icon icon icon
icon icon icon

ప్రభుత్వాన్ని అంగుళం కూడా కదిలించలేరు

‘‘రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా పన్నాగం పన్నుతోంది. అందుకే 400 సీట్లు గెలవాలని చూస్తోంది. దళితుల హక్కులను కాలరాయాలని చూస్తోంది.

Published : 04 May 2024 03:33 IST

భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లకు పోటు ఖాయం
సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు- కరీంనగర్‌, పెద్దపల్లి, ఈనాడు డిజిటల్‌-సిరిసిల్ల: ‘‘రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా పన్నాగం పన్నుతోంది. అందుకే 400 సీట్లు గెలవాలని చూస్తోంది. దళితుల హక్కులను కాలరాయాలని చూస్తోంది. ఆ పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్లకు పోటు తప్పదు. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోంది. రాహుల్‌ గాంధీని ప్రధాని చేస్తేనే మేలు జరుగుతుంది’’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు.

నిధులు ఇవ్వాల్సి వస్తుందనే..

బ్రిటిష్‌ కాలం నుంచి ప్రతి పదేళ్లకోసారి దేశంలో జనగణన చేపట్టారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2021లో జనగణన చేయలేదు. రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పెద్ద కుట్ర దీని వెనుక దాగి ఉంది. జనగణనతోపాటు కులగణన డిమాండ్‌నూ మోదీ సర్కారు పట్టించుకోలేదు. జోడో యాత్రలో రాహుల్‌ గాంధీని బీసీలు కలిసి.. తమ జనాభాకు తగ్గట్టుగా విద్యావకాశాలు, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అధికారంలోకి వస్తే కులగణనతోపాటు రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని రాహుల్‌ భావించారు. దేశంలో కులగణన, జనగణన జరిగితే నిధులివ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే భాజపా వ్యతిరేకిస్తోంది.

భాజపాపై మౌనమెందుకు?

భాజపా రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు కేటీఆర్‌ చెప్పాలి. కేసీఆర్‌, మోదీలది ఒక్కటే నినాదం. 2022 ఫిబ్రవరిలో కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు భాజపా కూడా అదే విధానంతో ముందుకెళ్తోంది. పదేళ్లుగా మోదీకి వ్యతిరేకంగా భారాస ఏ కార్యక్రమాలూ చేయలేదు. తెలంగాణపై ఆయన దాడి చేస్తుంటే కేసీఆర్‌ పరోక్షంగా సమర్థిస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న వ్యక్తి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మా ప్రభుత్వానికి సలహాలు ఇస్తారనుకున్నా. ఎలాంటి సలహాలూ ఇవ్వకపోగా.. అప్పుడే మమ్మల్ని అధికారంలో నుంచి దిగిపోవాలంటున్నారు. పదేళ్లు దేశాన్ని ఏలుతున్న మోదీని ఎందుకు దిగిపొమ్మనడం లేదు? పైగా 10-12 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో చక్రం తిప్పుతానంటున్నారు. గతంలో ఓసారి 9, మరోసారి 12 ఎంపీ సీట్లు గెలిచిన భారాస.. భాజపా ప్రవేశపెట్టిన బిల్లులకు సహకరించింది తప్ప.. ఏమీ చేయలేదు. ఈసారి ఒకట్రెండు గెలిచినా మోదీకి అమ్ముకోవాలని ఆలోచిస్తున్నారు.

సిరిసిల్ల చీడ వదిలిస్తాం

వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన చీడను వదిలిద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో మహేందర్‌రెడ్డి గెలిస్తే ఇక్కడి నేతన్నలకు ఇంకా మేలు జరిగేది. గత ప్రభుత్వంలో రూ.20 లక్షల కోట్లు ఖర్చు చేసి.. రూ.7 లక్షల కోట్ల అప్పు మిగిల్చారు. చేనేత కార్మికులవి రూ.275 కోట్ల బకాయిలుంటే.. రూ.50 కోట్ల వరకు ఇచ్చాం. ఎన్నికల కోడ్‌ ఎత్తేశాక మిగతావి అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు అధ్వానంగా మారింది. మేడిగడ్డ మేడిపండైంది. సుందిళ్ల ఎట్లుందో తెలియదు. అన్నారం ఆగమైంది. మధ్యమానేరు ముంపు బాధితులకు కూడా  కేసీఆర్‌ న్యాయం చేయలేదు. ఎన్నికలయ్యాక అన్ని సమస్యల్ని పరిష్కరిస్తా. కరీంనగర్‌ ఎంపీగా రాజేందర్‌రావును గెలిపిస్తే నేతవస్త్రాలపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని ఆయన సహకారంతో తీసివేయించేలా కృషి చేస్తా.

ఆ పార్టీలకు ఓట్లడిగే హక్కులేదు

భారాస, భాజపాలకు ఈ ఎన్నికల్లో ఓట్లడిగే హక్కులేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి సెగ్మెంట్‌లో ప్రజలు తిరస్కరించిన వ్యక్తినే భారాస పెద్దపల్లి ఎంపీ బరిలో దించింది. కొప్పుల ఈశ్వర్‌ వ్యవహారం ప్రజలకు తెలుసు. ఆయన్ని ఓడించి గడ్డం వంశీని రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించండి. సింగరేణి కార్మికుల సమస్యల్ని భారాస, భాజపా పట్టించుకోలేదు’’ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాజారాంపల్లి సభలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కరెంట్‌ కోతలపై భారాస అనవసరమైన రాద్ధాంతం చేస్తోందన్నారు. సిరిసిల్ల సభలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యానికి భాజపా రూపంలో ముప్పు ఎదురవుతోందన్నారు. కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, వివేక్‌, వినోద్‌, ప్రేమ్‌సాగర్‌రావు, విజయరమణారావు, మక్కాన్‌సింగ్‌, మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల సభలో 11 మంది కరీంనగర్‌ భారాస కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎవరెవరో ఏదో చేస్తామంటున్నారు. ఏమీ చేయలేరు. పదేళ్లూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది. అంగుళం మందం కూడా ఎవరూ కదిలించలేరు. కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి.. భుజాలు కాయలు కాసేలా జెండా మోసి.. రాష్ట్రంలో పార్టీని అధికారాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వానికి ఏమైనా అయితే ఊరుకోరు.

సీఎం రేవంత్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img