సీఎం జగన్‌ ఇచ్చిన హామీయే అమలుకు నోచుకోకపోతే తమ సమస్యల పరిష్కారానికి ఎవరికి మొర పెట్టుకోవాలని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడిని తరలించేవరకు ఓటింగ్‌లో పాల్గొనబోమని గతనెల 28న గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మానం చేసి జిల్లా ఉన్నతాధికారులకు అందజేసినా చలనం లేదు.

కాలుష్య కాసారంతో ఇక్కట్లు

ఫార్మాసిటీ కాలుష్యం తాడి గ్రామస్థులను గత 15 ఏళ్లుగా వెంటాడుతోంది. పరిశ్రమల నుంచి వచ్చే మందుల వాసన, విషవాయువుల కారణంగా తరచూ అనారోగ్యబారిన పడుతున్నామని, పలు పరిశ్రమల్లో  భారీ పేలుళ్లు, గ్యాస్‌ లీకేజీలు సంభవించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య భూతాన్ని తట్టుకోలేక 50 కుటుంబాల వారు వేరే గ్రామాలకు తరలిపోయారు.

తెదేపా జీవోకు వైకాపా ఉరి..

తాము అధికారంలోకి వస్తే తాడిని తరలిస్తామని 2014 ఎన్నికల ముందు తెదేపా హామీ ఇచ్చింది. గెలిచిన తర్వాత అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తాడి సమస్యను అప్పటి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తరలింపు ప్రక్రియను వేగవంతం చేయించారు. గ్రామ సభలు పెట్టి ప్రజల అభిప్రాయాలను అధికారులు తెలుసుకున్నారు. గ్రామాన్ని పెదముషిడివాడలో ఉన్న ప్రభుత్వ స్థలంలోకి తరలించి పునరావాసం, భవన నిర్మాణాలు, పరిహారం చెల్లించడానికి ఆర్‌అండ్‌ఆర్‌ నిధులు రూ.57.63 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసింది. అనంతరం వైకాపా ప్రభుత్వం ఏర్పడటంతో ఆ జీవోకు బ్రేక్‌ పడింది.

ఫార్మాసిటీని ఆనుకుని ఉన్న తాడి గ్రామం


జగన్‌ హామీని నమ్మి మోసపోయాం..

ఫార్మాకాలుష్యంతో అల్లాడిపోతున్నాం. ఘాటైన మందుల వాసనతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. ప్రభుత్వం కనీసం శుద్ధినీటిని కూడా సరఫరా చేయడం లేదు. ఉపాధి కూడా కరవైంది. జగన్‌ మాటలు నమ్మి మోసపోయాం. వైకాపా ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదు.

- కోమటి కులదీప్‌రాజు, తాడి


ఎమ్మెల్యే మాటలు నీటి మూటలే..

సీఎం జగన్‌ హామీ ఇచ్చినా తాడి గ్రామస్థులకు విముక్తి కలగలేదు. ల్యాండ్‌ఫిల్‌ విస్తరణ పేరుతో మరో కాలుష్య కుంపటి గ్రామస్థులపై మోపడం దుర్మార్గం. ఎమ్మెల్యే అదీప్‌రాజు తాడి తరలింపు జీవో పట్టుకుని గ్రామానికి వస్తానని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. గ్రామంలో కనీసం ఆరోగ్య శిబిరాలు పెట్టడం లేదు.

- గనిశెట్టి సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని