logo

ఇక కట్టలేవులే.. వెళ్లు!

విజయవాడ సెంట్రల్‌ పేదలకు జగనన్న కాలనీ పేరుతో వెదురుపావులూరులో 3,702 మందికి నివేశన స్థలాలు (సెంటు) కేటాయించారు. కొండలను తవ్వి లేఔట్‌ వేశారు. ఇక్కడ మెరక చేయడానికి రూ.కోట్లు ఖర్చు చేశారు.

Updated : 22 Apr 2024 06:11 IST

గృహ నిర్మాణ మంత్రి జిల్లాలోనూ జగనన్న కాలనీలకు దురవస్థే
మౌలిక వసతులు లేక ఏకంగా గృహాలకు తాళాలు
నిరుపేద గూడుకు జగనే గ్రహణం
ఈనాడు, అమరావతి

‘‘ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం.. నిరుపేద కల నెరవేరుస్తున్నాం.. ప్రతి అక్కచెల్లెమ్మకూ గృహ సౌభాగ్యం కల్పిస్తున్నాం’’

- ఊరూరా ఊదరగొట్టిన సీఎం జగన్‌


‘‘స్వస్థలాలకు సుదూరంగా స్థలాలు.. మెరక పేరిట అవినీతి మరకలు.. నీరు లేదు.. దారి లేదు.. విద్యుత్తు లేదు.. రవాణా లేదు.. ఒకటా రెండా ఐదేళ్లు వెలగబెట్టారు. మమ్మల్ని అప్పుల్లో ముంచారు.. ఇక మీ వల్ల కాదులే.. వెళ్లమని ప్రజలు ఛీదరించుకుంటున్నారు.’’

- జగనన్న కాలనీ దీనస్థితిపై పేదల వేదన

విజయవాడ సెంట్రల్‌ పేదలకు జగనన్న కాలనీ పేరుతో వెదురుపావులూరులో 3,702 మందికి నివేశన స్థలాలు (సెంటు) కేటాయించారు. కొండలను తవ్వి లేఔట్‌ వేశారు. ఇక్కడ మెరక చేయడానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. కానీ ఈ మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఒక్క ఇల్లూ పూర్తి కాలేదు. పునాదులకే పరిమితం. ఇలాంటి లే ఔట్లు చాలా ఉన్నాయి. మైలవరం పరిధి చంద్రాలలో ఆదర్శకాలనీ అంటూ గృహప్రవేశాలు చేశారు. వసతులు విస్మరించడంతో అప్పు చేసి ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులు గృహాలకు తాళాలు వేసుకున్నారు.


న్టీఆర్‌ జిల్లాలో జగనన్న కాలనీల పేరుతో 291 లేఔట్‌లు వేశారు. ఎన్టీఆర్‌ జిల్లావాసులకు కృష్ణా జిల్లా పరిధిలోనూ లేఔట్లు వేశారు. విజయవాడ తూర్పు పేదలకు పెనమలూరు మండలం వణుకూరు, గొడవర్రు, గన్నవరం మండలం కొండపావులూరులో లేఔట్లు వేశారు. సెంట్రల్‌ వారికి అక్కడే వేశారు. కొన్ని నున్న పరిధిలో వేశారు. పశ్చిమ పేదలకు వెలగలేరు వద్ద వేశారు. మొత్తంగా 83,485 గృహాలు. జియో ట్యాగింగ్‌ చేయని వాటిని జాబితా నుంచి తొలగించారు. గృహనిర్మాణాలు చేపట్టి మూడున్నరేళ్లు అవుతున్నా.. పనులు సాగడం లేదు. కొందరు సొంత ఖర్చులతో నిర్మాణం పూర్తి చేసుకున్నా.. మౌలిక వసతులు లేక ఇళ్లకు తాళాలు వేసుకున్నారు.


యాడున్నారు.. జోగీ?

రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పెడనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పెనమలూరు నుంచి పోటీకి దిగుతున్నారు. ఈ జిల్లా మంత్రి అయినా గృహ నిర్మాణంలో పురోగతి అట్టడుగునే ఉంది. జూ కృష్ణా జిల్లాలో జగనన్న కాలనీల పేరుతో 690 లేఔట్లు వేశారు. అందులో 175 లేఔట్లు ఇంకా ప్రారంభించలేదు. 91,295 గృహాలు మంజూరవగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేయని వాటిని జాబితా నుంచి తొలగించారు. గృహనిర్మాణాలు చేపట్టి మూడున్నరేళ్లు అవుతున్నా.. పనులు సాగడం లేదు. కొందరు సొంత ఖర్చులతో నిర్మాణం పూర్తి చేసుకున్నా.. మౌలిక వసతులు లేక ఇళ్లకు తాళాలు వేసుకున్నారు.

  • మెరక, ఇతర పనులకు రూ.97.76 కోట్లు మంజూరు చేయగా కొన్ని ఉపాధి హామీ పనులు ఉన్నాయి. కొన్నింట మినహా చిన్న వర్షానికే కాలనీలు మునుగుతున్నాయి. కరగ్రహారం లేఔట్‌ది ఇదే తీరు.
  • బందరులో కరగ్రహారం లేఔట్‌ జిల్లాలోనే అతిపెద్దది. సముద్రం ఒడ్డున ఈ లేఔట్‌ వేశారు. సుమారు 5 వేల గృహాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. బందరు పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలను కేటాయించారు. నగర పరిధిలో కేవలం సెంటు స్థలమే పంపిణీ చేశారు.
  • అవనిగడ్డ, పామర్రు పరిధిలో పలు ప్రాంతాల్లో గుడ్లవల్లేరు, గుడివాడ ప్రాంతాల్లో లేఔట్లు ముంపునకు గురవుతున్నాయి. ఇంటి నిర్మాణానికి వాహనాలు లేఔట్‌ వరకు వెళ్లే పరిస్థితి లేదు. అంతర్గత రహదారులు నిర్మించాలి. 670 లేఔట్లలో గ్రామీణ నీటిసరఫరా విభాగం నీటి వసతి కోసం రూ.55.94 కోట్లు, ప్రజారోగ్య శాఖ నుంచి 9 లేఔట్లకు రూ.8.94 కోట్లు మంజూరు చేశారు. 60 శాతం కాలనీలకు విద్యుత్తు వసతి లేదు. లబ్ధిదారులతో గృహప్రవేశాలకు ఒత్తిడి రాగా బందరు మండలం మేకవారిపాలెం లే ఔట్‌ కొంత పూర్తి చేశారు.


గృహ నిర్మాణ మంత్రి జోగి రమేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నియోజకవర్గానికి 15,920 గృహాలను మంజూరు చేయగా.. 15,683 గృహాల జియోట్యాగింగ్‌ పూర్తి చేశారు. 10,473 పునాదుల్లోనే ఉన్నాయి. పునాదులు దాటిన ఇళ్లు 2,342 ఉన్నాయి.


మా లేఔట్లో రోడ్లు వేయలేదు. నీరు నిలిచిపోతోంది. దారిలేక ఇబ్బంది పడుతున్నారు. నిర్మాణ దశలో ఉన్న గృహాలకు మెటీరియల్‌ సమకూర్చుకోవాలంటే మార్గం లేక దూరంగా డంప్‌ చేసుకోవాల్సి వస్తోంది.కాలువలు లేకపోవడంతో తాగినీటి పైపులైను పగిలిపోయి అంతర్గత తాత్కాలిక మట్టి రోడ్లపై నీరు నిలిచింది.

 రావుల నవీన్‌, కొండిపర్రు, న్యూస్‌టుడే, పామర్రు గ్రామీణం


ఇళ్లే లేని కాలనీ

నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే: నందిగామ మండలం సోమవరంలో 1.10 ఎకరాలు కొనుగోలు చేసి 44 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ రహదారులు వేశారు. విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు. బోరు వేసినా.. నీరు పడలేదు. ఫలితంగా ఇద్దరు కష్టపడి బేస్‌మట్టం వరకు నిర్మించి వదిలేశారు. లేఔట్‌ పల్లంగా ఉంది. వర్షాకాలంలో నీరు చేరుతోంది.


విజయవాడ పేదల కోసం జి.కొండూరు మండలం హెచ్‌.ముత్యాలంపాడులో 180 ఎకరాలు సేకరించారు. గ్రామానికి దూరంగా, బుడమేరు వాగు పక్కనే నివాసాలకు అంతగా అనువుగాని భూముల్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతం పలుమార్లు వరదల్లో మునగడంతో, రూ.లక్షలు వెచ్చించి తోలిన మెరక అంతా కొట్టుకుపోయింది. ఇళ్ల నిర్మాణం పునాది స్థాయిని దాటలేదు.

న్యూస్‌టుడే, మైలవరం


బందరు మండలం మేకావానిపాలెం జగనన్న కాలనీ లే ఔట్‌లో గృహప్రవేశాలు చేశారు. 165 మందికి (సెంటున్నర) పట్టాలు ఇచ్చారు. 78 మంది గృహ ప్రవేశాలు చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని వసతులకు రూ.7.31 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రెండు సీసీ దారులు వేయాలి. అంతర్గత డ్రెయిన్లు వేయలేదు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలోకి వాడుక నీరు వదులుతున్నారు. ఎక్కువ వాడకం ఉన్న గృహాల వద్ద గుంత నిండి ఆ నీరు దారులపైకి వస్తోంది. మౌలిక వసతులు లేక చాలా మంది ఇళ్లలో చేరడం లేదు.


గుడివాడ సమీపంలోని మల్లాయపాలెం వద్ద 77 ఎకరాల్లో లేఔట్‌ వేసి 7,007 మందికి స్థలాలిచ్చారు. 4,129 మందికి రుణాలు మంజూరు చేయగా 894 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. 1042 మంది ప్రారంభించలేదు. రోడ్లు, డ్రెయిన్లు లేవు. వర్షం వస్తే రహదారులన్నీ కాలువల్ని తలపిస్తాయి. ఇళ్లలోకి నీరు చేరుతుంది. రాతి పొడి, బూడిదతో రహదారులు వేయగా భారీ గుంతలు పడి దారుణంగా తయారయ్యాయి.

న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం


ది బాపులపాడు మండలం మారుమూలన ఉన్న రేమల్లె లేఔట్‌. 250 మందికి ఇక్కడ స్థలాలు ఇచ్చి ఇళ్లు మంజూరు చేశారు. రహదారులు, కాలువలు, నీరు తదితర మౌలిక వసతులు లేవు. దీంతో 30 మంది కూడా గృహాలు నిర్మించలేదు.

న్యూస్‌టుడే, హనుమాన్‌జంక్షన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని