logo

అడుగేస్తే నిర్భంధం.. ప్రశ్నిస్తే కేసులు

గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు.

Updated : 29 Apr 2024 06:32 IST

ప్రతిపక్షాలు, ప్రజలపై వైకాపా నాయకుల దురాగతం
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల దందాలతో భీతిల్లుతున్న జనం
ఈనాడు డిజిటల్‌, గుడివాడ, న్యూస్‌టుడే, అవనిగడ్డ

గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాల్లో అయిదేళ్లుగా అధికార పార్టీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. కళ్లముందే జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలన్నా, ప్రశ్నించాలన్నా తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని ప్రజలు భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. కనీసం మంచి నీళ్లు రావడంలేదని చెప్పడానికి కూడా జనం ముందుకు రాలేకపోతున్నారు. వైకాపా నాయకులు అధికారుల నుంచి సామాన్యులపై దాడులకు తెగబడిన సంఘటనలూ లేకపోలేదు.

  • గుడివాడ మండలం మోటూరు గ్రామంలో వైకాపా నాయకుడు ఘంటా సురేష్‌ మట్టి మాఫియా వ్యవహారంలో అడ్డొచ్చిన ఆర్‌ఐ అరవింద్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.
  • అదే గ్రామంలో అక్రమంగా చెరువు తవ్విన వ్యవహారంలో పంచాయతీ కార్యదర్శి జనార్దనరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంతో అక్రమం ఆగలేదు.
  • గుడివాడ పట్టణంలో చైతన్య సహకార సొసైటీ పేరుతో ఉన్న సుమారు 8 ఎకరాల ప్లాట్లను ఆక్రమించుకొని వారిపై దాడులకు తెగబడి కొంత మంది స్థలాలను తమ పేరుతో రాయించుకున్నారు. బాధితులు ఫిర్యాదు చేసినా సర్వే చేయడానికి అధికారులు రాకుండా అక్రమార్కులు అడ్డుకున్నారు.
  • ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి ఒకరు షాపింగ్‌ కాంప్లెక్స్‌ వ్యవహారంలో వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం బాధితుడి సూసైడ్‌ నోట్‌ ద్వారా వెలుగులోకి ఇచ్చింది. బాధితుడి కుమారుడ్ని చంపుతామని వైకాపా నాయకుడొకరు బెదిరించగా అతడు పారారై టీవీ ఛానెళ్ల ముందు మొర పెట్టుకున్న విషయం తెలిసిందే.
  • వన్‌టౌన్‌ ఠాణా ముందున్న ఒక దుకాణం ఖాళీ చేసే విషయంలో దుకాణదారుడి నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.

ఎమ్మెల్యే వస్తే బయటకు రాలేదని ప్రహరీ కూల్చివేత

డప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రమేష్‌బాబు పర్యటన సందర్భంగా తెదేపా సానుభూతిపరుడైన ఇంటి యజమాని బయటకు రాలేదనే కక్షతో అతని స్థలం ఆక్రమణలో ఉందని ప్రహరీ, బయట కట్టించిన పక్కా డ్రెయిన్‌ను జేెసీబీతో తొలగించారు. డ్రెయినేజీ కట్టిస్తున్నామని, మీ స్థలం ఆక్రమణలో ఉందని పంచాయతీ అధికారులు 2023 జూన్‌లో పగలగొట్టించారు. 10 నెలలైనా డ్రెయిన్‌ కట్టించకుండా వదిలేశారు. సర్వే చేయించాలని ఇంటి యజమాని కోరినా పట్టించుకోలేదు. తను తెదేపా సానుభూతిపరుడ్ని కావడమే కారణమని బాధితుడు చెపుతున్నారు.

మోపిదేవి మండలం కె.కొత్తపాలంలో ఒక శుభకార్యంలో పనులు చేయడానికి గిరిజన మహిళల్ని పిలిచి వారిపై దొంగతనం అంటగట్టి  వైకాపా నాయకుడు తీవ్రంగా వేధించాడు. పనికి వచ్చిన ముగ్గురు మహళలను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఒక యువతిని దారుణంగా కొట్టడంతో పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. ఈ వ్యవహారంలో కేసు లేకుండా చేయాలని అధికార పార్టీ నాయకులు చూశారు. చివరికి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల జోక్యంతో ఇంటి యజమానిపైన కుటుంబ సభ్యులపైన కేసుకట్టారు.


కక్షగట్టి స్థలం  స్వాధీనానికి యత్నం

న్యూస్‌టుడే, అవనిగడ్డ: అవనిగడ్డలో తెదేపా కార్యకర్త యాసం వెంకటేశ్వరరావు తాతల నాటి నుంచి ఉంటున్న గృహం స్వాధీనానికి అధికార పార్టీ నాయకులు కుట్రపన్నారు. వారి ప్రోద్బలంతో పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఇల్లు స్వాధీనానికి రెండేళ్లుగా యత్నిస్తున్నారు. బాధితుడు హైకోర్టు నుంచి స్టే తెచ్చిన తర్వాత కూడా వారు వెనక్కి తగ్గకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయడంతో ఆగ్రహించి ఈనెల 24న వైకాపా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు నామినేషన్‌ ర్యాలీ సందర్భంగా వెంకటేశ్వరరావు ఇంటిపైకి టపాసులు వేసి దహనం చేసిన విషయం తెలిసిందే.


తెదేపా కార్యకర్తననే..

- యాసం వెంకటేశ్వరరావు, అవనిగడ్డ

నేను తెదేపా కార్యకర్తనని అధికార పార్టీ నాయకులు కక్షగట్టారు. నా ఇంటి స్థలం ప్రభుత్వ పోరంబోకు అని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు, పోలీసులను ఉపయోగించారు. మరుగుదొడ్లు, స్నానాల గది, పాక తొగించి, అందులో నుంచి దిగువకు రహదారి వేయాలని యత్నిస్తున్నారు. నా స్థలం పక్క నుంచి దశాబ్దాలుగా ట్రాక్టర్లు వెళ్లే రహదారి ఉంది. అయినా నా స్థలం నుంచి రహదారి వేసి స్వాధీనానికి యత్నిస్తున్నారు.


 అన్యాయాలను ఎదిరించినా..

గుడివాడలో కొనసాగుతున్న అన్యాయాలను ఎదిరించేందుకు ముందుకొచ్చిన తెదేపా నాయకులపై పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి తమ విధులకు ఆటంకం కలిగించారని అక్రమంగా ఎదురు కేసులు బనాయించారు.

  • చంద్రయ్యకాలువ గట్టుపై ఆక్రమణ తొలగింపునకు సమయం అడిగినందుకు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పలువురు తెదేపా నాయకులపై కేసు నమోదు చేశారు.
  • టిడ్కో కాలనీలో నిర్మాణ పనులు పరిశీలించేందుకు వెళ్లిన రావి వెంకటేశ్వరరావుపై టిడ్కో సిబ్బందితో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారు.
  • తెదేపా కార్యాలయంపై అధికార పార్టీ ముఠా దాడికి దిగితే ఒక పోలీసుతో రావి, తెదేపా నాయకులపై కేసులు నమోదు చేశారు.
  • తెదేపా నాయకుడు వెనిగండ్ల రాము గృహ నిర్బంధంలో ఉండగా పోలీసుల ఆదేశాలు ధిక్కరించి స్టేషన్‌కు వచ్చారని ఆయనపై కేసు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుపై సుమారు 15, తెదేపా నాయకులపై 25 వరకు కేసులు అక్రమంగా నమోదు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని