icon icon icon
icon icon icon

రాష్ట్రాన్ని ముంచేందుకు మోదీ, రేవంత్‌ల కుట్ర

ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారని.. వాటిని అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

Published : 04 May 2024 03:36 IST

భాజపా పాలనలో మత విద్వేషాలు తప్ప ఏమీ లేదు
గోదావరి జలాలు తరలిస్తానంటే సీఎం మాట్లాడరెందుకు?
చేనేత కార్మికుల కష్టాలపై ప్రశ్నించినందుకే నాపై నిషేధం
గోదావరిఖని రోడ్‌షోలో కేసీఆర్‌

గోదావరిఖని, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారని.. వాటిని అడ్డుకోవాలంటే తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలని మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా శుక్రవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్దన్న అంటారు. గోదావరి నీళ్లు తీసుకుపోతానంటే మాట్లాడరు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. వీటిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలి. పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అన్నారు. దేశం సత్యనాశ్‌ అయింది. డాలర్‌ ముందు రూపాయి విలువ రూ.84. ఏ ప్రధాని హయాంలోనూ రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలేదు. జన్‌ధన్‌ ఖాతాలో రూపాయి వచ్చిందా. రూ.15 లక్షలు మీ ఖాతాలోకి వస్తాయన్నారు.. వచ్చాయా. నరేంద్రమోదీ పాలనలో మత విద్వేషాలు తప్ప దేశానికి మేలు జరగలేదు. వాళ్లకు 200 సీట్ల కంటే ఎక్కువ రావని వార్తలొస్తున్నాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే రాబోతోంది. భారాస ఎంపీలు గెలిస్తే నీళ్లు, నిధులు, మన బొగ్గు కాపాడుకునే అవకాశం ఉంటుంది. భారాస ఎంపీల గెలుపుతోనే తెలంగాణకు భవిష్యత్తు ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. నిస్వార్థపరుడు కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని కోరుతున్నా.

సీఎం ఎందుకు మాట్లాడరు?

నదులు అప్పగిస్తానంటే సీఎం చప్పుడు చేయరు. కృష్ణానదిని కేఆర్‌ఎంబీకి అప్పచెప్పారు. గోదావరి నీళ్లు ఎత్తుకుని పోతా. తమిళనాడుకు, కర్ణాటకకు ఇస్తా అని ప్రధాని మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రికి లేఖలు పంపిస్తుంటే దానికి సీఎం మాట్లాడటం లేదు.. గతంలో ఇదే ప్రతిపాదన నావద్దకు మోదీ తెస్తే. కేసీఆర్‌ బతికుండగా గోదావరి నీళ్లు తీసుకుపోతానంటే ఒప్పుకోనని చెప్పా. మోదీ అండదండలతో రూ.14 లక్షల కోట్లకు పడగెత్తిన అదానీ ప్రభుత్వ రంగ సంస్థలను కబళిస్తున్నారు. కరెంటు ఉత్పత్తి చేయడానికి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు కొనుగోలు చేయమన్నా అందుకు నేను ఒప్పుకోలేదు. సింగరేణిలో బొగ్గు ఉండగా బయటి నుంచి ఎందుకు తీసుకుంటామని అడ్డుకున్నా. ఇదే సీఎం దావోస్‌లో అదానీని తెలంగాణకు రండి. అంటూ ఆహ్వానించారు. పార్లమెంటు ఎన్నికలు కావడమే ఆలస్యం. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు కలిసి.. సింగరేణిని ఊడగొడతారు. తెలంగాణకు సింగరేణి కొంగుబంగారం. దీన్ని విస్తరించాలి. బయ్యారం ఉక్కు గనులు.. గోదావరి ఇసుక నిర్వహణ సింగరేణికే అప్పగించాలని ఆలోచించా.. అప్పట్లో సింగరేణి డైరెక్టర్‌ను ఆస్ట్రేలియాకు పంపా. మనం ఆస్ట్రేలియాలో సింగరేణి సంస్థ గనులు ఎందుకు పెట్టకూడదని ప్రయత్నించా.. రాబోయే రోజుల్లో సింగరేణిని ఊడగొట్టి అదానీకి అప్పగిస్తే కార్మికుల నోట్లో మట్టి పడుతుంది. సింగరేణి కార్మికులు చైతన్యంతో ఆలోచించాలి. పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌లను గెలిపిస్తే నేను ఏం చేయలేను. సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ కొప్పుల ఈశ్వర్‌ గెలిస్తే పార్లమెంటులో కొట్లాడతారు.

మళ్లీ కరెంటు కష్టాలు మొదలయ్యాయి

మా పాలనలో ఏనాడైనా కరెంటు కోతలను చూశారా. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక కరెంటు కోతలు మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 50 వేల ఎకరాలు ఎండిపోయాయని మా మిత్రులు చెబుతున్నారు. పేద ప్రజలకు రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇచ్చి ప్రతిరోజూ నీటిసరఫరా చేశాం. ఇప్పుడు రెండు రోజులకోసారి నీరు వస్తోంది.. అది కూడా మురికినీరు.. ఈ పాపం కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే.

ఆరు గ్యారంటీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటైనా అమలు చేసిందా.. మహిళలకు రూ.2,500 ఇస్తున్నారా.. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ జరిగిందా.. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేశారు.. ఇది మంచిదే కానీ.. ఆటో కార్మికుల కష్టాలను పట్టించుకున్నారా. గతంలో కల్యాణలక్ష్మి ఇచ్చేది. తులం బంగారం ఇస్తామన్నారు ఏమైంది.. సీఎం రేవంత్‌రెడ్డి ఏ ఊరికి పోతే ఆదేవుని మీద ఒట్టు వేస్తున్నారు. ఎవరైనా పని చేసేవారు దేవుని మీద ఒట్టుపెట్టుకుంటారా. నిరుద్యోగ భృతి ఏమైంది? కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని సీపీఐ, సీపీఎంలు చెబుతున్నాయి. మా ప్రభుత్వం వచ్చినపుడు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాం. 19 వేల మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పించాం. గోదావరిఖనిలోని మెడికల్‌ కళాశాలలో 5 శాతం కార్మికుల పిల్లలకు రిజర్వేషన్‌ కల్పించాం. చేనేత కార్మికులు అరిగోస పడుతున్నారు. వారికి రూ.370 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. చేనేత కార్మికుల కోసం గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఆర్డర్‌లు ఇవ్వడం లేదు. చేనేత కార్మికులు నిరోధ్‌లు.. పాపడాలు అమ్ముకోవాలని కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు. ఇది ధర్మమా అని కోపంలో మాట్లాడితే.. బిల్లులు ఇవ్వమని అడిగితే.. నామీద కుట్రతో నిషేధం పెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దేవుని బొమ్మ నెత్తిమీద పెట్టుకున్నా.. హిందువులు, ముస్లింలను అడ్డం పెట్టుకుని ప్రధాని మోదీ మాట్లాడినా ఈసీకి కనిపించదు. నీ గుడ్లు పీకి గోళీలాడుకుంటా.. పేగులు తీసి మెడలో వేసుకుంటా.. నిన్ను పండపెట్టి తొక్కుతా.. అంటూ ముఖ్యమంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నా.. ఎన్నికల సంఘానికి పట్టదు. చేనేత కార్మికుల కోసం మాట్లాడితే నాపై నిషేధం విధించారు. దీనిపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారు’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img