logo

నిధులు తేలేక.. పొలంపల్లి పడక

‘పోలంపల్లి డ్యాంకు 2004లో అప్పటి సీఎం వైఎస్‌ శంకుస్థాపన చేశారు కనుకే అధికారం చేపట్టిన తెదేపా పట్టించుకోలేదు. తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్‌ను తనయుడు పూర్తి చేసేలా మేమంతా కృషి చేస్తాం.

Published : 28 Apr 2024 03:36 IST

డ్యామ్‌ను ఐదేళ్లు పట్టించుకోని విప్‌ ఉదయభాను
ప్రకటనలకే పరిమితమైన మంత్రులు
ఈనాడు డిజిటల్‌-ఈనాడు

‘అన్న వస్తున్నాడని చెప్పండి.. అధికారం చేపట్టిన వెంటనే అన్ని సమస్యలు తీర్చుతామని కూడా చెప్పండి’
-ప్రతిపక్ష నేతగా ఊదరగొట్టిన జగన్‌మోహన్‌రెడ్డి


‘వైకాపా అధికారంలోకి వస్తే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారు. ఆయన తండ్రి రాజశేఖర్‌రెడ్డి మొదలు పెట్టిన మునేరు డ్యాం పెండింగ్‌ పనులు తనయుడే పూర్తి చేస్తారు’  
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉదయభాను


జగన్‌ మాయమాటలు... సామినేని ప్రగల్భాలు నమ్మిన అన్నదాతలు.. ఉదయభానుకు ఓట్లేసి గెలిపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత అప్పటి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, ప్రస్తుత గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ పోలంపల్లి వచ్చి డ్యాంని పరిశీలించారు.

‘పోలంపల్లి డ్యాంకు 2004లో అప్పటి సీఎం వైఎస్‌ శంకుస్థాపన చేశారు కనుకే అధికారం చేపట్టిన తెదేపా పట్టించుకోలేదు. తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్‌ను తనయుడు పూర్తి చేసేలా మేమంతా కృషి చేస్తాం. నిధులు మంజూరు చేయించి ఆరు నెలల్లో పనులు మొదలు పెడతాం’ అని మంత్రులు సెలవిచ్చారు. తరువాత నిధులు లేవు.. ప్రాజెక్టు వైపు తొంగిచూడలేదు. రైతుల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన ఉదయభాను నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారు. ఫలితంగా సుమారు 20 వేల ఎకరాలు ఎడారిగా మారే పరిస్థితి నెలకొంది.

బ్రిటిష్‌ కాలం నాటి...

మునేరుపై పోలంపల్లి వద్ద ఉన్న బ్రిటిష్‌ కాలం నాటి చిన్న ఆనకట్ట ద్వారా జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలోని 16,427 ఎకరాలకు అధికారికంగా సాగునీరు అందుతోంది. ఇంజిన్లు, మోటార్ల సాయంతో మరో 4 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తెలంగాణ నుంచి పారుతున్న మునేరుకు జూన్‌, జులై నుంచే వరద మొదలవుతుంది.  నాడు నీరు బాగా వచ్చేది. రెండు పంటలు పండేవి.

ఒక టీఎంసీ సామర్థ్యంతో...

క్రమేణా తెలంగాణ ప్రాంతంలో ఎత్తిపోతల పథకాలు, చెక్‌డ్యాంలు నిర్మించడంతో నీటి లభ్యత తగ్గిపోయింది. ఫలితంగా ఆనకట్ట ద్వారా ఒక్క పంటకు కూడా సక్రమంగా నీరందడం లేదు. అందుకే పోలంపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో డ్యాం నిర్మాణానికి 2004లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల అంచనాలు పెరుగుతూ వచ్చాయి. రూ.35 కోట్లు ఖర్చు చేసి డ్యాం కట్టి గేట్లు అమర్చకుండా వదిలేశారు. 2012లో వచ్చిన వరదలకు మట్టికట్టకు భారీ గండి పడింది. ఏటా వస్తున్న వరదకు గండి పెరిగి చివరికి తెలంగాణ వైపున్న భూములు కోతకు గురయ్యాయి.


పైసా ఖర్చుచేయని దుస్థితి

ప్రధాన మట్టికట్టకు పడిన గండి పూడ్చివేతకు 2022లో ప్రభుత్వం రూ.5.25 కోట్లు మంజూరు చేసింది. పనులు మొదలు పెట్టగానే తెలంగాణ రైతులు అభ్యంతరం తెలిపారు. ఫలితంగా పనులు ముందుకు సాగలేదు. గండి వల్ల తాము భూములు కోల్పోయామని, తెలంగాణ వైపు కట్టలు నిర్మించి, కోల్పోయిన భూములకు పరిహారం చెల్లించిన తర్వాతే గండి పూడ్చాలని డిమాండ్‌ చేశారు. దాంతో మంజూరు చేసిన నిధుల్లో పైసా కూడా ఖర్చు చేయలేకపోయారు.


ఎడారిగా మారి...

ష్టపరిహారం చెల్లించడం లేదని ఆగ్రహించిన తెలంగాణ రైతులు గత డిసెంబరులో పాత ఆనకట్టలో నీటి నిల్వ కోసం వేసిన కట్టను తెంచేశారు. ఎగువ నుంచి వచ్చే నీరు ఆయకట్టు కాల్వకు మళ్లడం లేదు. డ్యాం ఎడారిగా మారింది. మిర్చి, మొక్కజొన్న పంటలు ఎండిపోయాయి. తెలంగాణ రైతులకు నష్టపరిహారం అందినా.. ఇంకా గండి పూడ్చిలేదు. ప్రవాహం మొదలైతే పనులు చేయకపోతే కష్టం. ముందే మేల్కోవాలని రైతులు కోరుతున్నారు.


పొలాలు బీళ్లుగా మారుతాయి

- కంచేటి రమేష్‌, గుమ్మడిదుర్రు, రైతు

మునేరు ఆయకట్టు కిందట మూడెకరాల మాగాణి ఉంది. డ్యాం నుంచి సాగునీరు వస్తేనే వరి పండుతుంది. లేదంటే పొలాలు బీళ్లుగా మారుతాయి. వరద వస్తే గండి పూడ్చడం కష్టం. ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు.


పాత గండిని ఇప్పటికి పూడ్చలే

- కిలారు శ్రీను, పోలంపల్లి, రైతు

ఆనకట్ట పెండింగ్‌ పనులన్నీ చేస్తామని చెప్పిన పాలకులు ఐదేళ్లలో ఏమీ చేయలేదు. డ్యాంలో నీరు నిల్వ ఉండక కాలువలకు సరిగా సాగునీరు రావడం లేదు. పాత ఆనకట్ట గండి అలాగే ఉంది. తెలంగాణ రైతులు మరో గండి పెట్టారు. అదీ పూడ్చలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని