logo

ఓటేయాలంటే.. తుమ్మిలేరులో తంటాలే

గోదావరి తీరంలో.. రహదారి సౌకర్యంలేని, మారుమూల పాపికొండల్లో ఉన్న చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన పోలింగ్‌ కేంద్రం ఉంది.

Published : 29 Apr 2024 01:43 IST

ఎన్నికల నిర్వహణకు వెళ్తున్న అధికారులు (పాత చిత్రం)

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే : గోదావరి తీరంలో.. రహదారి సౌకర్యంలేని, మారుమూల పాపికొండల్లో ఉన్న చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన పోలింగ్‌ కేంద్రం ఉంది. ఎన్నికల నిర్వహణ సిబ్బంది వెళ్లాలన్నా, ఓటర్లు ఓట్లు వేయాలన్నా.. పడవ ఎక్కితేనే అక్కడికి చేరగలరు. ఆ గ్రామాలకు సెల్‌ఫోన్‌ సంకేతాలు అందవు. అక్కడ ఏమి జరిగినా... బాహ్య ప్రపంచానికి తెలియడానికి గంటల సమయం పడుతుంది. విద్యుత్తు సౌకర్యం లేదు. కేవలం సౌర  దీపాల వెలుతురే వారికి దిక్కు. 

వరరామచంద్రాపురం మండలంలోని తుమ్మిలేరు పోచవరం పంచాయతీలో పోచవరం, తుమ్మిలేరు, కొండేపూడి, కొల్లూరు, గొందూరు గ్రామాలున్నాయి. వీటిలో పోచవరం మినహా ఏ గ్రామానికీ రహదారి సౌకర్యంలేదు. పోచవరం నుంచి పడవ లేదా లాంచీలో ప్రయాణిస్తే తప్ప ఆ గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి. మొత్తం 450  ఓటర్లున్న ఈ పంచాయతీకి రెండు పోలింగ్‌ కేంద్రాలను అధికారులు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేశారు. పోచవరంలో ఒకటి, తుమ్మిలేరు కొండపైనున్న  పాఠశాలలో మరోటి అందుబాటులో ఉంచారు. పోచవరం గ్రామంలో వారికి ఇబ్బందులు లేవు. తుమ్మిలేరులో ఓటేయాలంటే మాత్రం చుక్కలు  కనిపిస్తాయి. ఇందులో తుమ్మిలేరు, కొల్లూరు, గొందూరుకు చెందిన దాదాపు 250 మంది ఓటుహక్కు  వినియోగించుకుంటారు. వీరంతా గోదావరి గట్లు ఎక్కి, దిగి... పడవల్లో ప్రయాణం చేసి, కొండపైకి ఎక్కి ఓటేసి, కిందికి దిగిరావాలి. ఒక్క అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు మాత్రమే తుమ్మిలేరు పోలింగ్‌ కేంద్రం ఉంటుంది. పంచాయతీ ఎన్నికలకు వారంతా పోచవరం పోలింగ్‌ కేంద్రానికి రావాల్సిందే. ఇటీవలే ఈ కేంద్రాన్ని రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ పరిశీలించి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని