logo

జగన్‌ బాదుడు

అయిదేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్టీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. గుడివాడ నుంచి విజయవాడకు రైలు టికెట్‌ రూ.10 ఉండగా ఆర్టీసీ ఛార్జీ అయిదు రెట్లకుపైగా ఉంది.

Published : 28 Apr 2024 03:26 IST

ఆర్టీసీ ఛార్జీల పెంపుతో జనం విలవిల
న్యూస్‌టుడే, గుడివాడ గ్రామీణం, పామర్రు గ్రామీణం, అవనిగడ్డ

గుడివాడ నుంచి విజయవాడకు పల్లెవెలుగు ఛార్జీ రూ.55, ఎక్స్‌ప్రెస్‌ రూ.70, అల్ట్రాడీలక్స్‌కు రూ.85 వసూలు చేస్తున్నారు. ఐదేళ్ల కిందటి రేట్లతో పోలిస్తే ప్రతి టికెట్‌కు రూ.10 రూ.15 పెరిగింది.


పామర్రు నుంచి విజయవాడకు 45 కిలోమీటర్ల దూరం కాగా అయిదేళ్ల కిందట రూ.36గా ఉండే పల్లెవెలుగు ఛార్జీ అయిదేళ్లలో రూ.60కి పెంచారు. అయిదేళ్లలో చాలా మారింది.

యిదేళ్లలో మూడు సార్లు ఆర్టీసీ ఛార్టీలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది. గుడివాడ నుంచి విజయవాడకు రైలు టికెట్‌ రూ.10 ఉండగా ఆర్టీసీ ఛార్జీ అయిదు రెట్లకుపైగా ఉంది. గుడివాడ డిపోలో గతంలో 150కిపైగా సొంత బస్సులుండేవి. వైకాపా పాలనలో వాటి సంఖ్య 60కి పడిపోయిందని కార్మికులు వాపోతున్నారు. కొన్ని రూట్లలో అద్దె బస్సులు తీసుకుంటున్నారు. గతంలో పట్టణంలోని ఎయిడెడ్‌, ప్రైవేటు కళాశాలలకు ఉదయం, సాయంత్రం ఆర్టీసీ బస్సులు నడిపేవారు. నేడు రద్దు చేశారు. విద్యార్థుల బస్‌ పాస్‌ రేట్లు కూడా పెంచేశారు.

అవనిగడ్డ డిపోలో అన్నీ సమస్యలే..

అవనిగడ్డ ఆర్టీసీ డిపో బస్సులు ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితి. కొత్త టైర్లు వేయించడం లేదని,  రీత్రెడ్డింగ్‌ చేసిన టైర్లువల్ల ఇటీవల కరకట్ట మీదుగా విజయవాడ వెళ్లే రెండు/మూడు బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు ఎండలో, రాత్రి పూట అవస్థలు పడ్డారు. కోడూరు మండలంలో రాత్రి సమయంలో ఒక బస్సు ఆగిపోయి విద్యార్థులు ఇళ్లకు వెళ్లడం ఆలస్యమవడంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రి సభకు బస్సులు పంపించి అర్ధరాత్రి 2.30 గంటలకు నాగాయలంక నుంచి బయలుదేరి విజయవాడ రైల్వే స్టేషన్‌కు వెళ్లే సర్వీసును కూడా రద్దు చేయడంతో ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌, చెన్నై, విశాఖపట్నం వెళ్లే రైళ్లు అందుకోలేక రిజర్వేషన్‌ చేసుకొని నష్టపోయామని ప్రయాణికులు తెలిపారు. ‌్ర 2023 డిసెంబర్‌ 17న విజయవాడ కరకట్ట సర్వీసు బస్సు గుంతలో దిగి పల్టీకొట్టి రోడ్డుమార్జిన్‌లో పడింది. మూడేళ్ల కిందట యనమలకుదురు వద్ద విజయవాడ వెళ్లే  కరకట్ట బస్సు పల్టీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ రెండు ఘటనల్లో ప్రయాణికులు గాయాలతో బయట పడ్డారు.


రైళ్లలో ప్రయాణిస్తున్నాం

- కె.నారాయణ, సీజనల్‌ వ్యాపారి
అయిదేళ్లుగా ఆర్టీసీలో ఛార్జీలు తరచూ పెంచడం వల్ల చిరు వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే తాను రోజూ రైలులో ప్రయాణిస్తున్నాను. ప్రయాణ ఖర్చు తగ్గడంతో నా వ్యాపారంలో లాభం కూడా పెరిగింది.


సకాలంలో బస్సులుండవు

- ఎన్‌.రమేష్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థి

కళాశాలకు వెళ్లాలంటే ప్రహసనంగా మారింది. చాలా ఖర్చు చేసి బస్‌పాస్‌ కొనుక్కుంటే బస్సులు సకాలంలో రాక, వచ్చినా బస్‌ స్టాప్‌ వద్ద ఆగక అవస్థలు పడుతున్నాం. ఉదయం ఆలస్యంగా వెళ్లి కళాశాల వారు వెనక్కి పంపితే వెంటనే తిరిగి రావడానికి బస్‌ పాస్‌ చెల్లదంటున్నారు. దీంతో అదనపు ఖర్చు తప్పడం లేదు.


సామాన్యులపై భారం

- షేక్‌ బాబ్జి, వెంట్రప్రగడ

ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడింది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు ఇవ్వకుండా వాటితోనే నెట్టుకొస్తుండడంతో అవి ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తున్నాయి. దీంతో ప్రయాణం ఆలస్యమవుతోంది. వైకాపా ఐదేళ్ల పాలనలో ఆర్టీసీ సేవలు అంతగా బాలేవు. 


రన్నింగ్‌లోనే ఆగిపోతున్నాయి

- ఎర్నేని లక్ష్మి, జమీగొల్వేపల్లి

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమే కానీ ప్రస్తుతం రన్నింగ్‌లోనే ఆగిపోతున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా ప్రయాణం చేయాల్సి వస్తే ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది కొత్త బస్సులు నడపాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని