logo

భారం మోపనన్నారు.. బాదేశారు

అసలే అంతంత మాత్రపు బస్సులతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు పెరిగిన ఛార్జీలతో హడలిపోతున్నారు. కనీస ఛార్జి ఇంతకు ముందు రూ.5లు ఉంటే ప్రస్తుతం దానిని రూ.10లకు పెంచారు.

Published : 28 Apr 2024 03:53 IST

పెరిగిన ఛార్జీలు, డొక్కు బస్సులతో ప్రయాణికుల ఆందోళన
మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే

నాడు : ఓ అన్నా ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయా లేదా... ఓ అక్క భారం పెరిగిందా లేదా.. రేపు మనందరి ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ధరలు తగ్గించేస్తాం...  

- ఇవి  ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు.


నేడు: ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు... ఎన్ని రోజులు బస్సులు రద్దు చేస్తారో తెలియదు. ఉన్నవి అయినా కండిషన్‌లో ఉన్నాయా అంటే అదీ లేదు. ఎలాగోలా డొక్కు బస్సుల్లో అయినా ప్రయాణం చేద్దామంటే ఛార్జీలు పెంచేశారు. ఇది బాదుడు కాదా..ముఖ్యమంత్రికి తెలియదా

-  ఇది సామాన్య ప్రయాణికుల ఆవేదన

సలే అంతంత మాత్రపు బస్సులతో అవస్థలు పడుతున్న ప్రయాణికులు పెరిగిన ఛార్జీలతో హడలిపోతున్నారు. కనీస ఛార్జి ఇంతకు ముందు రూ.5లు ఉంటే ప్రస్తుతం దానిని రూ.10లకు పెంచారు. ఏడు కిలోమీటర్లు అయినా, 15 కిలోమీటర్లు అయినా రూ.20లు తీసుకోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెడన మండలంలోని చేవెండ్ర నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్లమన్నాడుకి రూ.20లు ఉండగా 15 కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పెడనకు అంతే మొత్తం వసూలు చేస్తున్నారు. మచిలీపట్నం నుంచి పెడన పట్టణానికి గతంలో రూ.10లు ఉండేది. ప్రస్తుతం దానిని రూ.20లు చేశారు. దీంతో ఎక్కువశాతం మంది ప్రయాణికులు ఆర్టీసీని వదిలి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. పెడన నుంచి బందరుకు రోజూ వారి పనుల నిమిత్తం వచ్చేవారితోపాటు ఇతర అవసరాలకోసం వేలాదిమంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. గతంలో ఆర్టీసీ బస్సు ఛార్జి రూ.10లు ఉంటే ఆటోలు రూ.20లు తీసుకునే వారు. దీంతో కొద్దిసేపు నిరీక్షించి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవారు. ప్రస్తుతం రెండూ ఒకే ధర కావడంతో ఆటోల్లో వెళ్లిపోతున్నారు. మచిలీపట్నం నుంచి చల్లపల్లికి గతంలో రూ.20లు ఉండగా ప్రస్తుతం రూ.30లకు పెరిగింది. ఇలా అన్ని రూట్లలోనూ విపరీతంగా పెంచేశారు. విద్యార్థుల పాస్‌ల ధరలు కూడా పెరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బస్సు టిక్కెట్‌ ధరలు పెంచడం సాధారణమే అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా క్రమపద్ధతి, కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు పెంచేశారంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


రోడ్లు అధ్వానం

తంతో పోల్చుకుంటే అన్ని ప్రాంతాల్లోనూ ప్రధాన రహదారులు పాడైపోయాయి. కేవలం గతుకుల రోడ్ల కారణంగా సమయం కూడా ఎక్కువ అవుతోంది. గమ్యానికి గంటకు రావాల్సిన బస్సు గంటన్నర నుంచి 2 గంటలు పడుతున్న సంఘటనలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పల్లెవెలుగు బస్సుల సమయాల్లో గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. బందరు డిపో పరిధిలో 35 పల్లెవెలుగు బస్సులు ఉంటే అవనిగడ్డ డిపో పరిధిలో 19, గుడివాడ 24, గన్నవరం 8, ఉయ్యూరు డిపోలో మూడు చొప్పున ఉన్నాయి. ఇవన్నీ అధ్వానంగా తయారయ్యాయి. సీట్లు ఊడిపోయి, అద్దాలకు దారాలు కట్టి ఉన్న వాటిని చూసి ప్రయాణికులు పాలకుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ పాతకాలపు బస్సులే. ప్రస్తుతం కొత్తవి కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో వాటికే మరమ్మతులు చేసి నెట్టుకొస్తున్నారు.


ఎప్పుడూ ఇలాలేదు

-మహ్మద్‌రఫీ, ఆకులమన్నాడు

ఆర్టీసీ ఛార్జీలు ఇష్టానుసారంగా పెంచిన దాఖలాలు గతంలో లేవు. ఆకులమన్నాడు, కప్పలదొడ్డి తదితర గ్రామాలకు చెందిన చేతివృత్తి కార్మికులు పెడన మీదుగా బందరు వెళ్తుంటారు. గతంలో అందరూ ఆర్టీసీనే వినియోగించుకునే వారు. ప్రస్తుతం ఛార్జీలు పెంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క కొత్త బస్సు వచ్చింది లేదు. అన్నీ పాతవే కావడంతో ప్రయాణం చేయడానికి కూడా వెనుకంజ వేయాల్సి వస్తుంది.


పద్ధతి లేకుండా పెంచారు

- నల్లమోతు శ్రీనివాసరావు, కమలాపురం

కమలాపురంలో బస్సు ఎక్కినా, చేవెండ్రలో ఎక్కినా పెడన వరకూ ఒకటే ఛార్జి వసూలు చేస్తున్నారు. మధ్యలో వడ్లమన్నాడు, రెడ్డిపాలెం, నడుపూరు దిగినా రూ.20లు తీసుకుంటున్నారు. కిలోమీటర్ల వ్యత్యాసం ఉన్నా అలా ఎలా పెంచారో అర్థం కావడం లేదు. పైగా బస్సులు తరచుగా మరమ్మతులకు గురవుతున్నాయి. కొన్నిసార్లు అయితే రోజుల తరబడి రావడం లేదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని